సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. టాస్క్ ఫోర్స్ పోలీసుల అప్రమత్తతతో వారంతా పరారయ్యారు. తిరుపతి శేషాచలం అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడుకు చెందిన సుమారు 25 మంది స్మగ్లర్లు తిరుపతిలోని కరకంబాడి రోడ్‌లోని అటవీ ప్రాంతం నుంచి ఫారెస్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
లోపలికి వెళ్లాక వారం రోజుల పాటు వారికి తినేందుకు సరిపడా ఆహారాన్ని కూడా వెంట తెచ్చుకున్నారు. నిత్యావసర వస్తువులతో సహా వచ్చిన వ్యాన్‌ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అయితే పోలీసులను గుర్తించిన స్మగ్లర్లు వారిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు ఒకదశలో కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నించటంతో స్మగ్లర్లు అక్కడనుంచి పరారయ్యారు. (నెల్లూరు జిల్లాలో పెను విషాదం)
వారు పరారైన ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న 75 కిలోల బియ్యం, కందిపప్పు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment