ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోవిడ్ నుంచి కోలుకున్నామని నిశ్చింతగా ఉండొద్దు, తుంటినొప్పులు తలెత్తుతుంటే అప్రమత్తం కావాలని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, బర్డ్ (తిరుపతి) డైరెక్టర్ ఎం మదన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ పమ్మి కార్తిక్‌రెడ్డి సూచించారు. నేడు ‘జాతీయ బోన్, జాయింట్ డే’ సందర్భంగా చెన్నై అన్నానగర్‌లోని సన్‌వే మెడికల్ సెంటర్‌లో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ వాడిన వారికి బ్లాక్‌ఫంగస్ వచ్చినట్లు తుంటినొప్పులు కూడా సంక్రమిస్తున్నాయి. వైద్య పరిభాషలో ‘ఏవాస్కులర్ నెక్రోసిస్’ వ్యాధిబారిన పడుతున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో వచ్చే బ్లాక్ ఫంగస్‌ను సులభంగా గుర్తించవచ్చు. అయితే ఈ ‘ఏవాస్కులర్ నెక్రోసిస్’ మూడు లేదా నాలుగు నెలల తరువాత గానీ బయటపడదు. అందుకే సెకెండ్‌వేవ్‌లో పాజిటివ్ నుంచి కోలుకున్న వారు ఇప్పుడిప్పుడే ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. తుంటి (నడుముకు ఇరువైపులా) భాగంలో సన్నని నరాలకు రక్తం సరఫరా తగ్గి కుళ్లిపోయినట్లుగా మారుతుంది. ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఒకటి, రెండు స్టేజీల్లో వైద్యుని సంప్రదిస్తే లాప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో చిన్నరంధ్రం వేసి పాడైపోయిన ప్రాంతాన్ని తొలగించవచ్చు. స్టెమ్‌సెల్ థెరపీతో పూర్తిగా నయం చేయవచ్చు.
3,4 దశలకు చేరుకుంటే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయకతప్పదు. తుంటి నొప్పిని ఏదోలే అని నిర్లక్ష్యం చేస్తే కేవలం కొద్ది వ్యవధిలోనే నాల్గోదశకు చేరుకుంటుంది. చిన్న నొప్పిగా ప్రారంభమై నడవలేని స్థితికి చేరుకుంటారు. స్టెరాయిడ్స్ వాడకం వల్లనే తుంటి నొప్పి సమస్యలు సంక్రమిస్తాయి. స్టెరాయిడ్స్ వాడిన ప్రతి ఒక్కరోగికి తుంటి సమస్య వస్తుందనే నిర్థారణ లేదు. అయితే అధికశాతం బాధితులుగా మారుతున్నారు. శరీరంలో విటమిన్ డి శాతం లోపిస్తే బోన్, జాయింట్ సమస్యలు క్యూ కడతాయి. ప్రతినిథ్యం ఉదయం కొద్దిసేపు శరీరంపై వేసవి కిరణాలు పడేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్ డి పెరుగుతుందని వారు విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment