సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సంఖ్య 2 వేలు దాటడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. కరోనా కేసులు మరింత పెరగకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై చర్చించారు. కరోనా కేసుల సంఖ్య ప్రబలకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అనూహ్యంగా పెరుగుతున్న కేసులు
కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నప్పుడు మాస్క్ ధరించడం, భౌతికదూరం, శానిటైజర్ వినియోగం వంటి జాగ్రత్తలు పాటించారు. ప్రభుత్వం సైతం పలు ఆంక్షలు విధించింది. అయితే ఈ ఏడాది జనవరి తరువాత కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. ప్రజల జీవనశైలి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదిలా ఉండగా, కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రారంభం కాగా, ఈ ప్రభావం తమిళనాడుపై కూడా పడింది. రాష్ట్రంలో గురువారం ఒక్క రోజే 2,069 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయింది. గరిష్టంగా చెన్నైలో 909 కేసులు నమోదయ్యాయి. అలాగే చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 చొప్పున నమోదయ్యాయి. దీంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు తదితర జిల్లాల ప్రజలు విధిగా మాస్క్‌ను ధరించాలని.. లేకుంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మరణాలు లేకపోవడం కొంత ఊరటనిస్తోంది.
అయితే కేసులు మరింత ఉధృతికి దారితీయకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సీఎం స్టాలిన్ అధికారులతో సమావేశమయ్యారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో గుంపులుగా చేరడం మానుకోవాలని, ఇళ్లనుంచి బయటకు వస్తే విధిగా మాస్క్ ధరించాలని, విద్యాసంస్థలు, కార్యాలయాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో తప్పనిసరిగా జ్వరం పరీక్షలకు ఏర్పాట్లు చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎం సూచించారు. అనంతరం టీబీ రహిత తమిళనాడు–2025 లక్ష్యంగా రూ.10.65 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన 23 డిజిటల్ ఎక్స్‌రే సంచార వాహనాల సేవలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
చెస్ ఒలింపియాడ్ ప్రచార వాహనాలు
తమిళనాడులో త్వరలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్–2022 పోటీలపై ప్రచారం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 15 బస్సులను సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. భార తదేశ చరిత్రలో తొలిసారిగా ప్రపంచస్థాయి చెస్ పోటీలు ఈనెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వర కు చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరుగనున్నాయి. 186 దేశాల నుంచి 2 వేలకు పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment