బడా స్మగ్లర్‌ కోసం వేట.. ‘ఆపరేషన్‌ మాణిక్యం’ ప్రారంభం | Police Hunting For Most Wanted Smuggler Manikyam | Sakshi
Sakshi News home page

బడా స్మగ్లర్‌ కోసం వేట.. ‘ఆపరేషన్‌ మాణిక్యం’ ప్రారంభం

Published Sat, Aug 7 2021 7:51 AM | Last Updated on Sat, Aug 7 2021 9:18 AM

Police Hunting For Most Wanted Smuggler Manikyam - Sakshi

తమిళనాడుకు చెందిన ఇతను ఎలా ఉంటాడో తెలియదు.. కనీసం ఇప్పటి వరకు సరైన ఆనవాళ్లు కూడా లేవు. అయితే పోలీసులు వారం కిందట మాణిక్యం ఇద్దరు కొడుకులతో పాటు జిల్లాలో అతని ముఖ్య అనుచరుడు, టీడీపీ నేతల దన్ను దండిగా ఉన్న నాయుడును వల వేసి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టార్గెట్‌ మాణిక్యం ఆపరేషన్‌ను పోలీసులు వేగవంతం చేశారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రెండుమూడేళ్ల కిందట అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైన పోలీసులు ఇప్పుడు రూటుమార్చారు. దుంగలతోపాటు ఎర్రచందనం దొంగలను కూడా పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టి స్మగ్లర్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్‌ తమిళనాడుకు చెందిన మాణిక్యం ఇద్దరు కుమారులతో పాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన దేవానంద నాయుడును అరెస్టు చేశారు.

చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లికి చెందిన నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సన్నిహితుడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. దాదాపు పదేళ్ల కిందట ఎర్రచందనం అక్రమ రవాణాలోకి అడుగుపెట్టిన నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగి.. స్మగ్లింగ్‌లో ఆరితేరాడు. ప్రధాన స్మగ్లర్‌ మాణిక్యంకు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు.

ముఠాలో ఆ నలుగురే కీలకం 
శేషాచలం అటవీ ప్రాంతంలోని విలువైన ఎర్ర బంగారం కోసం స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తిష్ట వేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాణిక్యం అక్కడి నుంచి రూటు మార్చి శేషాచలంలోని ఎర్రచందనంపై కన్నేశాడు. ఇందుకు అవసరమైన బ్యాచ్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాచ్‌లో రాజకీయ పలుకుబడి, ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న వారిని ఎంచుకున్నాడు.

వీరిలో ప్రముఖమైన వ్యక్తి ఐతేపల్లి వాసి దేవానంద నాయుడు. ఇతనితో పాటు తన ఇద్దరు కుమారులు ఎం.మనోజ్‌కుమార్, ఎం.అశోక్‌కుమార్‌ను ఆ ముఠాలో చేరి్పంచాడు. మొత్తంగా ఈ నలుగురు ముఠా సభ్యులను లీడ్‌ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. శేషాచలంలో  నాణ్యమైన ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి.. అనేది నాయుడు స్కెచ్‌ గీస్తాడు.

ఇక మాణిక్యం కొడుకులు ముఠాతో కలిసి ఆ ఎర్రచందనం చెట్లను నరకడం, తర్వాత వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాటిని తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. చెట్లు నరికేందుకు అడవిలో ఉన్న కూలీలకు నిత్యావసర సరుకుల సరఫరా పని కూడా చేస్తారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ పథకం ప్రకారం ఆ నలుగురూ చేస్తూ వస్తున్నారు.

ముగ్గురు చిక్కారు 
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అడవిలోకి చొరబడిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేశారు. వాటిని తరలించే వరకు అడవిలోని పలు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వారం రోజుల కిందట వాటిని బయటకు తీసి చెన్నైకి తరలిస్తుండగా జిల్లా పోలీసులు కాపుకాచి తమిళనాడులోని వేలూరు సమీపంలో పట్టుకున్నారు. కంటైనర్‌తో పాటు ఐతేపల్లికి చెందిన నాయుడు, మాణిక్యం ఇద్దరు కుమారులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఇక కంటైనర్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలన్నీ నాణ్యమైనవే అని పోలీసులు తేల్చారు. పోలీసులు స్వా«దీనం చేసు కున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పట్టుబడిన వారి నుంచి సమాచారం తీసుకున్న పోలీసులు మాణిక్యం వేటలో ఉన్నట్టు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement