
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎఫ్‌ఆర్‌ఓ
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని బ్రాహ్మణపల్లె సెక్షన్ గానుగపెంట బీటులోని కత్తిబండ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు బద్వేలు ఎఫ్‌ఆర్‌ఓ పి.సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఫారెస్టు బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గానుగపెంట బీటు సమీపంలోని కత్తిబండ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించగా కొందరు స్మగ్లర్లు తారసపడ్డారన్నారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన బేరిగురప్ప, పట్టణంలోని గౌరీశంకర్‌నగర్‌కు చెందిన కొండేటిరమణయ్యలు దొరికారన్నారు. అట్లూరు మండలం చలమగారిపల్లెకు చెందిన గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, పట్టణంలోని గౌరీశంకర్‌నగర్‌కు చెందిన మడమకుంట్ల నాగార్జున, పోరుమామిళ్ల మండలం రేపల్లెకు చెందిన అనకర్ల ప్రకాష్, ఏసిపోగు కిరణ్, ఏసిపోగు వెంకటేష్, అనకర్ల ప్రభాకర్, సోమిరెడ్డిపల్లె జయరాజ్‌లతో పాటు బద్వేలు మండలం బాలాయపల్లెకు చెందిన నాగిపోగు కల్యాణ్‌లు పరారయ్యారని తెలిపారు. వీరందరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న 426.5 కేజీల దుంగల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో డీఆర్‌ఓ జి.సుబ్బయ్య, ఎఫ్‌బీఓలు మునెయ్య, జాకీర్‌హుస్సేన్, రామసుబ్బారెడ్డి, నారాయణస్వామి, సుధాకర్, ఏబీఓ అక్బర్‌షరీఫ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment