సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత, రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లే ఉడ్ ప్యానల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచురీ ప్యానల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది.
వైఎస్సార్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచురీ ప్యానల్స్‌ను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది.
అంతేకాకుండా అనుమతులను వేగంగా మంజూరు చేసింది. దీంతో రెండేళ్లలోనే సెంచురీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం 490 ఎకరాల్లో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది. ఇందులో యాంకర్ యూనిట్‌గా సెంచురీ ప్యానల్స్‌కు 100 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు కేటాయించారు.
రైతులకు ప్రయోజనం
సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్‌పీఎల్) మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారు చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలోని వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్‌ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో యూకలిç³్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా యూకలిప్టస్‌ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80 శాతం మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు.
తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇ ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేల్‌లో యూనిట్ ఏర్పాటుకు సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీ, సబ్సిడీపై విద్యుత్ ఇచ్చాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ
సొంతూరులోనే ఉపాధి లభించింది..
2018లో ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉపాధి కోసం బయటి నగరాలకు వెళ్లలేక ఊర్లోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నా. ఇప్పుడు గోపవరంలో సెంచురీ ప్యానల్స్ ఏర్పాటుతో నాలాంటి ఎంతోమందికి స్థానికంగానే ఉపాధి లభించింది. సొంత ఊరిలో ఉద్యోగం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. – కాళ్ల రాజేష్, బుచ్చనపల్లె, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా
ఇక ఉద్యోగం రాదనుకున్నా..
ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు.– గుడి మెగురయ్య, కలసపాడు, వైఎస్సార్ జిల్లా
నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు..
సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ చెట్లు సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. – రూకల దేవదాసు, గోపవరం ప్రాజెక్టు కాలనీ, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment