స్మగ్లర్లను వదిలి... కూలీల కోసం... | Rights group will investigate Seshachalam 'encounter' | Sakshi
Sakshi News home page

స్మగ్లర్లను వదిలి... కూలీల కోసం...

Published Tue, Apr 14 2015 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Rights group will investigate Seshachalam 'encounter'

సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రకూలీల కాల్చివేత ఘటన వివాదస్పదంగా మారిన నేపథ్యంలో మృతులతోపాటు మిగిలిన ఎర్రకూలీలను చందనం స్మగ్లర్లుగా నిరూపించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటన అంతర్రాష్ట్ర వివాదంగా మారడం, హైకోర్టుతో పాటు జాతీయ మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ముఖ్యంగా తమిళ తలనొప్పిని తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే పోలీసులను రంగంలోకి దింపింది. పోలీసులు అధికార పార్టీకి చెందిన బడా చందనం స్మగ్లర్లను వదిలి తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపెట్టేందుకు స్వరం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు   కూలీల వద్ద దొరికిన ఫోన్ సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి సంబంధించిన ప్రధాన స్మగ్లర్ల పాత్ర బయటపడినట్లు సమాచారం. అధికారపార్టీ ముఖ్య నేతల  ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్మగ్లర్ల వివరాలను గోప్యంగా ఉంచి, ముందు ఎన్‌కౌంటర్ వివాదం నుంచి బయటపడేందుకు తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపేందుకు రంగంలోకి దిగారు.

ఫోన్ నెంబర్ల ఆధారంగా తమిళనాడుకు చెందిన కూలీల వివరాలను సేకరించి వారందరినీ స్మగ్లర్లుగా చూపించేందుకు ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన సీఐడీ పోలీసుల బృందం తమిళనాడులో గాలింపు చర్యలకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తమ వద్దనున్న ఆధారాలతో తమిళ కూలీలే స్మగ్లర్లంటూ తమిళనాడు ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో చూపించుకునేందుకు పోలీసులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. తమిళ కూలీలను శేషాచలం అడవుల్లోకి రప్పించడంలో జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికార పార్టీకి చెందిన స్మగ్లర్లు కీలకపాత్ర పోషించారని, వారిని తప్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని ఓ పోలీసు అధికారే స్వయంగా చెప్పడం విశేషం.
 
స్మగ్లర్ల ప్రోద్భలంతోనే అధికారులపై తిరుగుబాటు

గతంలో ఎర్రకూలీలు అటవీ, పోలీసు అధికారులపై స్మగ్లర్ల ప్రోద్భలం, భరోసాతోనే దాడులకు పాల్పడినట్లు కొందరు పోలీసు అధికారులే చెబుతున్నారు. స్మగ్లర్ల వెన్నుదన్ను లేకపోతే అధికారులపై దాడి చేసే ధైర్యం కూలీలకు లేదని వారు పేర్కొంటున్నారు. ఎర్రకూలీలు వారం రోజులు అడవిలో ఎర్రచందనాన్ని నరికితే అన్ని తామే చూసుకుంటామంటూ స్మగ్లర్లు రూ.30 నుంచి 50 వేల వరకు ముట్టజెప్పుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అటవీ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన ఎర్రకూలీలకు స్మగ్లర్లు ప్రోత్సాహకాల కింద ఒక్కొక్క కూలీకి రూ.10 నుంచి 15వేలు ముట్టజెప్పినట్లు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌చేసిన ఓ నేత ‘సాక్షి’కి వివరించారు. ఈ ఆనవాయితీని చాలా మంది స్మగ్లర్లు కొనసాగించారని, అందుకే ఎర్రకూలీలు అధికారులపై దాడులకు దిగారని ఆయన వివరించారు.
 
మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసుల్లో ఆందోళన
మృతిచెందిన ఎర్రకూలీల కుటుంబసభ్యులు ఆదివారం చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కాల్చివేతలో పాల్గొన్న టాస్క్‌ఫోర్సు పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. శేషాచలం కాల్పుల ఘటనలో 20 మంది కూలీలు మృతిచెందిన నేపథ్యంలో ఈ తరహా కేసులను స్పెషల్లీ గ్రేవ్ అఫెన్సుల కింద పరిగణిస్తారు. డీఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు మాత్రమే ఇలాంటి కేసులు దర్యాప్తు చేయాల్సిఉంది.

ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలను అధికారులు వెలుగులోకి తేవాలి. హత్యకేసు కింద దర్యాప్తు ప్రారంభిస్తే మృతుల స్వస్థలాల నుంచి మొదలుపెట్టి ఘటన స్థలం వరకు ప్రతి ఘట్టాన్ని సాక్ష్యాధారాలతో సహా రికార్డు చేయాలి. ప్రాథమికంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్‌పోర్సు బలగాల పూర్తి వివరాలతో పాటు వారు వినియోగించిన ఆయుధాలను మొదట స్వాధీనం చేసుకోవాలి. కాల్పులకు ముందు పాటించాల్సిన నిబంధనలు పాటించారా...? అనే అంశంతో పాటు బాధితుల్లో ఎవరు,  ఏ తూటా వల్ల చనిపోయారు..? అది ఏ తుపాకీ నుంచి వెలువడింది..? ఆ తుపాకీని ఉపయోగించింది ఎవరు..? అనేది తేల్చాలి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు తమిళనాడు నుంచి శేషాచలం వరకు ప్రతి అంశాన్ని నిర్ధారించి నమోదు చేయాల్సిఉంటుంది. దీంతో పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement