
దాడులు... కాల్పులు
- దద్దరిల్లిన శేషాచలం అడవులు
- పోలీసులపై ఎర్రకూలీల దాడి
- ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు
- ఎర్రకూలీ మృత అదుపులో మరొకరు..!
- బాలుపల్లె రేంజ్‌లో ఘటన
రాజంపేట/రైల్వేకోడూరు అర్బన్: పోలీసుల కాల్పులు, ఎర్రచందనం చెట్లను నరికే కూలీల గొడ్డళ్లు, రాళ్ల దాడులతో శేషాచలం అడవులు మరోసారి దద్దరిల్లాయి. పోలీసుల కాల్పులలో ఓ కూలీ మృతి చెందాడు. బాలుపల్లె రేంజ్ పరిధిలోని దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలో బుధవారం 25 మందితో కూడిన కూలీల బృందం ఎర్రచందనం చెట్లను నరికేపనిలో ఉన్నారు. ఇంతలో పోలీసుల బూట్ల చప్పుళ్లతో వారు అప్రమత్తమయ్యారు. కొంతదూరం నుంచే ఎర్రకూలీలను చూసిన స్పెషల్ పార్టీ పోలీసులు ముందస్తు హెచ్చరికగా గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే ఎర్రకూలీలు పోలీసులపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. తమ వద్ద ఉన్న గొడ్డళ్లతో పాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక కూలి మృతి చెందాడు.
మిగిలిన వారు పరారయ్యారు, బుధవారం సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చీకటి పడటంతో కూలీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం తరలిస్తామని డీఎస్పీ జీవీ రమణ తెలిపారు. కాగా మరో కూలీ పోలీసులకు పట్టుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఈ సందర్భంగా తిరుపతి డీఎఫ్‌ఓ మాట్లాడుతూ కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రకూలీలు గొడ్డళ్లతో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కాగా గతనెలలో శేషాచలం అటవీ ప్రాంతంలోనే పోలీసులు జరిపిన కాల్పులలో వీరమణి అనే ఎర్రకూలీ మృతి చెందాడు.