
బడా స్మగ్లర్లపై పోలీసు కన్ను
- చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు
- మూడో రోజూ రహస్య విచారణ
- శేషాచలం కొండల్లో కొనసాగుతున్న కూంబింగ్
- చెక్‌పోస్టుల్లో పోలీసు సిబ్బంది మోహరింపు
సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాల పోలీసులు బడా స్మగ్లర్లపై దృష్టి సారించారు. నిన్నమొన్నటి వరకు జిల్లాలోని స్థానిక స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న వీరు ప్రస్తుతం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల కోసం వేట ముమ్మరం చేశారు. చెన్నై స్థావరంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పేరుమోసిన బడా స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకునేందుకు చిత్తూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డాగా ఉన్న కటికనహళ్లి గ్రామంలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు మరో బృందాన్ని పంపించారు.
చెన్నై, బెంగళూరు పోలీసుల సహకారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఎలాగైనా ప్రధాన స్మగ్లర్లను పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు తిరుమల కొండల్లో అటవీ, పోలీసు శాఖలతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు కూంబింగ్ చేస్తున్నాయి. చామల, తిరుపతి, మామాండూరు అటవీ రేంజ్‌ల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తిరువణ్ణామలై జిల్లాకు ప్రత్యేక బృందాలు
డీఎఫ్‌వో వైల్డ్‌లైఫ్, తిరుపతి అర్బన్ ఎస్పీల సంయుక్త ఆధ్వర్యంలో తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు ప్రాంతాలకు పోలీసు, అటవీ శాఖల సంయుక్త బృందాలను పంపి అక్కడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శేషాచల కొండ ల్లో ఎర్రచందనం నరికేందుకు వస్తున్న వారిలో ఎక్కువ మంది తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు, జవ్వాదిహిల్స్ ప్రాంతాలకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండా చేయాలనే వ్యూహంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
పోలీసుల మోహరింపు
జిల్లాలోని ఎర్రవారిపాళెం, భాకరాపేట, రొంపిచెర్ల పోలీసుస్టేషన్లతోపాటు సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో పోలీసులను భారీగా మోహరించారు. చెక్‌పోస్టుల్లో పోలీసుల సంఖ్య పెంచాలని కలెక్టరు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగం గా జిల్లా పరిధిలో ఈ మార్పు చేశారు. చిత్తూరు, గుడిపాల సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
పీడీ యాక్టు పెట్టే యోచన
పోలీసులు ఇప్పటికే తాము అదుపులోకి తీసుకున్న స్థానిక స్మగ్లర్లపై పీడీ యాక్టు పెట్టారు. జిల్లా తూర్పు అటవీ శాఖ పరిధిలో కూడా ఎర్రచందనం దొంగలపై ఐపీసీ కేసులు నమోదు చేసి పీడీ యాక్టు మోపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న జిల్లాకు చెందిన నలుగురు స్మగ్లర్లను రహస్య ప్రదేశంలో విచారిస్తూనే ఉన్నారు. వీరినుంచి ఇంకా కొన్ని వివరాలు రాబట్టిన తర్వాత అరెస్టులు చూపించే అవకాశముంది. బుధవారం తిరుపతికి రానున్న కాబోయే సీఎం చంద్రబాబునాయుడుకు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి చేపట్టిన చర్యల గురించి ఎస్పీలు వివరించనున్నారు.
రేణిగుంటలో మరో నలుగురు..
రేణిగుంట, న్యూస్‌లైన్: స్మగ్లర్‌గా గుర్తించిన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన శేషు(35)తోపాటు మరో ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రేణిగుంట డీఎస్పీ బాదేపల్లి శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి రూ.10.09 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు, కత్తి, స్కార్పియో వాహనం, బంగారు చైను, రెండు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రేణిగుంట అర్బన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ అరెస్టు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఆంజనేయపురం చెక్‌పోస్టు వద్ద సీఐ రామచంద్రారెడ్డి, ఎస్‌ఐలు భాస్కర్ నాయక్, మధుసూదన్‌రావు, రఫీ నిఘా వేశారు. స్కార్పియోలో కోడూరు వైపు నుంచి అతివేగంగా వస్తుండగా వెంబ డించారు. శేషుతోపాటు డ్రయివర్ నగేష్(20), నరసింహులు(40), వీరయ్య(37)ను అరెస్టు చేశారు.
జంట హత్యల కేసులో నిందితుడి అరెస్ట్
తిరుమల శేషాచల అడవుల్లో ఇటీవల జరిగిన అటవీ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ హత్యల కేసులో నిందితుడు కర్ణాటక రాష్ట్రం కటికనహళ్లికి చెందిన జమాల్‌ఖాన్ అలియాస్ జమాల్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.