Red laborers
-
అడ్డుపడితే తప్పించాలనుకున్నారు
- విచారణలో ఎర్ర కూలీలు చెప్పారని ఏఎస్పీ వెల్లడి - కలసపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీ శాఖ సంయుక్త దాడి - 19 మంది తమిళ కూలీల అరెస్ట్ - 111 ఎర్రచందనం దుంగలు, ఐచర్ వాహనం, గొడ్డళ్లు స్వాధీనం కడప అర్బన్ : కాశినాయన మండల పరిధిలో గురువారం తెల్లవారుజామున పోలీసు, అటవీ శాఖ సంయుక్త దాడిలో పట్టుబడిన తమిళ కూలీలు తీవ్ర నిర్ణయాలతో అడవిలో అడుగు పెట్టారని ఏఎస్పీ (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్ శర్మ పేర్కొన్నారు. ఘటన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా వసంతపురం, చెంగం గ్రామాలకు చెందిన కూలీలు నెల క్రితం కర్ణాటకలోని కటిగనహళ్లి గ్రామంలో ఫయాజ్ షరీఫ్, కాలా ఫయాజ్, మౌల, బాబు బాయ్, మురగేషన్ తదితరులతో సమావేశమై ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగా వారు కర్ణాటకకు చెందిన మరికొందరితో కలిసి మొత్తం 26 మంది జిల్లాలోని అడవుల్లోకి ప్రవేశించారన్నారు. దుంగలను రవాణా చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడితే వారిని చంపి అయినా గమ్యం చేరాలని నిర్ణయించుకున్నారని పట్టుకున్న వారిని విచారించినప్పుడు తమకు తెలిసిందన్నారు. ఎర్రచందనం దుంగలను నరికి రవాణాకు సిద్ధం చేస్తుండగా తమకు సమాచారం అందిందని చెప్పారు. ప్రొద్దుటూరు డీఎఫ్ఓ రవిశంకర్, సిబ్బందితో కలిసి తాము గురువారం తెల్లవారుజామున కాశినాయన మండలం కొత్తకోట దాసరిపల్లె రిజర్వు ఫారెస్టులోకి వెళ్లామన్నారు. తోకరస్తా ప్రాంతంలో కూలీలు ఐచర్‌లోకి దుంగలు ఎత్తుతూ కనిపించగానే చుట్టుముట్టామన్నారు. వారు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించగా, చాకచక్యంగా 19 మందిని పట్టుకున్నామని, ఏడుగురు తప్పించుకుని పారిపోయారని వివరించారు. రూ.6 కోట్లకు పైగా విలువ చేసే 111 దుంగలు, ఐచర్ వాహనం, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కూలీలను పట్టుకోవడంలో సహకరించిన మైదుకూరు డీఎస్పీ ఎం.రామకృష్ణయ్య, ఎస్బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ కె.నరసింహామూర్తి, బి.కోడూరు ఎస్ఐ హరిప్రసాద్, పోరుమామిళ్ల ఎస్ఐ కృష్ణం రాజునాయక్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు జి.రాజేంద్రప్రసాద్, పుల్లయ్య, ఎస్ఐలు జె.శివశంకర్, ఎస్కే రోషన్, రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎస్ఎం బాష, నాగరాజు, వారి సిబ్బందితోపాటు అటవీ శాఖ అధికారులు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రామ్మోహన్‌రెడ్డి, ట్రైనీ రేంజ్ ఆఫీసర్ యామిని సరస్వతి, ఎఫ్ఎస్ఓ వెంకట శేషయ్యలను ఆయన అభినందించారు. -
స్మగ్లర్లను వదిలి... కూలీల కోసం...
సాక్షి, చిత్తూరు: శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రకూలీల కాల్చివేత ఘటన వివాదస్పదంగా మారిన నేపథ్యంలో మృతులతోపాటు మిగిలిన ఎర్రకూలీలను చందనం స్మగ్లర్లుగా నిరూపించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటన అంతర్రాష్ట్ర వివాదంగా మారడం, హైకోర్టుతో పాటు జాతీయ మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ముఖ్యంగా తమిళ తలనొప్పిని తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పోలీసులను రంగంలోకి దింపింది. పోలీసులు అధికార పార్టీకి చెందిన బడా చందనం స్మగ్లర్లను వదిలి తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపెట్టేందుకు స్వరం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు కూలీల వద్ద దొరికిన ఫోన్ సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి సంబంధించిన ప్రధాన స్మగ్లర్ల పాత్ర బయటపడినట్లు సమాచారం. అధికారపార్టీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్మగ్లర్ల వివరాలను గోప్యంగా ఉంచి, ముందు ఎన్కౌంటర్ వివాదం నుంచి బయటపడేందుకు తమిళ కూలీలనే స్మగ్లర్లుగా చూపేందుకు రంగంలోకి దిగారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా తమిళనాడుకు చెందిన కూలీల వివరాలను సేకరించి వారందరినీ స్మగ్లర్లుగా చూపించేందుకు ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన సీఐడీ పోలీసుల బృందం తమిళనాడులో గాలింపు చర్యలకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తమ వద్దనున్న ఆధారాలతో తమిళ కూలీలే స్మగ్లర్లంటూ తమిళనాడు ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో చూపించుకునేందుకు పోలీసులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. తమిళ కూలీలను శేషాచలం అడవుల్లోకి రప్పించడంలో జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికార పార్టీకి చెందిన స్మగ్లర్లు కీలకపాత్ర పోషించారని, వారిని తప్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని ఓ పోలీసు అధికారే స్వయంగా చెప్పడం విశేషం. స్మగ్లర్ల ప్రోద్భలంతోనే అధికారులపై తిరుగుబాటు గతంలో ఎర్రకూలీలు అటవీ, పోలీసు అధికారులపై స్మగ్లర్ల ప్రోద్భలం, భరోసాతోనే దాడులకు పాల్పడినట్లు కొందరు పోలీసు అధికారులే చెబుతున్నారు. స్మగ్లర్ల వెన్నుదన్ను లేకపోతే అధికారులపై దాడి చేసే ధైర్యం కూలీలకు లేదని వారు పేర్కొంటున్నారు. ఎర్రకూలీలు వారం రోజులు అడవిలో ఎర్రచందనాన్ని నరికితే అన్ని తామే చూసుకుంటామంటూ స్మగ్లర్లు రూ.30 నుంచి 50 వేల వరకు ముట్టజెప్పుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అటవీ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన ఎర్రకూలీలకు స్మగ్లర్లు ప్రోత్సాహకాల కింద ఒక్కొక్క కూలీకి రూ.10 నుంచి 15వేలు ముట్టజెప్పినట్లు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్చేసిన ఓ నేత ‘సాక్షి’కి వివరించారు. ఈ ఆనవాయితీని చాలా మంది స్మగ్లర్లు కొనసాగించారని, అందుకే ఎర్రకూలీలు అధికారులపై దాడులకు దిగారని ఆయన వివరించారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసుల్లో ఆందోళన మృతిచెందిన ఎర్రకూలీల కుటుంబసభ్యులు ఆదివారం చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కాల్చివేతలో పాల్గొన్న టాస్క్ఫోర్సు పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. శేషాచలం కాల్పుల ఘటనలో 20 మంది కూలీలు మృతిచెందిన నేపథ్యంలో ఈ తరహా కేసులను స్పెషల్లీ గ్రేవ్ అఫెన్సుల కింద పరిగణిస్తారు. డీఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు మాత్రమే ఇలాంటి కేసులు దర్యాప్తు చేయాల్సిఉంది. ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలను అధికారులు వెలుగులోకి తేవాలి. హత్యకేసు కింద దర్యాప్తు ప్రారంభిస్తే మృతుల స్వస్థలాల నుంచి మొదలుపెట్టి ఘటన స్థలం వరకు ప్రతి ఘట్టాన్ని సాక్ష్యాధారాలతో సహా రికార్డు చేయాలి. ప్రాథమికంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్‌పోర్సు బలగాల పూర్తి వివరాలతో పాటు వారు వినియోగించిన ఆయుధాలను మొదట స్వాధీనం చేసుకోవాలి. కాల్పులకు ముందు పాటించాల్సిన నిబంధనలు పాటించారా...? అనే అంశంతో పాటు బాధితుల్లో ఎవరు, ఏ తూటా వల్ల చనిపోయారు..? అది ఏ తుపాకీ నుంచి వెలువడింది..? ఆ తుపాకీని ఉపయోగించింది ఎవరు..? అనేది తేల్చాలి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు తమిళనాడు నుంచి శేషాచలం వరకు ప్రతి అంశాన్ని నిర్ధారించి నమోదు చేయాల్సిఉంటుంది. దీంతో పోలీసులు మరింత ఆందోళన చెందుతున్నారు.