అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా ఆటకట్టు  | International smugglers gang arrested in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా ఆటకట్టు 

Published Wed, Nov 3 2021 5:37 AM | Last Updated on Wed, Nov 3 2021 5:37 AM

International smugglers gang arrested in Andhra Pradesh - Sakshi

నిందితులను, ఎర్రచందనం దుంగలను చూపుతున్న ఎస్పీ ఫక్కీరప్ప, పోలీసు అధికారులు

అనంతపురం క్రైం: శేషాచలం అడవుల నుంచి చెన్నై, శ్రీలంక మీదుగా చైనాకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌ చేసే అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్‌ బాయి ముఠా గుట్టును హిందూపురం రూరల్‌ పోలీసులు రట్టు చేశారు. ఇటీవల చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో హిందూపురం రూరల్‌ సీఐ హమీద్‌ఖాన్, చిలమత్తూరు ఎస్‌ఐ రంగడు యాదవ్‌ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల విలువ చేసే 3,305 కిలోల 165 ఎర్రచందనం దుంగలతోపాటు ఐదు వాహనాలు, 19 మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించి 21 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 19 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో 8 మంది తమిళనాడు, ఐదుగురు వైఎస్సార్‌ జిల్లా, ఆరుగురు చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వెల్లడించారు. 

దుబాయ్, కొలంబో వేదికగా.. 
ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో చెన్నయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్‌ హమీద్‌ అలియాస్‌ సాహుల్‌భాయ్‌ కీలక నిందితులు. బిలాల్‌ శ్రీలంక రాజధాని కొలంబోలో, సాహుల్‌భాయ్‌ దుబాయ్‌లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. వీరిద్దరూ చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి, దుంగలను తమిళనాడులోని తిండివనం తరలించి గోదాముల్లో నిల్వ చేసేవారు. అక్కడి నుంచి చెన్నయ్, శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు తరలించి భారీగా సొమ్ము చేసుకునేవారు. సాహుల్‌భాయ్‌పై వైఎస్సార్‌ జిల్లాలో 45, తిరుపతిలో సుమారు 40 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి.

బిలాల్‌పై వైఎస్సార్‌ జిల్లాలో 10 కేసులున్నాయి. ప్రస్తుత కేసులో పోలీసులు సాహుల్‌భాయ్‌ని ఏ–12గా, బిలాల్‌ను ఏ–13గా చేర్చారు. వీరిద్దరికీ ముఖ్య అనుచరుడైన కామేష్‌బాబు (కార్బైడ్‌ కాలనీ, కొడుంగైయూర్, చెన్నయ్‌) సహా 19 మంది పోలీసులకు చిక్కారు. కామేష్‌బాబుపై వైఎస్సార్‌ జిల్లాలో 16 కేసులు, తిరుపతిలో సుమారు 15 కేసులున్నాయి. ఇతనితో పాటు తిరుపతికి చెందిన జె.గురువయ్య, ఎం.జ్ఞానేంద్ర ప్రసాద్‌ (మురుగానపల్లి), ఇ.పునీత్‌కుమార్‌ (గిరింపేట), బి.రాకేష్‌ (చిత్తూరు), జులపాల సుబిరమని కొట్టి (కేవీబీ పురం), వినోద్‌కుమార్‌ గాంధీ (చెన్నయ్‌), తంగదురై రాజుకుమార్‌ (చెన్నయ్‌), కె.రవి (పల్లతుర్‌), ఎస్‌.కమలేష్‌ కుమార్‌ (తెన్పల్లిపట్టు), కుమార్‌బాబు (తిరువళ్లూరు), వైఎస్సార్‌ జిల్లాకు చెందిన నంద్యాల రామకృష్ణారెడ్డి, అంబరపు ఓబులేసు (మిట్టపల్లి), బోయిని రామనరసింహులు (ఉప్పరపల్లి), బిజివేముల జయసుబ్బారెడ్డి (బద్వేలు), పిచ్చిపాటి శ్రీనివాసులరెడ్డి (బొగ్గడివారిపల్లి),  ఏనుగుల కేశవరెడ్డి (అన్నవరం, చాపాడు మండలం), అనంతపురం జిల్లా సోమన్నపల్లికి చెందిన కాకర్ల రామచంద్ర, నెల్లూరు జిల్లా నందిమలకు చెందిన సర్వాది ప్రసన్నకుమార్‌ కూడా పోలీసులకు చిక్కారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement