international smugglers
-
అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా ఆటకట్టు
అనంతపురం క్రైం: శేషాచలం అడవుల నుంచి చెన్నై, శ్రీలంక మీదుగా చైనాకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్ బాయి ముఠా గుట్టును హిందూపురం రూరల్ పోలీసులు రట్టు చేశారు. ఇటీవల చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో హిందూపురం రూరల్ సీఐ హమీద్‌ఖాన్, చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల విలువ చేసే 3,305 కిలోల 165 ఎర్రచందనం దుంగలతోపాటు ఐదు వాహనాలు, 19 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించి 21 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 19 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 8 మంది తమిళనాడు, ఐదుగురు వైఎస్సార్ జిల్లా, ఆరుగురు చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. దుబాయ్, కొలంబో వేదికగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చెన్నయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లు బిలాల్, సాహుల్ హమీద్ అలియాస్ సాహుల్‌భాయ్ కీలక నిందితులు. బిలాల్ శ్రీలంక రాజధాని కొలంబోలో, సాహుల్‌భాయ్ దుబాయ్‌లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. వీరిద్దరూ చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి, దుంగలను తమిళనాడులోని తిండివనం తరలించి గోదాముల్లో నిల్వ చేసేవారు. అక్కడి నుంచి చెన్నయ్, శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు తరలించి భారీగా సొమ్ము చేసుకునేవారు. సాహుల్‌భాయ్‌పై వైఎస్సార్ జిల్లాలో 45, తిరుపతిలో సుమారు 40 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. బిలాల్‌పై వైఎస్సార్ జిల్లాలో 10 కేసులున్నాయి. ప్రస్తుత కేసులో పోలీసులు సాహుల్‌భాయ్‌ని ఏ–12గా, బిలాల్‌ను ఏ–13గా చేర్చారు. వీరిద్దరికీ ముఖ్య అనుచరుడైన కామేష్‌బాబు (కార్బైడ్ కాలనీ, కొడుంగైయూర్, చెన్నయ్) సహా 19 మంది పోలీసులకు చిక్కారు. కామేష్‌బాబుపై వైఎస్సార్ జిల్లాలో 16 కేసులు, తిరుపతిలో సుమారు 15 కేసులున్నాయి. ఇతనితో పాటు తిరుపతికి చెందిన జె.గురువయ్య, ఎం.జ్ఞానేంద్ర ప్రసాద్ (మురుగానపల్లి), ఇ.పునీత్‌కుమార్ (గిరింపేట), బి.రాకేష్ (చిత్తూరు), జులపాల సుబిరమని కొట్టి (కేవీబీ పురం), వినోద్‌కుమార్ గాంధీ (చెన్నయ్), తంగదురై రాజుకుమార్ (చెన్నయ్), కె.రవి (పల్లతుర్), ఎస్.కమలేష్ కుమార్ (తెన్పల్లిపట్టు), కుమార్‌బాబు (తిరువళ్లూరు), వైఎస్సార్ జిల్లాకు చెందిన నంద్యాల రామకృష్ణారెడ్డి, అంబరపు ఓబులేసు (మిట్టపల్లి), బోయిని రామనరసింహులు (ఉప్పరపల్లి), బిజివేముల జయసుబ్బారెడ్డి (బద్వేలు), పిచ్చిపాటి శ్రీనివాసులరెడ్డి (బొగ్గడివారిపల్లి), ఏనుగుల కేశవరెడ్డి (అన్నవరం, చాపాడు మండలం), అనంతపురం జిల్లా సోమన్నపల్లికి చెందిన కాకర్ల రామచంద్ర, నెల్లూరు జిల్లా నందిమలకు చెందిన సర్వాది ప్రసన్నకుమార్ కూడా పోలీసులకు చిక్కారు. -
నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్
రాజంపేట రూరల్: పేరు మోసిన నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వైఎస్సార్ జిల్లా రాజంపేట డీఎస్పీ ఏ.రాజేంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేకోడూరు సమీపంలోని మాధవరంపోడు వద్ద రైల్వేకోడూరు సీఐ రసూల్సాహెబ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో ఓ కారు వాగేటికోన వైపు నుంచి వచ్చిందన్నారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులోని నలుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులు చైనాకు చెందిన చన్చంగ్డబ్ల్యూయూ, చన్చంగాయ్గా గుర్తించామన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అనుచరుడైన తమిళనాడుకు చెందిన డి.పద్మనాభన్‌గా గుర్తించామన్నారు. అమీర్హాజా అనే వ్యక్తి డిప్యూటీ డైరెక్టర్‌గా గతంలో అటవీశాఖలో విధులు నిర్వర్తించారన్నారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి తొమ్మిది ఎర్రచందనం దుంగలను కారులో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. కారును, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్
వైఎస్సార్ జిల్లా: నలుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. మంగళవారం కోడూరు మండలం మాధవరం పోడు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు చైనీయులు, ఇద్దరు తమిళులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు, ఫోక్స్ వ్యాగన్ కారును స్వాధీనం చేసుకున్నారు. -
ఏడుగురు అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్లు అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఏడుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప- కర్నూలు హైవేపై దౌలతాపురం గ్రామం వద్ద వారు పట్టుబడ్డారని ఓఎస్డీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఫోర్డ్ కారులో వెళ్తున్న వారిని కాపు కాసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 768 కిలోల బరువైన 30 దుంగలతోపాటు ఒక ల్యాప్‌టాప్,11సెల్ఫోన్లు, విదేశీ, స్వదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఏడుగురిలో ఇద్దరు చైనీయులు కాగా, ముగ్గురు న్యూఢిల్లీ, ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బలగాలు, జిల్లా పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. -
బడా స్మగ్లర్ల కోసం అన్వేషణ
సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో వేట ముమ్మరం చేశారు. కొంత కాలంగా టాస్క్‌ఫోర్స్ టీం పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొందరు బడా స్మగ్లర్లను పట్టుకునేందుకు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మకాం పెట్టింది. ఢిల్లీతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో తిరుగుతూ స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. బెంగుళూరు, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లో కడప పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎర్ర స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు. ఢిల్లీకి చెందిన జయపాల్, కింకుశర్మ, నేపాల్‌కు చెందిన లక్ష్మిడాంగ్ అనే స్మగ్లర్లను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్ల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు చైనా స్మగ్లర్ల కోసం కూడా వేట సాగిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బడా స్మగ్లర్లను కడపకు తీసుకురానున్నారని తెలిసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల నుంచి అందిన సమాచారం మేరకు ఎర్రచందనం డంప్‌పై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా బెంగుళూరుతోపాటు వివిధ ప్రాంతాల్లో దాచిన రెండు టన్నుల మేర ఎర్రచందనం దుంగలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. -
63 కేజీల పసిడి పట్టివేత
* విశాఖ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం: భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఏకంగా 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన తనిఖీలు సోమవారం రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత బంగారం పట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన కొందరు ముఠాలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల లోపలి భాగాల్లో ఉంచడం ద్వారా సింగపూర్, మలేసియా దేశాల నుంచి హైదరాబాద్, విశాఖలకు భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ చెన్నై జోనల్ యూనిట్‌కు సమాచారం అందింది. వెంటనే అధికారులు హైదరాబాద్, విశాఖలకు ప్రత్యేక బృందాలతో చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9.10 సమయంలో కౌలాలంపూర్ నుంచి విశాఖ వచ్చిన ఎయిర్ ఏషియా 83, మిలిందో 251(రాత్రి 10.05గంటలు) విమానాలతో పాటు సింగపూర్ నుంచి వచ్చిన సిల్క్ ఎయిర్ ఎంఐ442 (రాత్రి 11గంటలు) విమానంలో స్మగ్లింగ్ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మూడు విమానాల్లోని ప్రయాణికులను, వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చే శారు. 56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మ్యూజిక్ సిస్టమ్‌లు, యాంప్లిఫయర్లు, మినీ వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రిక్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్, టీవీ, ఇతర పరికరాల్లో బంగారం దాచి తీసుకువస్తున్నట్లు తేల్చారు. మొత్తం రూ.16.85 కోట్ల విలువైన 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శర్మ కస్టమ్స్ అధికారులకు సహకరించారు. తనిఖీలు పూర్తి చేసుకున్న ప్రయాణికుల్లో తమిళనాడుకు చెందిన పలువురు ఉన్నారు. మరోవైపు నిందితుల తరఫున కొందరు తమిళనాడు నుంచి విశాఖ చేరుకున్నారు. దీంతో విమానాశ్రయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను భారీగా మోహరించారు. -
‘బంగారు’ గని
- గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిన విశాఖ ఎయిర్‌పోర్టు - సింగపూర్, దుబాయ్ నుంచి భారీగా వస్తున్న గోల్ట్ బిస్కెట్లు - మూడు వారాల్లో 70మంది అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దీటుగా తీర్చిదిద్దుతామని తరచు నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. అభివృద్ధి విషయమేమో గానీ ఇక్కడ శంషాబాద్‌ను తలదన్నే రీతిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ స్మగ్లర్లకు విశాఖ విమానాశ్రయం బంగారు గనిగా మారింది. ఇరవై రోజుల్లో మూడు సంఘటనలు విశాఖ విమానాశ్రయంలో గడిచిన కొద్ది రోజులుగా గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దాదాపు 60మంది పట్టుబడ్డారు. ఈ నెల 2న దుబాయ్ నుంచి విశాఖకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1- 952 ద్వారా బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు వ్యక్తులు కస్టమ్స్‌కు చిక్కారు. వారి నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1-952 నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.1.12 కోట్ల విలువైన 4.2 కేజీల బంగారం దొరికింది. రెండు ఉదంతాల్లోనూ స్మగ్లర్లు ఎయిర్ ఇండియా విమానాలనే వినియోగించడం విశేషం. నిజానికి స్మగ్లర్లు ఇంత ధైర్యంగా తమ కార్యకలాపాలు సాగించడానికి విమాన సిబ్బంది సహకారం కూడా వారికి లభిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. బంగారం స్మగ్లింగ్‌కు అడ్డా కేవలం ఒక్క విమాన సర్వీసుతో ప్రారంభమై రెండేళ్ల క్రితం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం 13 సర్వీసులు నడుపుతున్నారు. అయితే ఇదే స్మగ్లర్లకు వరంగా మారింది. ఇక్కడ భద్రతా ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉండటాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2013-14లో రూ.2.01 కోట్ల విలువైన రూ.6.67 కేజీల బంగారం దొరికింది. 2014-15 మధ్య రూ.2.04 కోట్ల విలువైన 7.62 కేజీల బంగారం పట్టుబడింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రూ.3.06 కోట్ల విలువైన 11.06 కేజీల బంగారం బిస్కెట్లు దొరికాయి. తాజాగా పట్టుబడింది కలిపితే ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. మహిళలు సైతం స్మగ్లింగ్‌లో పట్టుబడటం విమానాశ్రయ చరిత్రలోనే ఈ ఏడాది తొలిసారిగా చోటుచేసుకుంది. 2003 నుంచి ఇప్పటివరకు 17 మందిని గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి రూ.3.75 కోట్ల కస్టమ్స్ డ్యూటీని వసూలు చేశారు. స్మగ్లింగ్ రాకెట్ కొత్త ఎత్తులు దుబాయ్ నుంచి బంగారం బిస్కెట్లను తరలించడానికి స్మగ్లింగ్ రాకెట్లు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నారు. హైదరాబాద్, విశాఖలను అడ్డాగా వాడుకుంటున్నారు. సాధారణ ప్రయాణికులతో స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, శరీరం లోపల గోల్డ్‌బిస్కెట్లు పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రయాణికులకు సాధారణ స్కానింగ్ మాత్రమే ఉండటం వీరికి కలిసివస్తోంది. మన వాళ్లు ఇంకా డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ మాత్రమే వాడుతున్నారు. అనుమానం వస్తే గానీ ఏ ప్రయాణికుడినీ క్షుణ్ణంగా తనిఖీ చేయరు. కనీసం డాగ్ స్క్వాడ్ కూడా లేదు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత!
సాక్షి, కడప : ‘ఎర్ర’ స్మగ్లర్ల వరుస అరెస్టులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో అంతర్జాతీయ స్మగ్లర్లు బొడ్డె వెంకట రమణ, మణి అణ్ణన్, బదాని, ప్రేమ్తార్, కిన్వున్ఫ్యాన్లతోపాటు తాజాగా శనివారం జంగాల శివశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా శనివారం ఉదయం వాహనంతో పోలీసులను ఢీకొట్టేలా వచ్చి పారిపోయేందుకు ప్రయత్నిం చిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్‌తోపాటు మరో ఏడుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి వాహనాలలో కడపకు వచ్చిన శివశంకర్.. శేషాచలం అడవుల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను పొలతల అటవీ ప్రాం తంలో ఓపెల్ అస్ట్రా, టాటా ఇండికా కార్లలో లోడ్ చేసుకున్నారని తెలి పారు. బెంగళూరు వరకు దారిలో ముందు పెలైట్‌గా కొందరు వెళుతుండగా మిగిలిన వారు వెనుక వాహనాల్లో వచ్చేటట్లు ప్రణాళిక రూపొం దించినట్లు ఎస్పీ వివరించారు. జం గాల శివశంకర్, మరో ఇద్దరు కార్లలో బయలుదేరి పొలతల అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు వెళ్లేందుకు వస్తుం డగా తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు పొలతల రిజర్వు ఫారెస్టులోని నీరుకోన శివాలయం వద్ద దుంగలను లోడు చేసుకుని కార్లలో, లారీల్లో బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న మిగిలిన నిందితులను పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. జంగాల శివశంకర్ ఒంటిమిట్ట మండలం గాండ్లపల్లె గ్రామానికి చెందిన వాడని, తిరుపతిలో ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టేవాడన్నారు. అతని అనుచరులు కర్ణాటక రాష్ర్టం హోస్పేట తాలూకాలోని శంకనిపురానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ అలీ, చిత్తూరు జిల్లా బాసినకొండ గ్రామానికి చెందిన బి.సురేంద్రనాయక్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి, కర్ణాటకకు చెందిన సయ్యద్ ఆరీఫ్, వైఎస్సార్ జిల్లా మిట్టపల్లెకు చెందిన డి.రవిశంకర్, నందలూరు మండలం చింతకుంటకు చెందిన పులి కృష్ణయ్య, వల్లూరు మండలం పుష్పగిరికి చెందిన డి.శ్రీను తదితరులను కూడా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.8 కోట్ల విలువైన 42 టన్నుల (190) దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శివశంకర్ పీడీ యాక్టు కింద రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి 2014లో విడుదలయ్యాడని వివరించారు. బొడ్డె వెంకటరమణ ద్వారా సమాచారం మే నెల మొదటి వారంలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ బొడ్డె వెంకట రమణను అరెస్టు చేసిన తర్వాత విచారణలో జంగాల శివశంకర్ గురించి తెలిసిందని ఎస్పీ వివరించారు. శివశంకర్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా సాగించాడన్నారు. ఇతనికి సయ్యద్ ఆసిఫ్ అలీ, సురేంద్రనాయక్, సయ్యద్ ఆరీఫ్‌లు ప్రధాన అనుచరులు కాగా.. ఆసిఫ్ అలీ కర్ణాటక రాష్ట్రం శంకనిపురం గ్రామ సర్పంచ్‌గా 2002లో పనిచేశాడని, 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరోమారు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడన్నారు. ఇతనికి కర్ణాటక రాష్ట్రంలోని కటిగనహళ్లి, బెంగళూరులో ఉన్న కొందరు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. డి.రవిశంకర్ అనుచరులైన పులి కృష్ణయ్య, శ్రీనివాసులు ద్వారా జిల్లాలోని అడవుల్లో కూలీలతో ఎర్రచందనం చెట్లను నరికించి దుంగలుగా చేసి రవిశంకర్ స్నేహితుడైన తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి ద్వారా జంగాల శివశంకర్ కర్ణాటకకు చెందిన ఆసిఫ్ అలీ, సయ్యద్ ఆరీఫ్‌లకు అమ్మేవాడన్నారు. కూరగాయల వాహనాల్లో దుంగలను తరలించేవారన్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అభినందనలు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ అభినందించారు. ప్రత్యేకంగా రివార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఎస్బీ డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాపులు, ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, బి.వెంకట శివారెడ్డి, మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు హేమకుమార్, రోషన్, శివశంకర్, ఎస్.మహబూబ్‌బాష, రాజేశ్వరరెడ్డి, పెద్ద ఓబన్న, ఆర్వీ కొండారెడ్డి, నాగరాజు, సురేష్‌రెడ్డి, రామచంద్ర, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. -
పోలీసు ఉచ్చులో అంతర్జాతీయ స్మగ్లర్లు
అదుపులో ముంబయి,కోల్‌కతా, ఢిల్లీకి చెందిన ముగ్గురు తమిళనాడు, కర్ణాటకకు చెందిన మరో నలుగురు కూడా ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య వందకుపైనే పీడీ యాక్టు నమోదైన వారిసంఖ్య 14 మరో 9 మందిపై ‘పీడి’కిలి సాక్షి, చిత్తూరు: ‘ఎర్ర’ దొంగలను అరెస్టు చేయడంలో పోలీసులు చురుగ్గా కదులుతున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రీయ దొంగల వేటను సాగించిన చిత్తూరు, వైఎస్సార్ జిల్లా పోలీసులు తొలిసారి ఏడుగురు అంతర్జాతీయ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాకు చెందిన ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం దొంగలను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన మరో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు, వైఎస్సార్ జిల్లా, తిరుపతి, నెల్లూరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ కు వీరు చిక్కినట్లు తెలిసింది. చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ ? వారం రోజుల కిందట తమిళనాడుకు చెందిన శరవణ, శంకర్, జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారిస్తే కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబైకి చెందిన దొంగలు పట్టుబడ్డట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరంతా ఎర్రచందనం దుంగలను విదేశాలకు విక్రయించి తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లోని ఎర్రచందనం స్మగ్లర్లకు డాన్లుగా చెలామణి అయినట్లు తెలిసింది. వీరిలో ముంబైకి చెందిన ఓ స్మగ్లర్ రోజుకు రూ.2లక్షల వరకూ వ్యక్తిగత ఖర్చులకు వినియోగిస్తారని సమాచారం. దీన్నిబట్టే అతను ఏ స్థాయిలో స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడో తెలుస్తోంది. రియాజ్ అరెస్టుతో చిక్కిన చిత్తూరు దొంగ పై ఆరుగురితోపాటు కర్ణాటకలోని కోలార్‌కు చెందిన రియాజ్ అనే స్మగ్లర్‌ను ఉబ్బనహళ్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రియాజ్ గతంలో వీరప్పన్‌కు అనుచరుడిగా ఉండి అటవీ సంపదను విదేశాలకు తరలించడంలో సహకరించేవాడని తెలిసింది. అతన్ని ఆంధ్రకు తీసుకొస్తుండగా చిత్తూరుకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్ పదేపదే రియాజ్‌కు ఫోన్‌చేసి ‘భాయ్...సరుకు ఉంది. కొంటావా?’ అని అడిగినట్లు తెలిసింది. తీరా రియాజ్ పోలీసు ఉన్నతాధికారి వద్దకు వచ్చినప్పుడు కూడా ఈ ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరి ఏడుగురితోపాటు ఇటీవల చెన్నైలో దొరికిన ఇద్దరు స్మగ్లర్లపై పోలీసులు ‘పీడీ యాక్టు’ నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టులు 95కు చేరినట్లు తెలిసింది. తక్కిన 105 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.