సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో వేట ముమ్మరం చేశారు. కొంత కాలంగా టాస్క్‌ఫోర్స్ టీం పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొందరు బడా స్మగ్లర్లను పట్టుకునేందుకు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మకాం పెట్టింది. ఢిల్లీతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో తిరుగుతూ స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. బెంగుళూరు, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లో కడప పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎర్ర స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన జయపాల్, కింకుశర్మ, నేపాల్‌కు చెందిన లక్ష్మిడాంగ్ అనే స్మగ్లర్లను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్ల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
కొందరు చైనా స్మగ్లర్ల కోసం కూడా వేట సాగిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బడా స్మగ్లర్లను కడపకు తీసుకురానున్నారని తెలిసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల నుంచి అందిన సమాచారం మేరకు ఎర్రచందనం డంప్‌పై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా బెంగుళూరుతోపాటు వివిధ ప్రాంతాల్లో దాచిన రెండు టన్నుల మేర ఎర్రచందనం దుంగలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా.
బడా స్మగ్లర్ల కోసం అన్వేషణ
Published Sat, Jul 18 2015 3:00 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement