‘బంగారు’ గని
- గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిన విశాఖ ఎయిర్‌పోర్టు
- సింగపూర్, దుబాయ్ నుంచి భారీగా వస్తున్న గోల్ట్ బిస్కెట్లు
- మూడు వారాల్లో 70మంది అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దీటుగా తీర్చిదిద్దుతామని తరచు నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. అభివృద్ధి విషయమేమో గానీ ఇక్కడ శంషాబాద్‌ను తలదన్నే రీతిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ స్మగ్లర్లకు విశాఖ విమానాశ్రయం బంగారు గనిగా మారింది.
ఇరవై రోజుల్లో మూడు సంఘటనలు
విశాఖ విమానాశ్రయంలో గడిచిన కొద్ది రోజులుగా గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దాదాపు 60మంది పట్టుబడ్డారు. ఈ నెల 2న దుబాయ్ నుంచి విశాఖకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1- 952 ద్వారా బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు వ్యక్తులు కస్టమ్స్‌కు చిక్కారు. వారి నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1-952 నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.1.12 కోట్ల విలువైన 4.2 కేజీల బంగారం దొరికింది. రెండు ఉదంతాల్లోనూ స్మగ్లర్లు ఎయిర్ ఇండియా విమానాలనే వినియోగించడం విశేషం. నిజానికి స్మగ్లర్లు ఇంత ధైర్యంగా తమ కార్యకలాపాలు సాగించడానికి విమాన సిబ్బంది సహకారం కూడా వారికి లభిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.
బంగారం స్మగ్లింగ్‌కు అడ్డా
కేవలం ఒక్క విమాన సర్వీసుతో ప్రారంభమై రెండేళ్ల క్రితం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం 13 సర్వీసులు నడుపుతున్నారు. అయితే ఇదే స్మగ్లర్లకు వరంగా మారింది. ఇక్కడ భద్రతా ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉండటాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2013-14లో రూ.2.01 కోట్ల విలువైన రూ.6.67 కేజీల బంగారం దొరికింది. 2014-15 మధ్య రూ.2.04 కోట్ల విలువైన 7.62 కేజీల బంగారం పట్టుబడింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రూ.3.06 కోట్ల విలువైన 11.06 కేజీల బంగారం బిస్కెట్లు దొరికాయి. తాజాగా పట్టుబడింది కలిపితే ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. మహిళలు సైతం స్మగ్లింగ్‌లో పట్టుబడటం విమానాశ్రయ చరిత్రలోనే ఈ ఏడాది తొలిసారిగా చోటుచేసుకుంది. 2003 నుంచి ఇప్పటివరకు 17 మందిని గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి రూ.3.75 కోట్ల కస్టమ్స్ డ్యూటీని వసూలు చేశారు.
స్మగ్లింగ్ రాకెట్ కొత్త ఎత్తులు
దుబాయ్ నుంచి బంగారం బిస్కెట్లను తరలించడానికి స్మగ్లింగ్ రాకెట్‌లు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నారు. హైదరాబాద్, విశాఖలను అడ్డాగా వాడుకుంటున్నారు. సాధారణ ప్రయాణికులతో స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, శరీరం లోపల గోల్డ్‌బిస్కెట్లు పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రయాణికులకు సాధారణ స్కానింగ్ మాత్రమే ఉండటం వీరికి కలిసివస్తోంది. మన వాళ్లు ఇంకా డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ మాత్రమే వాడుతున్నారు. అనుమానం వస్తే గానీ ఏ ప్రయాణికుడినీ క్షుణ్ణంగా తనిఖీ చేయరు. కనీసం డాగ్ స్క్వాడ్ కూడా లేదు.