
బాబూ కాకమ్మ కథలు చెప్పడం మానుకో: జూపూడి
హైదరాబాద్: కాకమ్మ కథలు చెప్పడం మానేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వైఎస్‌ఆర్‌సీపీ అధికారి ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆస్తులు నిజమేనని భావిస్తే గతంలో వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై విచారణ కోరాలన్నారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటిస్తే దేశంలో అవినీతి తగ్గుతుందా? అని ప్రశ్నించారు. మీ కాకి లెక్కలకి దేశంలో అవినీతి తగ్గుతుందా చంద్రబాబు అని అడిగారు.
చంద్రబాబు బినామీ ఆస్తులు ఎక్కడున్నాయో కనుక్కోవాల్సి బాధ్యత ప్రజలకు లేదని చెప్పారు. చంద్రబాబు తీరు నీరో చక్రవర్తిని తలపిస్తుందన్నారు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం గురువిందగింజ సామెతను గుర్తుకుతెస్తుందన్నారు. ఈ ఆస్తుల విలువను ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటన్నారు. గతంలో ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకి మధ్య లోకేష్ ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పలేదన్నారు.