
వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిట్టలదొరలా ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాగర్జన పేరుతో చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు అనుకూలంగా మొదటి ఓటును వేశామన్న మీ ఎంపీల మాటలు మీకు గుర్తులేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు టీడీపీకి తేడా ఏంటి? విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి కేంద్రాన్ని తొందరపెట్టిన విషయం మీకు గుర్తులేదా? అని అడిగారు. ఏ ప్రాంతంలోనూ 10 ఎమ్మెల్యే సీట్లు గెలవలేని మీరు రాష్ట్రాన్ని సింగపూర్‌గా ఎలా మారుస్తారు? 9 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు సీమాంధ్రకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. పగటివేషగాడిలా కబుర్లు చెప్పడం మానుకోమని పద్మ సలహా ఇచ్చారు.