సీఎం బహిరంగ సభ కోసం బంతాటమైదానంలో ఏర్పాట్లు
ప్రజాధనం అంటే సీఎం చంద్రబాబుకు అలుసుగా మారింది. తన ఆర్భాటం, సౌకర్యం కోసం ఖజానాను అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డబ్బుల్లేవని బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు .. తన సొంత బాకా కొట్టుకోవడానికి మాత్రం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. చేసింది గోరంత, ప్రచారం కొండంత అన్న చందంగా అవసరం లేని కార్యక్రమాలకు కూడా ఆర్భాటం చేస్తున్నారు. గురువారం జిల్లా పర్యటనకు కూడా దాదాపు రూ.3.5 కోట్లు ప్రజాధనం ఖర్చు చేయడానికి సిద్ధమైపోయారు. హెలికాప్టర్‌పై నగర పర్యటన, జనసమీకరణ కోసం వృథా ఖర్చు చేస్తున్నారు. జన సమీకరణకు స్వయంగా మంత్రి రంగంలోకి దిగి ఇంజనీరింగ్ కళాశాలలకు టార్గెట్లు ఇచ్చారు. ఉన్నతాధికారులతో ప్రిన్సిపాళ్లకు ఫోన్లు చేయించి విద్యార్థులను పంపించకపోతే గుర్తింపు రద్దంటూ హెచ్చరికలు చేయడం గమనార్హం. మరో వైపు ఆర్టీసీ నుంచి కూడా కనీసం 300కు తక్కువ కాకుండా బస్సులను జనాల తరలింపు కోసం మళ్లిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు 2014 నుంచి ఇప్పటి వరకు 106 సార్లు విశాఖ జిల్లాలో పర్యటించారు.అందులో 95 సార్లు విశాఖ నగరానికే వచ్చారు. మూడొంతుల పర్యటనలు సదస్సులు, సమ్మేళనాల్లో పాల్గొనేందుకే వచ్చినవే. గురువారం సీఎం మరోసారి విశాఖకు వస్తున్నారు. ఈ సారి పర్యటన అంతా గ్రేటర్ విశాఖ పరిధిలోనే సాగనుంది. అయినా గతానికి భిన్నంగా పర్యటన సాగనుంది. నగరమంతా పూర్తిగా హెలికాప్టర్‌లోనే చక్కర్లు కొట్ట బోతున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రానున్న సీఎం చంద్రబాబు మెడ్‌టెక్ జోన్‌తో పాటు భీమిలి మండల పరిధిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్ల ఖర్చు ఎంత తక్కువ వేసుకున్నా రూ.50 లక్షలు పైమాటేనని అధికారులు చెబుతు న్నారు. ఇక మెడ్‌టెక్ జోన్‌లో జరిగే గ్లోబల్ ఫారం సదస్సు ప్రారంభోత్సవ వేడుకలకు కోటికి పైగా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక తగరపువలస జూట్‌మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ఖర్చు అక్షరాల రూ.2కోట్ల పైమాటేనని లెక్కలేస్తున్నారు. ఇందు కోసం మొత్తం అయ్యే ఖర్చు అక్షరాల మూడున్నరకోట్ల పైమాటేనని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పర్యటనలకు దుబారా అవసరమా అని ప్రజలు మండిపడుతున్నారు. మరో వైపు అధికారులు నలిగిపోతున్నారు.
జనసమీకరణ కోసం హైరానా
ఏపీ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్)ను జాతికి అంకితం చేయడంతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగే గ్లోబల్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. జీవీఎంసీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం భీమిలి మండలం చిల్లపేట చెరువు వద్ద ఐటీహబ్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తగరపువలస జూట్‌మిల్లు గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. దీనికి కనీసం 30వేల మందిని సమీకరించాలని తలపోశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జనసమీకరణకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించాలని తొలుత భావించినా వెలుగు సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఈసారి విద్యార్థులను తరలించాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలోనే కాకుండా ఉత్తరాంధ్రలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను తరలించాలని నిర్ణయానికి వచ్చారు.
దీంతో ఉన్నతాధికారుల ద్వారా ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేసి మరీ విద్యార్థులను తరలించాలని హుకుం జారీ చేశారు. ఆంధ్రా, జేఎన్‌టీయూకే, అంబేడ్కర్ యూనివర్సిటీలు అనుబంధంగా ఉన్న 48 ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు నేరుగా ఫోన్లు చేసి తగరపువలస సభకు మీ విద్యార్థులను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. పంపించకపోతే మీ గుర్తింపురద్దు చేస్తామని హెచ్చరికలు చేశారు. ప్రతి కళాశాల నుంచి 400 మందికి తక్కువ కాకుండా విద్యార్థులను తీసుకు రావాలని, పైగా వారికి భోజనాలు పెట్టించి మరీ బస్సులు ఎక్కించాలని ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏ కళాశాల బస్సులు, విద్యార్థులు కన్పించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక కళాశాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపు ఆర్టీసీ నుంచి 300కు తక్కువ కాకుండా బస్సులను జనాల తరలింపు కోసం మళ్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment