చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి బయలు దేరి సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఉన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం అవుతారు. సింగపూర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు మాస్టర్ ప్రణాళికను ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తారు.
మాస్టర్ ప్రణాళికలలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి, ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుకుంటారు. మరి కొద్ది రోజుల్లో రాజధాని మాస్టర్ ప్రణాళికను సమర్పించనున్న నేపథ్యంలోచంద్రబాబు ఈ నెల 30, 31 తేదీల్లో సింగపూర్ పర్యటనకు వెళ్లినట్లు ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 30వ తేదీ ఉదయం సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం చంద్రబాబుకు అల్పాహార విందు ఇస్తారు. అనంతరం సింగపూర్ వాణిజ్య, పారిశ్రామిక మంత్రి ఎస్. ఈశ్వరన్, రాయభారి గోపీనాధ్ పిలైతో ఉన్నతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నాం ఎస్. ఈశ్వరన్ ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొంటారు.
అనంతరం ముఖ్యమంత్రితో పాటు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధుల బృందం సింగపూర్‌లోని పలు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతుంది. అనంతరం చంద్రబాబు సమక్షంలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యుఎస్)తో వ్యర్ధపదార్ధాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోనుంది. 31వ తేదీ చంద్రబాబు సింగపూర్ సీనియర్ మంత్రి గో చోక్ టంగ్‌తో సమావేశం అవుతారు. అనంతరం బిషన్ పార్కును సందర్శించడంతో పాటు సమీకృత రవాణా కేంద్రం గల టోపయో సందర్శిస్తారు. సింగపూర్ టౌన్‌షిప్‌ను సందర్శించడంతో పాటు అక్కడ గల వాణిజ్య, పౌర సముదాయాలను పరిశీలిస్తారు. సాయంత్రం చాంగై విమానాశ్రయం నుంచి బయలు దేరి అదే రోజు రాత్రికి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు.