అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం | Chandrababu Strange Behaviour On Capital Amaravati | Sakshi
Sakshi News home page

అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం

Published Thu, Nov 28 2019 4:54 AM | Last Updated on Thu, Nov 28 2019 9:30 AM

Chandrababu Strange Behaviour On Capital Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజధాని కట్టకుండా అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు, ఇప్పుడు దానిపై రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి నడుం బిగించారు. తాను గ్రాఫిక్స్‌లో చూపించిన రాజధాని ఆగిపోయిందని, కాగితాల్లో తాను సృష్టించిన లక్ష కోట్ల సంపద ఆవిరైపోయిందని కల్లబొల్లి కబుర్లతో మళ్లీ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారానికి దూరమైనప్పటి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న చంద్రబాబు, ఆ పార్టీ నేతలు తాజాగా రాజధానిపై రాద్ధాంతం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 28వ తేదీన రాజధానిలో పర్యటించి, రైతులను రెచ్చగొట్టి, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు వ్యూహం రూపొందించారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో  భారీగా లబ్ధి
2014 జూన్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని ఎక్కడనే విషయంపై వ్యూహాత్మకంగా లీకులిచ్చిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా చేజిక్కించుకున్నారు. తమకు అనుకూలమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని తమ అనుయాయులు, అస్మదీయులకు మాత్రమే తెలిసేలా చేశారు. వారంతా అక్కడ తక్కువ ధరకు భారీగా భూములు కొన్నారు. అదే సమయంలో బయట ప్రపంచానికి మాత్రం రాజధాని నూజివీడులో అని ఒకసారి, గన్నవరంలో అని మరోసారి.. గుంటూరు పరిధిలోని నాగార్జున వర్సిటీ పరిధిలో అని ఇంకోసారి అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు.

తద్వారా రాజధాని పేరుతో ఆయా ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ సృష్టించి సాధారణ, మధ్యతరగతి ప్రజలను తప్పుదారి పట్టించారు. వారు అనుకున్న చోట భూములన్నీ చాలా వరకు తమ చేతుల్లోకి వచ్చాక గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో అప్పటి వరకు భూములమ్ముకున్న వారు లబోదిబోమన్నారు. ప్రభుత్వ లీకులతో వేరే ప్రాంతాల్లో కొన్నవారు నిండా మునిగిపోయారు. ఇలా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా చంద్రబాబు కుమారుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు అనేక మంది టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రాజధాని ప్రాంతంలో ఇష్టానుసారం భూములు కొనుగోలు చేశారు.

దుబారా వద్దనడం తప్పా?
రాజధానిని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వం సాగించిన అడ్డగోలు వ్యవహారాలపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. రాజధాని పేరుతో వేల కోట్ల దుబారా జరిగిందని, లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయని ఈ కమిటీ తేల్చింది. గతంలో జరిగిన తప్పులను సరిచేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఆర్భాటం, దుబారా లేకుండా రాజధాని పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ వాస్తవాలన్నింటినీ పట్టించుకోని చంద్రబాబు.. ఈ సర్కారుపై బురద చల్లేందుకు రాజధాని పర్యటనకు సిద్ధమవ్వడం చూసి జనం విస్తుపోతున్నారు.  

బెదిరింపులతో భూ సమీకరణ ఇలా.. 
- తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లోని రైతుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34 వేల ఎకరాలను లాక్కుంది. 
కృష్ణా నది తీరంలో మూడు, నాలుగు పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా, పర్యావరణవాదులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.
భూములివ్వని రైతుల తోటలను దగ్ధం చేయడం, రైతులపై కేసులు పెట్టి వేధించడం, రైతులను టీడీపీ నాయకులు బెదిరించడం, పొలాలకు నీరు, విద్యుత్‌ నిలిపివేయడం, రుణాలు ఇవ్వకపోవడం, భూ ములను దున్నేయడం వంటి అరాచకాలు జరిగాయి. 
చిన్న రైతుల నోట్లో మట్టికొట్టి వారి భూముల పేరుతో స్థానికంగా టీడీపీ నాయకు లకు ప్లాట్లు ఇచ్చింది.
దళిత రైతుల అసైన్డ్, లంక భూములను అధికార పార్టీ నేతలు భయపెట్టి కారుచౌకగా తీసుకున్నారు.
రైతుల నుంచి సేకరించిన భూముల్లో 1,691 ఎకరాల ను స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పేరుతో సింగపూర్‌ కన్సార్టి యంకు కట్టబెట్టింది. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏపీఐడీసీ చట్టాన్నే మార్చివేసింది.
సింగపూర్‌ కన్సార్టియంకు కారుచౌకగా భూములిచ్చి, రూ.5,500 కోట్లతో అందులో మౌలిక వసతులు అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వాని దేనని ఒప్పు కుంది. అయినప్పటికీ ప్రాజెక్టులో 58 శాతం వాటా వారికిచ్చింది. (ఇంత దారుణమైన ప్రాజెక్టు ను ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరస్పర అంగీకారంతో ఉపసంహరించుకుంది.)

అదిగో రాజధాని.. ఇదిగో సెట్టింగ్‌..
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఎవరూ ఊహించని విధంగా రూ.వెయ్యి కోట్ల వరకు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. 
ఆరు లక్షల చదరపు అడుగుల్లో ఆరు బ్లాకులను మొదట రూ.180 కోట్లతో మొదలు పెట్టి అంచెలంచెలుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలు చిన్నపాటి వర్షానికే ధారగా కారిపోతున్నాయి. 
తాత్కాలిక సచివాలయం మినహా ఎన్నికలు వచ్చే వరకూ ఒక్క శాశ్వత భవన నిర్మాణానికి చంద్రబాబు పునాది వేయలేదు. 
రాజధాని పరిపాలనా నగరం డిజైన్లను రూపొందించేందుకు మొదట మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత దాన్ని తప్పించి లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్స్‌ అండర్‌ పార్టనర్స్‌ను ఎంపిక చేసింది. దీంతో మకి ఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు అంతర్జాతీయ జర్నల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను ఎండగట్టడంతో రాష్ట్రం పరువు బజారునపడింది. 
నార్మన్‌ పోస్టర్స్‌ సంస్థ డిజైన్లు సమర్పించకుండానే బాహుబలి సినిమాలో మాహిష్మతి సెట్టింగ్, గౌతమీపుత్ర శాతకర్ణిలోని అమరావతి సెట్టింగ్‌లపై మనసుపడిన చంద్రబాబు వాటి దర్శకులతో చర్చలు జరిపారు. ఇలా రకరకాల డిజైన్లను అనుకూల మీడియాలో చూపిస్తూ అదే రాజధాని అని హడావుడి చేశారు. 
రూ.నాలుగైదు వేలతో చదరపు అడుగు నిర్మించే అవకాశం ఉన్న భవనాలను 
రూ.7 వేల నుంచి రూ.పది వేల వరకు అంచనాలతో చేపట్టడంతో నిపుణులే విస్తుపోయే పరిస్థితి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement