చంద్రమౌళి (ప్రమాదం జరగకముందు),కాళ్లూ, చేతులు కోల్పోయి కేజీహెచ్‌లో అచేతనంగా ఉన్న చంద్రమౌళి
విధి ఎంత బలీయమైనదో.. అమాంతంగా ఆనందాల పల్లకిలో ఊరేగించగలదు.. ఒక్క క్షణంలో జీవితంలో కోలుకోలేని విషాదాన్ని నింపనూగలదు. అందుకు ఉదాహరణే కొత్తకోటకు చెందిన ద్వారపురెడ్డి చంద్రమౌళి దీనావస్థ. ఎన్నో కష్టాలనోర్చి బీటెక్ చదివించిన తల్లిదండ్రుల ఆశలు మరికొద్ది రోజుల్లో ఫలించేవి.. గేట్‌కు సన్నద్ధం అవుతున్న సమయంలో వెతుక్కుంటూ వచ్చిన ఉద్యోగంలోనే ఆనందాలు దొరికేవి.. కొడుకు సంపాదనతో కుటుంబానికి ఒక ఆసరా దొరికేది.. అయితే ఇంతలోనే విధి కన్నెర్ర జేసింది. విద్యుదాఘాతం రూపంలో కాళ్లూచేతులు బలిగొని కుటుంబాన్నంతటినీ కన్నీటి సంద్రంలో ముంచేసింది.. ఉద్యోగం చేసుకుంటూ చేదోడుగా ఉంటాడనుకున్న కొడుకు నిస్సహాయ స్థితిలో పడి ఉంటే సహాయార్థుల కోసం ఎదురుచూస్తోంది...
రావికమతం: కొద్ది రోజుల్లో ఉద్యోగంలో చేరి కన్నవారి కలలను తీరుస్తాడనుకున్న కుమారుడి ఆశలను కరెంట్ షాక్ హరించేసింది. చిరునవ్వుకు నిలువెత్తు రూపంగా ఉన్న వారసుడిని దివ్యాంగుడిగా మార్చేసి ఆ కుటుంబానికి కన్నీటినే మిగిల్చింది. కొత్తకోట గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రమణ, సత్యవతిలకు చంద్రమౌళి, ప్రసన్న ఇద్దరు పిల్లలు. బతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం నర్సీపట్నం వెళ్లి లక్ష్మీపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. చంద్రమౌళి తండ్రి రమణ ఏజెన్సీ సంతల్లో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా తల్లి సత్యవతి ఒక ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. గేట్‌కు సన్నద్ధం అవుతున్న తరుణంలో వచ్చిన చిన్న ఉద్యోగంలో జాయిన్ తల్లితండ్రులకు చేదోడు ఉందామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ లోగా విధి ఆ కుటుంబంపై పంజా విసిరింది. విద్యుత్ ప్రమాదం రూపంలో కుటుంబంలో విషాదం నింపింది.
కృత్రిమ చేతుల ఏర్పాటుకు రూ.25లక్షలు
చంద్రమౌళి దైన్య స్థితిని అతని మిత్రులు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయడంతో బెంగళూరుకు చెందిన వైద్యుడు చేతులకు ఆపరేషన్ చేసి సరిచేస్తామని చంద్రమౌళి కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే కృత్రిమ చేతుల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పడంతో వారికి ఏమీ పాలుపోవడం లేదు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఆపరేషన్ ఖర్చుల కోసం చంద్రమౌళి మిత్రులు, బంధువులు విద్యాసంస్థల్లో విరాళాలు సేకరిస్తున్నారు. చేతనైనంత సహాయంచేసి దాతలు ఆదుకోవాలని మిత్రులు సోమిరెడ్డి అనంత్, బేరా మణికంఠ కోరుతున్నారు. రెండు కాళ్లూ చేతులూ కోల్పోయి అచేతనంగా ఉన్న చంద్రమౌళిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉంగరం తీయబోయి..
ఇరవై రోజుల క్రితం చంద్రమౌళి, అతని చెల్లెలు ప్రసన్న మేడపై ఉండగా తన ఉంగరం చేజారి కింద ఉన్న రేకుల షెడ్డుపై పడింది. దాన్ని చంద్రమౌళి ఇనుప ఊచతో తీస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్‌వైర్లకు తగిలి అఘాతానికి గురయ్యాడు. ప్రసన్న కేకలు వేయడంతో తండ్రి రమణ పరుగున వెళ్లి అచేతనంగా పడిఉన్న చంద్రమౌళిని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అత్యవసర వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందించారు. విద్యుత్ షాక్‌తో కాళ్లూచేతులు పూర్తిగా కాలిపోయాయి. అయితే వాటిని తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం రెండు కాళ్లు, చేతులూ లేక అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 20 రోజులుగా కుటుంబ సభ్యులతో పాటు చంద్రమౌళి స్నేహితులు సైతం రాత్రులు అక్కడే ఉంటూ సహకరిస్తున్నారు.
చంద్రమౌళి తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు
పేరు: ద్వారపురెడ్డి వెంకట రమణ
అకౌంట్ నెం: 038310100129977
ఆంధ్రాబ్యాంకు శాఖ, నర్సీపట్నం ,ఐఎఫ్‌ఎస్‌సీ: ఏఎన్‌డీబీ0000383
ఫోన్ నంబర్: 94936 15162
Comments
Please login to add a commentAdd a comment