కడపలోని శంకరాపురానికి చెందిన ఓ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన యువ జంటకు ఇటీవలే వివాహమైంది. చంద్రన్న పెళ్లికానుక పథకం గురించి తెలియక ..వెబ్‌సైట్‌లో ఎలా దరఖాస్తు చేయాలో అర్థం కాక ఇబ్బంది పడ్డారు. అయితే పథకానికి అర్హులుగా గుర్తించాలంటూ మీ కోసం కార్యక్రమానికి హాజరై అధికారులకు మొర పెట్టుకున్నారు.
సాక్షి కడప : పేదల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంత నగదు ఇచ్చి పెళ్లి కానుక పేరుతో ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా..ఆచరణలో అమలు కనిపించడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ పరిస్థితిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2018 ఏప్రిల్ 20 నుంచి చంద్రన్న పెళ్లి కానుక పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసినా పాలకుల నిర్లక్ష్యం....ప్రభుత్వం అశ్రద్ధతో ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో..మరెన్నో ఆకాంక్షలతో పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. చంద్రన్న పెళ్లి కానుక అందుకోవడానికి అనేక రకాల సమస్యలను అధిగమిస్తేనే ఫలితం కనిపించే అవకాశం ఉండగా...అన్నీ దాటుకుని ముందుకు వచ్చినా ఇంతవరకు సొమ్ములు అందడం లేదు. నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక వర్గాల వారీగా కానుకను నిర్ణయించి ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. అయితే పేదలు ఉన్నంతలో పెళ్లి చేసుకుని....తర్వాత కానుక కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో కనికరం కరువైంది. పైగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కానుకలన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. హడావుడిగా బాబు సర్కార్ ఫిబ్రవరి 19న పెండింగ్‌లో నెలల తరబడి ఉన్న దరఖాస్తుల్లో కొన్నింటికి క్లియరెన్స్ ఇచ్చి, తద్వారా ఓట్లు పొందవచ్చని పథక రచన చేసినట్లు తెలుస్తోంది.
కష్టాలు తప్పడం లేదు
2018 ఏప్రిల్ 20వ తేదీన చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీంతో ఏప్రిల్ 20 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారు.. అన్ని అర్హతలు ఉన్నవారు జిల్లాలో 4,678 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివాహాలు ముగిసి నెలలు అవుతున్నా ఇంతవరకు కానుక అందలేదు. పెళ్లిళ్ల తంతు ముగిసింది.. ఇంతవరకు సొమ్ములు జత చేయలేదు. సవాలక్ష ఆంక్షలను దాటుకుని ముందుకుపోయినా.. కానుక కోసం కష్టాలు తప్పడం లేదని పలువురు లబోదిబోమంటున్నారు.
కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఏదీ..
జిల్లాలో 4,678 జంటల వారు పెళ్లి కానుకల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు 3,328 మందికి ఇటీవలేæ అందించారు. కేవలం రూ. 15 కోట్లు మేర సోమ్మును సర్కార్ అందించింది. మరో 1,350 మందికి మొండిచేయి చూపింది. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా పెళ్లికానుక కోసం ఆన్‌లైన్లో రిజిష్టర్ చేసుకోని దంపతులకు అక్టోబరులో ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో 1,307 మంది దరఖాస్తు చేశారు. అందులో 1,127 మందికి ఎన్నికలకు ముందు ఆదరాబాదరా అందించినా వారిలో కూడా దాదాపు 187 మంది ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాలకు తోడు నిబంధనల ప్రకారం లేవని కారణాలు చూపుతూ దాదాపు 90–100 మందిని రిజెక్ట్ చేశారు. ఏది ఏమైనా నెలల తరబడి నిరీక్షిస్తున్న జంటలకు ఫలితం లభించడం లేదు.
దుల్హన్, గిరిపుత్రికకు మంగళం
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముస్లిం మైనార్టీలతోపాటు గిరిజనులకు సంబంధించి ఉన్న రెండు పథకాలకు ప్రభుత్వం మంగళం పాడింది. ముస్లిం మైనార్టీలు వివాహం చేసుకుంటే దుల్హన్ పథకం కింద రూ. 50వేలు అందించేవారు. గిరిజనులకు సంబంధించి ఎవరు పెళ్లి చేసుకున్నా సంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకుంటే రూ. 50 వేలు అందించేవారు. అయితే దుల్హన్, గిరిపుత్రిక పథకాలకు మంగళం పాడి...చంద్రన్న పెళ్లి కానుకలోకే విలీనం చేశారు.దీంతో ప్రస్తుతం గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలు కూడా ఆన్‌లైన్ ద్వారా చంద్రన్న పెళ్లి కానుక పథకం కిందనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.గతంలో ఈ పథకాలకు సంబంధించి పెళ్లి అయిన తరువాత వచ్చి జంట దరఖాస్తు చేసుకున్నా వారికి కేటాయించిన మెత్తాలు అందించే వారు. పెళ్లి కానుక పథకంలోకి మార్చిన తరువాత వివాహానికి 15 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే లబ్ధి చేకూరేలా మర్పులు చేశారు.
పనిచేయని సాధికారిక సర్వే
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి కానుక రావడం దాదాపు అనుమానంగా మారింది. ఎందుకంటే ఎన్నికల అనంతరం మార్పులు, చేర్పుల పరిస్థితిని బట్టి ఇప్పటికిప్పుడు చెప్పడం కూడా గగనమే. అయితే మొత్తం మీద వందలాది మందికి పెళ్లి కానుక మాత్రం అందని ద్రాక్ష అని చెప్పవచ్చు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చిన నాటినుంచి ప్రజా సాధికారిక సర్వే పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పథకంపై పూర్తి స్దాయిలో అవగాహన లేకపోవడంతో ప్రజలు పెళ్లిళ్లు అయిపోయిన తరువాత కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేస్తున్నారు.
చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారు: 4678
ఎదురుచూస్తున్న జంటలు: 1350
తిరస్కరించిన దరఖాస్తులు : 100
అక్టోబరులో స్వీకరించినదరఖాస్తులు: 1307
ఇప్పటివరకు లబ్ధిçపొందిన వారు: 1134
చంద్రన్న పెళ్లి కానుక ప్రారంభమైంది: 20–04–2018
Comments
Please login to add a commentAdd a comment