గొల్లపూడి గోదాములొ సరఫరాకు సిద్ధంగా పచ్చి శనగపప్పు
చౌక ధరల దుకాణాల్లో బియ్యం తప్ప మరే ఇతర సరుకులు పంపిణీ చేయడం లేదనే విమర్శల నేపథ్యంలో తెల్ల రేషన్‌కార్డుదారులకు కందిపప్పు, శనగపప్పు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పప్పుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉండటంతో ఏ విధంగా పంపిణీ చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. చంద్రన్న కానుకలో మిగిలిపోయిన పప్పులే ప్రసుత్తం ప్యాకింగ్ చేసి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డీలర్లకు అప్పు ప్రాతిపదికన కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నా సవాలక్ష షరతులు విధించి ఇబ్బందులకు గురిజేస్తుందనే విమర్శలొస్తున్నాయి.
సాక్షి, విజయవాడ : తెల్లకార్డుదారులకు ఈ నెల నుంచి కందిపప్పు, పచ్చి శనగపప్పు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చినా ఆ సరుకులు పంపిణీ చేయాలంటే డీలర్లు సందేహిస్తున్నారు. ఉగాది నాటికి పేదలందరికీ విక్రయించే విధంగా ఇప్పటికే గోదాముల నుంచి కందిపప్పు, శనగపప్పు సరఫరాకు సిద్ధం చేశారు. ఈ పప్పు నాణ్యత సరిగా లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. దేశవాళీ కందిపప్పు పాతవి మిగిలిపోయిన స్టాక్ ఇస్తున్నారని, ఈ పప్పు త్వరగా ఉడకదని డీలర్లు చెబుతున్నారు. ఇక చంద్రన్న కానుకలో ఇవ్వగా మిగిలిన శనగపప్పు ఇప్పుడు తిరిగి ప్యాకింగ్ చేసి చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఇచ్చిన చంద్రన్న కానుకల్లో ముఖ్యంగా శనగపప్పు పుచ్చిపోయి పాడైపోయిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాన్నే తిరిగి ప్యాకింగ్ చేసి సరఫరా చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రన్న కానుక కోసం కొనుగోలు చేసిన శనగపప్పు అయిపోతే వచ్చే నెల నుంచి ఇచ్చే అవకాశం లేదని తెలిసింది.
రేటులో వ్యత్యాసం తక్కువ....
నాణ్యత అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ రేటులో మాత్రం ప్రైవేటు మార్కెట్‌తో పోల్చితే పెద్దగా తేడా లేదు. వాస్తవంగా ప్రైవేటు మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.55 కు లభిస్తుండగా, రేషన్ దుకాణంలో రూ.40 కు విక్రయిస్తున్నారు. Ôð శనగపప్పు రూ.45కు లభిస్తుండగా రేషన్ దుకాణంలో రూ.40 కు విక్రయిస్తున్నారు. అందువల్ల రేషన్ దుకాణంలో ఎంతమేరకు కొనుగోలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కిలోకి రూ.2 కమీషన్ కావాలి...
కేజీ కందిపప్పు, శనగపప్పు విక్రయిస్తే కేవలం 45 పైసలు మాత్రమే ప్రభుత్వం డీలర్లకు ఇస్తోంది. దీన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణానికి సుమారు 500 కార్డులు ఉన్నాయి. ఒక కార్డుకు కిలో కందిపప్పు ఇస్తారు. ఈ లెక్కన 500 కేజీలకు రూ.250 కమీషన్ వస్తుంది. ఈ కమీషన్ ఎగుమతులు దిగుమతులకు, తరుగులకే సరిపోవని, అందువల్ల కమీషన్ కేజీకి రూ.2 చొప్పున చెల్లించాలని ఏపీ రేషన్ డీలర్ల కన్వీనర్ కాగిత కొండ (జేమ్స్) డిమాండ్ చేశారు. లేకపోతే డీలర్లు ఆర్థికంగా నష్టపోతారని వాపోయారు.
కందిపప్పుకే అప్పు...
కేవలం కందిపప్పు మాత్రమే అప్పుగా ఇస్తామని, శనగపప్పుకు మాత్రం ముందుగా డీడీ రూపంలో డబ్బు చెల్లించిన తరువాతనే సరుకు తీసుకోవాలని సూచించింది. గతంలో కొంతమంది డీలర్లు కందిపప్పు తీసుకుని అమ్మలేకపోయారు. దీంతో సుమారు 70 మంది డీలర్లు పౌరసరఫరాల శాఖకు రూ.30 లక్షల వరకు బకాయిలున్నారు. ప్రస్తుతం ఆ డీలర్లకు కందిపప్పును అప్పుగా ఇవ్వబోమని, డబ్బులు చెల్లించాల్సిందేనని ఆంక్షలు విధించారు. ప్రతి డీలర్ కందిపప్పు, వచ్చి శనగపప్పు తప్పని సరిగా అమ్మాల్సిందేనని ఆదేశిస్తున్నారు. పప్పుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉండటంతో అప్పులపై సరుకు ఇస్తేనే సరఫరా చేస్తామంటూ డీలర్లు మొండికేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం దిగి వచ్చింది.
ఉన్నంత మేరకే సరఫరా చేస్తాం...
చంద్రన్న కానుకలో మిగిలిన శనగపప్పును మాత్రమే ఇప్పుడు సరఫరా చేస్తున్నాం. అది అయి పోయిన తరువాత ఇస్తామో లేదో చెప్పలేం. క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి నాణ్యత బాగా ఉందని చెప్పిన తర్వాతే చౌకధరల దుకాణాలకు పంపుతున్నాం. బకాయి ఉన్న డీలర్లకు కందిపప్పు అప్పుగా ఇవ్వడం కుదరదు. కమీషన్ పెంచడం మా చేతిల్లో లేదు.
– వరప్రసాద్, డిస్ట్రిక్ట్ మేనేజర్, పౌరసరఫరాలశాఖ
Comments
Please login to add a commentAdd a comment