Toor dal prices
-
వారం రోజుల్లోపు కందుల డబ్బులు
గుడిహత్నూర్(బోథ్) : వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. కంది రైతులకు చెల్లించాల్సిన రూ.94 కోట్లు జిల్లాకు చేరాయని, వారంలోగా చెల్లిస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చాలనే సంకల్పంతో సిబ్బంది పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో జిల్లా అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో వెనుకబడి ఉందని తెలిపారు. అంగన్వాడీలు, ఉపాధి సిబ్బంది వారి వారి పరిధిని దత్తత తీసుకుని మరుగుదొడ్లు నిర్మిస్తే వారికి పారితోషికం అందిస్తామని తెలిపా రు. అనంతరం శాఖల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీవో పీడీ రాజేశ్వర్‌రాథోడ్, డీఎంఅండ్‌హెచ్‌వో రాజీవ్‌రాజ్, జెడ్పీ సీ ఈవో జితేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారులు డాక్టర్ మనోహర్, సాధన, ఇచ్చోడ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల, ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, తహసీల్దార్ అర్క మోతీరాం, ఎంపీడీవో పుష్పలత, ఎంఈవో నారాయణ, ఏవో మహేందర్, ఎంవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అప్పుపై అదే పప్పు
చౌక ధరల దుకాణాల్లో బియ్యం తప్ప మరే ఇతర సరుకులు పంపిణీ చేయడం లేదనే విమర్శల నేపథ్యంలో తెల్ల రేషన్‌కార్డుదారులకు కందిపప్పు, శనగపప్పు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పప్పుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉండటంతో ఏ విధంగా పంపిణీ చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. చంద్రన్న కానుకలో మిగిలిపోయిన పప్పులే ప్రసుత్తం ప్యాకింగ్ చేసి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డీలర్లకు అప్పు ప్రాతిపదికన కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నా సవాలక్ష షరతులు విధించి ఇబ్బందులకు గురిజేస్తుందనే విమర్శలొస్తున్నాయి. సాక్షి, విజయవాడ : తెల్లకార్డుదారులకు ఈ నెల నుంచి కందిపప్పు, పచ్చి శనగపప్పు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చినా ఆ సరుకులు పంపిణీ చేయాలంటే డీలర్లు సందేహిస్తున్నారు. ఉగాది నాటికి పేదలందరికీ విక్రయించే విధంగా ఇప్పటికే గోదాముల నుంచి కందిపప్పు, శనగపప్పు సరఫరాకు సిద్ధం చేశారు. ఈ పప్పు నాణ్యత సరిగా లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. దేశవాళీ కందిపప్పు పాతవి మిగిలిపోయిన స్టాక్ ఇస్తున్నారని, ఈ పప్పు త్వరగా ఉడకదని డీలర్లు చెబుతున్నారు. ఇక చంద్రన్న కానుకలో ఇవ్వగా మిగిలిన శనగపప్పు ఇప్పుడు తిరిగి ప్యాకింగ్ చేసి చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఇచ్చిన చంద్రన్న కానుకల్లో ముఖ్యంగా శనగపప్పు పుచ్చిపోయి పాడైపోయిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాన్నే తిరిగి ప్యాకింగ్ చేసి సరఫరా చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రన్న కానుక కోసం కొనుగోలు చేసిన శనగపప్పు అయిపోతే వచ్చే నెల నుంచి ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. రేటులో వ్యత్యాసం తక్కువ.... నాణ్యత అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ రేటులో మాత్రం ప్రైవేటు మార్కెట్‌తో పోల్చితే పెద్దగా తేడా లేదు. వాస్తవంగా ప్రైవేటు మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.55 కు లభిస్తుండగా, రేషన్ దుకాణంలో రూ.40 కు విక్రయిస్తున్నారు. Ôð శనగపప్పు రూ.45కు లభిస్తుండగా రేషన్ దుకాణంలో రూ.40 కు విక్రయిస్తున్నారు. అందువల్ల రేషన్ దుకాణంలో ఎంతమేరకు కొనుగోలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిలోకి రూ.2 కమీషన్ కావాలి... కేజీ కందిపప్పు, శనగపప్పు విక్రయిస్తే కేవలం 45 పైసలు మాత్రమే ప్రభుత్వం డీలర్లకు ఇస్తోంది. దీన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణానికి సుమారు 500 కార్డులు ఉన్నాయి. ఒక కార్డుకు కిలో కందిపప్పు ఇస్తారు. ఈ లెక్కన 500 కేజీలకు రూ.250 కమీషన్ వస్తుంది. ఈ కమీషన్ ఎగుమతులు దిగుమతులకు, తరుగులకే సరిపోవని, అందువల్ల కమీషన్ కేజీకి రూ.2 చొప్పున చెల్లించాలని ఏపీ రేషన్ డీలర్ల కన్వీనర్ కాగిత కొండ (జేమ్స్) డిమాండ్ చేశారు. లేకపోతే డీలర్లు ఆర్థికంగా నష్టపోతారని వాపోయారు. కందిపప్పుకే అప్పు... కేవలం కందిపప్పు మాత్రమే అప్పుగా ఇస్తామని, శనగపప్పుకు మాత్రం ముందుగా డీడీ రూపంలో డబ్బు చెల్లించిన తరువాతనే సరుకు తీసుకోవాలని సూచించింది. గతంలో కొంతమంది డీలర్లు కందిపప్పు తీసుకుని అమ్మలేకపోయారు. దీంతో సుమారు 70 మంది డీలర్లు పౌరసరఫరాల శాఖకు రూ.30 లక్షల వరకు బకాయిలున్నారు. ప్రస్తుతం ఆ డీలర్లకు కందిపప్పును అప్పుగా ఇవ్వబోమని, డబ్బులు చెల్లించాల్సిందేనని ఆంక్షలు విధించారు. ప్రతి డీలర్ కందిపప్పు, వచ్చి శనగపప్పు తప్పని సరిగా అమ్మాల్సిందేనని ఆదేశిస్తున్నారు. పప్పుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉండటంతో అప్పులపై సరుకు ఇస్తేనే సరఫరా చేస్తామంటూ డీలర్లు మొండికేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం దిగి వచ్చింది. ఉన్నంత మేరకే సరఫరా చేస్తాం... చంద్రన్న కానుకలో మిగిలిన శనగపప్పును మాత్రమే ఇప్పుడు సరఫరా చేస్తున్నాం. అది అయి పోయిన తరువాత ఇస్తామో లేదో చెప్పలేం. క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి నాణ్యత బాగా ఉందని చెప్పిన తర్వాతే చౌకధరల దుకాణాలకు పంపుతున్నాం. బకాయి ఉన్న డీలర్లకు కందిపప్పు అప్పుగా ఇవ్వడం కుదరదు. కమీషన్ పెంచడం మా చేతిల్లో లేదు. – వరప్రసాద్, డిస్ట్రిక్ట్ మేనేజర్, పౌరసరఫరాలశాఖ -
కంది.. చెల్లింపులేవి..!
సాక్షి, ఆదిలాబాద్ : కందులు కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15,270 మంది రైతులు సుమారు రెండు లక్షల క్వింటాళ్ల కందులు విక్రయించారు. డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కంది బకాయిలు కొండంత పేరుకపోయాయి. రైతుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ చెల్లింపులను పెండింగ్‌లో పెట్టడంతో వారు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు రూ.వంద కోట్లకు పైగా బకాయిలు ఏర్పడ్డాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తితోనైనా ఆ డబ్బులు విడుదలయ్యేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మంత్రి సోమవారం కేంద్ర మంత్రికి ఈ డబ్బులు విడుదల చేయాలని లేఖ రాసిన విషయం విదితమే. రైతులకు వారంలో పంట సొమ్మును అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు కంది మూటలయ్యాయి. గోరంత చెల్లింపు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి వందల కోట్ల రూపాయల కందులు కొనుగోలు చేయగా, గోరంత చెల్లింపులు మాత్రమే చేశారు. పంట కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేక పోయింది. జనవరి 22న ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో కంది కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఆదిలాబాద్‌లో ఆరు, నిర్మల్‌లో ఆరు, కుమురంభీంలో మూడు, మంచిర్యాలలో రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో మార్క్‌ఫెడ్ అధికంగా కొనుగోలు చేస్తుండగా, కొన్ని కేంద్రాల్లో డీసీఎంఎస్, పీఏసీఎస్‌లో కూడా కొనుగోలు చేస్తున్నాయి. నిర్మల్‌లో పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్, కుమురంభీం జిల్లాలో మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, మంచిర్యాలలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్దతు ధర నేపథ్యంలోనే.. కందులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5450 ధర ప్రకటించిన విషయం తెలిసిందే. బయట మార్కెట్లో కందులకు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.4500 లోపే ఇస్తున్నారు. దీంతో రైతులు మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయిస్తున్నారు. జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లో 9,675 మంది రైతులు, కుమురంభీం జిల్లాలో 1,997, నిర్మల్‌లో 3,566, మంచిర్యాలలో 32 మంది రైతులు కంది పంటను విక్రయించారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో సుమారు 2లక్షల క్వింటాళ్ల వరకు కంది కొనుగోళ్లు జరిగాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే కంది పంట 19,447 హెక్టార్లలో సాగు కాగా, 2లక్షల 43వేల 090 క్వింటాళ్లు దిగుబడి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 36,022 క్వింటాళ్ల కంది కొనుగోళ్లు జరిగాయి. మిగతా జిల్లాలోనూ ఇంకా మార్కెట్‌కు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ప్రధానంగా మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కందులను తీసుకొస్తున్నారు. చెల్లింపులు మాత్రం ఆలస్యంగా జరుగుతుండడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పంటను అమ్మి సొమ్ము కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. -
కిలో రూ.120కు కందిపప్పు విక్రయం
నేటి నుంచి 25 కేంద్రాల్లో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన కందిపప్పు ధరలను దృష్టిలో పెట్టుకొని సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కిలో రూ.120కే అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎంపిక చేసిన రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి విక్రయాలను శనివారం నుంచి ఆరంభించనుంది. రాష్ట్రంలో కందిపప్పు ధరల నియంత్రణకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 25వేల మెట్రిక్ టన్నుల కందిని సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసి పెట్టింది. ఇందులోంచి రాష్ట్రం ఇప్పటికే 10వేల టన్నులు తీసుకుంది. అందులో 2వేల టన్నులకు టెండర్లు పిలిచి పప్పుగా మార్చింది. దాన్నే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల ద్వారా రూ.120 సబ్సిడీ ధరకు విక్రయించనుంది. -
పప్పు తిప్పలు
- అలాట్ మెంట్ ఫుల్...సరుకు నిల్ - సెప్టెంబర్ కోటాలో కందిపప్పు పంపిణీ అరకొరే ఒంగోలు: కేటాయింపులు ఫుల్...సరుకు నిల్లు అన్న చందంగా ఉంది జిల్లాలో రేషన్ దుకాణాల పరిస్థితి. బహిరంగ మార్కెట్లో రోజురోజుకూ కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోగా రెండు నెలలపాటు కందిపప్పును రేషన్ దుకాణాల ద్వారా అందించి చేతులెత్తేసింది. సెప్టెంబర్ మాసంలో కందిపప్పు పంపిణీకి సంబంధించి అలాట్మెంట్ ఉత్తర్వలైతే వచ్చాయి కానీ గోదాములలో మాత్రం సరుకులేకపోవడం గమనార్హం. అవసరం 8.31 లక్షల కేజీలు జిల్లాలో తెల్లరంగు రేషన్ కార్డుదారులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు సంబంధించి ప్రతినెలా రేషన్ పొందే లబ్ధిదారులు 8,36,061 కుటుంబాలున్నాయి. గతంలో వీరికి బియ్యం కాకుండా ఆరు రకాల సరుకులు ప్రతినెలా కేవలం రూ.185లకే అందేవి. రెండు నెలల క్రితం వరకు పంచదారతోనే సరిపెట్టిన ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు పెరగడం చూసి రేషన్ దుకాణాల్లోను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. టీడీపీ ప్రభుత్వం పాలకపగ్గాలు చేపట్టి ఏడాది దాటినా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరైన విధానాన్ని అనుసరించడంలో ఘోరంగా విఫలమైంది. ఆధార్‌ను అనుసంధానం చేసి అక్రమాలు అరికడతాం...ఈపాస్ ద్వారా అర్హులకే సరుకులు పంపిణీ చేస్తామంటూ ప్రకటనలకే కోట్ల రూపాయలు వ్యయం చేసిన ప్రభుత్వం పేదలను ఆదుకునే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తూనే ఉంది. 8,36,061 కుటుంబాలకు 8,36,061 కేజీల కందిపప్పును పంపిణీ చేయాల్సి ఉండగా రేషన్ దుకాణాల్లో గతం తాలూకా 4812 కేజీలు మిగిలి ఉన్నాయి. అంటే సెప్టెంబర్ మాసంలో కందిపప్పు పంపిణీకి 4812 కేజీలుపోను ఇంకా అదనంగా 8,31,249 కేజీలు అవసరం ఉంది. గోదాముల్లో నిల్వలు ఇలా... గోదాములను పరిశీలిస్తే జిల్లాలో కేవలం 103 టన్నులు మాత్రమే కందిపప్పు నిల్వలున్నాయి. వాటికి రేషన్ దుకాణాల్లో ఉన్న 4812 కేజీల నిల్వను కలిపితే 1,07,812 కేజీలు కందిపప్పు నిల్వలున్నట్లవుతుంది. అంటే మొత్తం 8,36,061 కార్డుదారులకుగాను 1,07,812 మందికి మాత్రమే పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. దీని ప్రకారం సెప్టెంబర్ మాసంలో 7,28,249 మందికి కందిపప్పు పంపిణీచేయడం సాధ్యపడదు. కందిపప్పు పంపిణీకి సంబంధించి కాంట్రాక్టులు కుదుర్చుకున్నవారు బహిరంగ మార్కెట్ ధర రూ.100 నుంచి రూ.110లుండేది. ప్రస్తుతం ధర మరో రూ. 20 పెరిగేసరికి చేతులెత్తేశారు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవల్సిన ప్రభుత్వం కాంట్రాక్టర్ల పట్ల మెతక వైఖరిని అవలంబిస్తూ వచ్చింది. కనీసం కొత్త టెండర్లు ఖరారయ్యేవరకూ పాత కాంట్రాక్టర్లు పంపిణీ చేయాల్సిందేనంటూ హెచ్చరికలు కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో మంగళ, బుధ వారాలలో జరిగే టెండర్ల ప్రక్రియలో ధర ఏమేరకు పలుకుతుందో, ప్రభుత్వం ఏ మేరకు సంబంధిత కాంట్రాక్టర్లకు కట్టబెడుతుందో వేచి చూడాల్సిందే. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం తమ వద్ద 103 టన్నుల నిల్వలున్నాయని, రేషన్ దుకాణాల వద్ద మిగిలి ఉన్న సరుకును కలుపుకొని మొత్తం పాతిక శాతం ఉంటాయంటూ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు పేర్కొంటున్నారు. కార్డుదారులకు రేషియో చొప్పున పంపిణీ చేయాలా లేక కొన్ని దుకాణాలకే వాటిని సర్థాలా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. ఎందుకిలా... బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర రూ.100 నుంచి రూ.110 ఉన్న సమయంలో కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ధర రూ. 20 పెరిగేసరికి చేతులెత్తేశారు. ధరతో సంబంధంలేకుండా పంపిణీ చేయాల్సిన కంట్రాక్టర్‌పై ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించడంతో వినియోగదారులకు ఈ దుస్థితి ఏర్పడింది.