goods distribution
-
సరుకులు లేవు..సమన్వయం లేదు
ఆరురోజులుగా విజయవాడ అతలాకుతలమవుతోంది. లెక్కలేనన్ని మరణాలు... అంతులేనంత నష్టం.. ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు తల్లకిందులైపోయాయి.. ఇంతజరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్‌షోలు, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు. సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురుచూశారు.. యథాప్రకారం అదీ లేదు... ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు.. వీధిలో చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు..సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. శుక్రవారం ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్‌సింగ్‌నగర్‌లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు. ‘ఈ రోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు.. ఇటు ఆహారం అందించలేకపోయారు... అక్కడ ఉన్న ముసలాయన నా గతి ఏంటి? అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి..’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రోజు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో.. యంత్రాలతో కాదు’ అని అన్నారు. ‘అప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్‌గా బయటకొస్తారు. ఈ రోజు ఇక్కడ అదే జరిగింది’ అని అన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా.. ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండియన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేయలేదా? అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగ చేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. ‘సర్.. నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ.. సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు.. నేను, మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు’ అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండియన్‌తో మంత్రులుగా మేం పాలసీలు మాత్రమే ఇస్తాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వమంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. -
కానుకలు వచ్చేశాయ్!
బేల/ఆదిలాబాద్‌రూరల్: రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరపున గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చేశాయ్. ఈ నెల 7వ తేదిన రంజాన్ నెల ప్రారంభం కాగా జిల్లాలోని పేద ముస్లింలకు ఈ గిఫ్ట్‌ల పంపిణీతో పాటు ఈఫ్తార్ విందుల నిర్వహణ కోసం ఇప్పటికే మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు మొత్తం 4,500గిఫ్ట్ ప్యాక్‌లు చేరుకున్నాయి. ఈ నెల 18వ తేదీన వీటి పంపిణీ ప్రారంభానికి సన్నాహాలు చేసినప్పటికీ, అనివార్య కారణాలతో కుదరలేదని తెలిసింది. ఎట్టకేలకు 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా 61మసీదుల వద్ద వీటిని ఒకేసారి పంపిణీ చేయడానికి సంసిద్ధత కొనసాగుతోంది. దీంతో పాటు ఈ 28వ తేదీ సాయంత్రమే జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకర్గంలోని 19, బోథ్ నియోజకవర్గంలోని 9 మసీదుల వద్ద ఇఫ్తార్ విందులను సైతం ఏర్పాటు చేయనున్నారు. గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తారిలా.. రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించేందుకు జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌లో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తపైజామా, ఒక బ్యాగు ఉండనున్నాయి. స్థానిక మసీదు కమిటీల నిర్వాహకులు ఎంపిక చేసిన కుటుంబాలకే వీటిని అందించనున్నారు. ఎంపిక విధానంలో ఈ ఏడాది రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక చేసి టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లను ఒక రోజు ముందుగానే అందజేసి, గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీపై ఏసీబీ నిఘా సైతం ఉండనుంది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా పూర్తిస్థాయిలో మైనార్టీ అధికారులు పారదర్శకంగా మసీదు కమిటీ నిర్వాహకుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా వితంతులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుపేదలకు ఈ ప్రతిపాదనలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ఏసీబీ నజర్ ఉంచుతున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను మసీదు కమిటీ నిర్వహకులకు ఇచ్చి, గిఫ్ట్ ప్యాక్‌లు తీసుకున్నట్లు పేపర్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. మసీదు కమిటీ ఎంపిక చేసిన ప్రాంతంలో పోలీసులు, మైనార్టీ శాఖ అధికారులు మసీదు కమిటీ సమక్షంలో వీటిని పంపిణీ చేయనున్నారు. తమ పవిత్ర పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఈ గిఫ్ట్ ప్యాక్‌లు పంపించడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంపిణీకి ఏర్పాట్లు చేశాం నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఈ గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే జేసీ సమక్షంలో మసీదు కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. ప్రభుత్వం తరపున అందిస్తున్న ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణిని పారదర్శకంగా నిర్వహించనున్నాం. ఈ నెల 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. – కృష్ణవేణి, జిల్లా మైనార్టీ శాఖ అధికారి -
అప్పుపై అదే పప్పు
చౌక ధరల దుకాణాల్లో బియ్యం తప్ప మరే ఇతర సరుకులు పంపిణీ చేయడం లేదనే విమర్శల నేపథ్యంలో తెల్ల రేషన్‌కార్డుదారులకు కందిపప్పు, శనగపప్పు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పప్పుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉండటంతో ఏ విధంగా పంపిణీ చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. చంద్రన్న కానుకలో మిగిలిపోయిన పప్పులే ప్రసుత్తం ప్యాకింగ్ చేసి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డీలర్లకు అప్పు ప్రాతిపదికన కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నా సవాలక్ష షరతులు విధించి ఇబ్బందులకు గురిజేస్తుందనే విమర్శలొస్తున్నాయి. సాక్షి, విజయవాడ : తెల్లకార్డుదారులకు ఈ నెల నుంచి కందిపప్పు, పచ్చి శనగపప్పు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చినా ఆ సరుకులు పంపిణీ చేయాలంటే డీలర్లు సందేహిస్తున్నారు. ఉగాది నాటికి పేదలందరికీ విక్రయించే విధంగా ఇప్పటికే గోదాముల నుంచి కందిపప్పు, శనగపప్పు సరఫరాకు సిద్ధం చేశారు. ఈ పప్పు నాణ్యత సరిగా లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. దేశవాళీ కందిపప్పు పాతవి మిగిలిపోయిన స్టాక్ ఇస్తున్నారని, ఈ పప్పు త్వరగా ఉడకదని డీలర్లు చెబుతున్నారు. ఇక చంద్రన్న కానుకలో ఇవ్వగా మిగిలిన శనగపప్పు ఇప్పుడు తిరిగి ప్యాకింగ్ చేసి చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఇచ్చిన చంద్రన్న కానుకల్లో ముఖ్యంగా శనగపప్పు పుచ్చిపోయి పాడైపోయిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాన్నే తిరిగి ప్యాకింగ్ చేసి సరఫరా చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రన్న కానుక కోసం కొనుగోలు చేసిన శనగపప్పు అయిపోతే వచ్చే నెల నుంచి ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. రేటులో వ్యత్యాసం తక్కువ.... నాణ్యత అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ రేటులో మాత్రం ప్రైవేటు మార్కెట్‌తో పోల్చితే పెద్దగా తేడా లేదు. వాస్తవంగా ప్రైవేటు మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.55 కు లభిస్తుండగా, రేషన్ దుకాణంలో రూ.40 కు విక్రయిస్తున్నారు. Ôð శనగపప్పు రూ.45కు లభిస్తుండగా రేషన్ దుకాణంలో రూ.40 కు విక్రయిస్తున్నారు. అందువల్ల రేషన్ దుకాణంలో ఎంతమేరకు కొనుగోలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిలోకి రూ.2 కమీషన్ కావాలి... కేజీ కందిపప్పు, శనగపప్పు విక్రయిస్తే కేవలం 45 పైసలు మాత్రమే ప్రభుత్వం డీలర్లకు ఇస్తోంది. దీన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణానికి సుమారు 500 కార్డులు ఉన్నాయి. ఒక కార్డుకు కిలో కందిపప్పు ఇస్తారు. ఈ లెక్కన 500 కేజీలకు రూ.250 కమీషన్ వస్తుంది. ఈ కమీషన్ ఎగుమతులు దిగుమతులకు, తరుగులకే సరిపోవని, అందువల్ల కమీషన్ కేజీకి రూ.2 చొప్పున చెల్లించాలని ఏపీ రేషన్ డీలర్ల కన్వీనర్ కాగిత కొండ (జేమ్స్) డిమాండ్ చేశారు. లేకపోతే డీలర్లు ఆర్థికంగా నష్టపోతారని వాపోయారు. కందిపప్పుకే అప్పు... కేవలం కందిపప్పు మాత్రమే అప్పుగా ఇస్తామని, శనగపప్పుకు మాత్రం ముందుగా డీడీ రూపంలో డబ్బు చెల్లించిన తరువాతనే సరుకు తీసుకోవాలని సూచించింది. గతంలో కొంతమంది డీలర్లు కందిపప్పు తీసుకుని అమ్మలేకపోయారు. దీంతో సుమారు 70 మంది డీలర్లు పౌరసరఫరాల శాఖకు రూ.30 లక్షల వరకు బకాయిలున్నారు. ప్రస్తుతం ఆ డీలర్లకు కందిపప్పును అప్పుగా ఇవ్వబోమని, డబ్బులు చెల్లించాల్సిందేనని ఆంక్షలు విధించారు. ప్రతి డీలర్ కందిపప్పు, వచ్చి శనగపప్పు తప్పని సరిగా అమ్మాల్సిందేనని ఆదేశిస్తున్నారు. పప్పుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉండటంతో అప్పులపై సరుకు ఇస్తేనే సరఫరా చేస్తామంటూ డీలర్లు మొండికేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం దిగి వచ్చింది. ఉన్నంత మేరకే సరఫరా చేస్తాం... చంద్రన్న కానుకలో మిగిలిన శనగపప్పును మాత్రమే ఇప్పుడు సరఫరా చేస్తున్నాం. అది అయి పోయిన తరువాత ఇస్తామో లేదో చెప్పలేం. క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి నాణ్యత బాగా ఉందని చెప్పిన తర్వాతే చౌకధరల దుకాణాలకు పంపుతున్నాం. బకాయి ఉన్న డీలర్లకు కందిపప్పు అప్పుగా ఇవ్వడం కుదరదు. కమీషన్ పెంచడం మా చేతిల్లో లేదు. – వరప్రసాద్, డిస్ట్రిక్ట్ మేనేజర్, పౌరసరఫరాలశాఖ -
అంగన్వాడీలకు ఇక పక్కాగా సరుకులు
ఆన్లైన్ విధానంలో పంపిణీపై పర్యవేక్షణ ► మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు ► మ్యాన్యువల్ పద్ధతులకు స్వస్తి... సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల కిచ్చే సరుకుల పంపిణీలో అక్రమాలకు త్వరలో కళ్లెం పడనుంది. ఇప్పటివరకు మ్యాన్యువల్ పద్ధతిలో చేస్తున్న సరుకుల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్వస్తి పలకబోతోంది. దీని స్థానంలో ఆన్లైన్ పద్ధతిని తీసుకు రావాలని నిర్ణయించింది. ఈమేరకు సాఫ్ట్వే ర్ను అప్డేట్ చేస్తోంది. ప్రస్తుతం అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల పంపిణీకి ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా పారదర్శకతతో పాటు నిర్దేశిత సమయంలో కోడిగుడ్లు పంపిణీ అవుతున్నట్లు ఆ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో మిగతా సరుకుల పంపిణీకి కూడా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయా లని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అంగన్ వాడీ కేంద్రాలకు అందిస్తున్న సరుకులు ప్రాజెక్టుల పరిధిలోని గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. వీటిని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే క్రమంలో పలు అవకతవకలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గోదాముల నిర్వాహకులే సరు కులను స్వాహా చేస్తుండగా... మరికొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన సరుకులు దారిమళ్లుతున్నట్లు ఆరోపణలు న్నాయి. విజిలెన్స్ అధికారుల దాడుల్లోనూ ఈ భాగోతాలు వెలుగు చూశాయి. దీంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన ఆ శాఖ... ఈమేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ప్రొసీడింగ్లతోనే సరుకులు... అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం, బియ్యం, పప్పులు తదితర సరుకులు గోదాముల నుంచే తెచ్చుకోవల్సి ఉంటుంది. కానీ అక్కడ నుంచి నేరుగా కాకుండా ఆన్లైన్ ఆదేశాలతోనే వీటిని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తారు. సరుకుల పంపిణీకి సంబంధించిన వెబ్సైట్లో రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్రాల వారీగా ప్రొసీడింగ్‌లను జనరేట్ చేస్తారు. ఇవి నేరుగా సంబంధిత జిల్లా సంక్షేమాధికారులకు చేరతాయి. అలా వచ్చిన ఉత్తర్వులు జిల్లా కార్యాలయం నుంచి గోదాము అధికారులకు చేరవేస్తారు. అయితే ఈ ఉత్తర్వులు తెరిచేందుకు ఓటీపీ(వన్‌టైమ్ పాస్వర్డ్)లు సంబంధిత అంగన్వాడీ టీచర్లకు అందుతాయి. ఈ ఓటీపీని గోదాము అధికారులకు తెలియజేస్తేనే సరుకులు విడుదలవుతాయి. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. జూలై నెలాఖర్లోగా ఈ ప్రయోగం తుది దశకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. సత్ఫలితాలిస్తున్న ఎగ్ యాప్... ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్ల పంపిణీ అంతా ఎగ్‌యాప్ ద్వారా కొనసాగుతోంది. సీడీపీఓ, కాంట్రాక్టరు, అంగన్వాడీ టీచర్ల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. కాంట్రాక్టరు గుడ్ల స్టాకును అంగన్వాడీ కేంద్రానికి తెచ్చినప్పుడు ఓటీపీని అంగన్వాడీ టీచర్ ఎంట్రీ చేయాలి. అనంతరం స్టాకును అందించిన తర్వాత వివరాలను సదరు కాంట్రాక్టరు అప్లోడ్ చేసిన వెంటనే సంబంధిత సీడీపీఓకు సమాచారం అందుతుంది. అనంతరం అక్కడ బిల్లులు రూపొందించి నిధులు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ సత్ఫలితాలిస్తున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో నెలకొన్న సాంకేతిక సమస్యలను అధిగమిస్తున్నామని, త్వరలో ఈ యాప్‌ను అప్డేట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.