అంగన్‌వాడీలకు ఇక పక్కాగా సరుకులు | The perfect goods to Anganwadis | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు ఇక పక్కాగా సరుకులు

Published Fri, Jun 30 2017 1:47 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

అంగన్‌వాడీలకు ఇక పక్కాగా సరుకులు - Sakshi

అంగన్‌వాడీలకు ఇక పక్కాగా సరుకులు

ఆన్‌లైన్‌ విధానంలో పంపిణీపై పర్యవేక్షణ
► మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు
► మ్యాన్యువల్‌ పద్ధతులకు స్వస్తి...


సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల కిచ్చే సరుకుల పంపిణీలో అక్రమాలకు త్వరలో కళ్లెం పడనుంది. ఇప్పటివరకు మ్యాన్యువల్‌ పద్ధతిలో చేస్తున్న సరుకుల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్వస్తి పలకబోతోంది. దీని స్థానంలో ఆన్‌లైన్‌ పద్ధతిని తీసుకు రావాలని నిర్ణయించింది.

ఈమేరకు సాఫ్ట్‌వే ర్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. ప్రస్తుతం అంగన్‌ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల పంపిణీకి ప్రత్యేకంగా యాప్‌ రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా పారదర్శకతతో పాటు నిర్దేశిత సమయంలో కోడిగుడ్లు పంపిణీ అవుతున్నట్లు ఆ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో మిగతా సరుకుల పంపిణీకి కూడా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయా లని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అంగన్‌ వాడీ కేంద్రాలకు అందిస్తున్న సరుకులు ప్రాజెక్టుల పరిధిలోని గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి.

వీటిని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే క్రమంలో పలు అవకతవకలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గోదాముల నిర్వాహకులే సరు కులను స్వాహా చేస్తుండగా... మరికొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన సరుకులు దారిమళ్లుతున్నట్లు ఆరోపణలు న్నాయి. విజిలెన్స్‌ అధికారుల దాడుల్లోనూ ఈ భాగోతాలు వెలుగు చూశాయి. దీంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన ఆ శాఖ... ఈమేరకు తాజా నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్‌ ప్రొసీడింగ్‌లతోనే సరుకులు...
అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం, బియ్యం, పప్పులు తదితర సరుకులు గోదాముల నుంచే తెచ్చుకోవల్సి ఉంటుంది. కానీ అక్కడ నుంచి నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ఆదేశాలతోనే వీటిని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తారు. సరుకుల పంపిణీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్రాల వారీగా ప్రొసీడింగ్‌లను జనరేట్‌ చేస్తారు. ఇవి నేరుగా సంబంధిత జిల్లా సంక్షేమాధికారులకు చేరతాయి. అలా వచ్చిన ఉత్తర్వులు జిల్లా కార్యాలయం నుంచి గోదాము అధికారులకు చేరవేస్తారు.

అయితే ఈ ఉత్తర్వులు తెరిచేందుకు ఓటీపీ(వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌)లు సంబంధిత అంగన్‌వాడీ టీచర్లకు అందుతాయి. ఈ ఓటీపీని గోదాము అధికారులకు తెలియజేస్తేనే సరుకులు విడుదలవుతాయి. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. జూలై నెలాఖర్లోగా ఈ ప్రయోగం తుది దశకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు న్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.

సత్ఫలితాలిస్తున్న ఎగ్‌ యాప్‌...
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్ల పంపిణీ అంతా ఎగ్‌యాప్‌ ద్వారా కొనసాగుతోంది. సీడీపీఓ, కాంట్రాక్టరు, అంగన్‌వాడీ టీచర్‌ల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. కాంట్రాక్టరు గుడ్ల స్టాకును అంగన్‌వాడీ కేంద్రానికి తెచ్చినప్పుడు ఓటీపీని అంగన్‌వాడీ టీచర్‌ ఎంట్రీ చేయాలి. అనంతరం స్టాకును అందించిన తర్వాత వివరాలను సదరు కాంట్రాక్టరు అప్‌లోడ్‌ చేసిన వెంటనే సంబంధిత సీడీపీఓకు సమాచారం అందుతుంది. అనంతరం అక్కడ బిల్లులు రూపొందించి నిధులు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ సత్ఫలితాలిస్తున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో నెలకొన్న సాంకేతిక సమస్యలను అధిగమిస్తున్నామని, త్వరలో ఈ యాప్‌ను అప్‌డేట్‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement