బాధితుల సాక్షిగా ఒప్పుకున్న చంద్రబాబు
నిన్న ఆహారం లేదు.. ఇవాళ సరుకులూ లేవు
20 శాతం కూడా అందలేదు
ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు: చంద్రబాబు
తప్పు నాది కాదు.. నారాయణదన్న మంత్రి నాదెండ్ల
ఆరురోజులుగా విజయవాడ అతలాకుతలమవుతోంది. లెక్కలేనన్ని మరణాలు... అంతులేనంత నష్టం.. ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు తల్లకిందులైపోయాయి.. ఇంతజరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్‌షోలు, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు.
సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురుచూశారు.. యథాప్రకారం అదీ లేదు... ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు.. వీధిలో చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు..
సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. శుక్రవారం ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్‌సింగ్‌నగర్‌లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు.
‘ఈ రోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు.. ఇటు ఆహారం అందించలేకపోయారు... అక్కడ ఉన్న ముసలాయన నా గతి ఏంటి? అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి..’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రోజు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో.. యంత్రాలతో కాదు’ అని అన్నారు.
‘అప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్‌గా బయటకొస్తారు. ఈ రోజు ఇక్కడ అదే జరిగింది’ అని అన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా.. ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండియన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేయలేదా? అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగ చేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు.
సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. ‘సర్.. నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ.. సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు.. నేను, మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు’ అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు.
వెంటనే వీరపాండియన్‌తో మంత్రులుగా మేం పాలసీలు మాత్రమే ఇస్తాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వమంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment