సగం మందికే చంద్రన్న సంక్రాంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రన్న సంక్రాంతి కానుక జిల్లాలో సగం మందికే పరిమితమైంది. ప్రతి పేదవాడూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చంద్రన్న సంక్రాంతి కానుకను ప్రకటించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. సరుకులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం, సరఫరాలో జాప్యం పథకాన్ని నీరుగార్చాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆరు సరుకుల్లో ఐదు రకాలే వచ్చాయి. కంది పప్పు 65 శాతమే జిల్లాకు చేరింది. మిగిలినది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 7,52,274 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 3 లక్షల మందికే చంద్రన్న సరుకులు అందాయి. మిగిలినవారికి అందాలంటే మరో మూడు రోజులు పడుతుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. కాగా జిల్లాలో సుమారు 32 వేల కార్డులు ఇన్ యాక్టివ్(ఆధార్ లేకపోవడం వంటి కారణాలతో)గా ఉన్నాయి అయితే ఈ కార్డుదారులందరూ పేదవారే, వీరికి బయోమెట్రిక్ కార్డులు కూడా ఉన్నాయి.
ఇటీవల తుపాను పరిహారం కూడా వీరికి అందజేశారు. సంక్రాంతి చంద్రన్న సరుకులను మాత్రం వీరికి అందజేయడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఈ కార్డుదారులు సంక్రాంతి కానుకకు దూరమయ్యారు. ఆధార్ లేకపోవడం, సకాలంలో ఆధికారులు సమాచారం ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈ కార్డులు ఇన్ యాక్టివ్‌గా ఉండిపాయాయి. ఆదే విధంగా మరో పదివేల కార్డులు ఇటీవల రద్దయ్యాయి. వీటికి కూడా సరుకులు అందే అవకాశం లేదు. కాగా కందిపప్పు వంటి కొన్ని సరుకులు నాసిరకానివి రావడంతో వాటిని వెనక్కి పంపుతున్నారు. మొత్తం మీద జిల్లాలో 3 లక్షల మందికే సరుకులు అందజేశారు, కొన్ని గ్రామాల్లో మూడు సరుకులు, మరికొన్ని గ్రామాలకు ఐదు సరుకులు అందిజేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.