
సంక్రాంతికి ‘చంద్రన్న’ శఠగోపం
అమరావతి: జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది. వీటి లబ్ధిదారులకు సైతం చంద్రన్న కానుక ఇస్తామని అట్టహాసంగా ప్రకటించింది. అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నేతనుంచి సీఎం వరకూ సంక్రాంతికి ఇది నజరానా అన్నారు. అయితే కార్డులిచ్చిన ప్రభుత్వం ఆ మేరకు రేషన్ డీలర్లకు సరుకులు పంపలేదు. నూతనంగా కార్డులు పొందిన వారు సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుకను తీసుకుందామని చౌక ధరల దుకాణాల వద్దకు వెళితే కొత్త వాటికి సరుకులు రాలేదని డీలర్లు చెబుతున్నారు. అందరికీ చంద్రన్నకానుక అందేలా చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్వయానా పేర్కొన్నా క్షేత్ర స్థాయిలో పట్టిచుకున్న నాధుడు లేడు.
పండుగ పేరుతో ఊరించి మొండిచేయి...
పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు కూడా పిండి వంటలు చేసుకోవాలనే ఉద్దేశంతో తెల్లరేషన్ కార్డులున్న ప్రతి లబ్ధిదారుడికి కిలో గోధుమపిండి, అర కిలో ప్రకారం బెల్లం, కందిపప్పు, శనగపప్పు, అర లీటర్ పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఒక బ్యాగులో వుంచి చంద్రన్న కానుక పేరిట సరుకులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.30 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని ఆమేరకు రేషన్ షాపులకు సరుకులను సరఫరా చేశారు. వీరితో పాటు ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన జన్మభూమిలో 1.66 లక్షల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
వీరికి కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందజేస్తామని ప్రకటించి ఆ మేరకు రేషన్‌షాపులకు సరుకులను పంపక పోవడంతో లబ్ధిదారులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్నారు. కొత్తగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు కానుక కోసం డీలర్ల వద్దకు వెళ్తుంటే ఇంకా సరుకులు పంపలేదని కొందరు డీలర్లు వెనక్కు పంపుతుండగా మరికొందరు డీలర్లు ఈ–పాస్ మిషన్లో మీ పేర్లు ఇంకా నమోదు కాలేదని చెబుతున్నారు. దీంతో కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధి్దదారులు రేషన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప కానుక మాత్రం అందడం లేదు. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొందరు డీలర్లు ఈ విషయమై నేరుగా పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా గోడౌన్లకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం.
రవాణా చార్జీల భారమే ప్రధాన సమస్య...
గోడౌన్ల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటే వాటికయ్యే రవాణా చార్జీల భారం తమపై పడతాయనే ఉద్దేశంతో డీలర్లు సరుకులు తెచ్చుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు చంద్రన్న కానుక ఇవ్వాలనుకుంటే గోడౌన్ల నుంచి సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం రేషన్‌డీలర్లకు సరుకులు పంపకపోతే కొత్తగా రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు కానుక అందే పరిస్థితి కన్పించడం లేదు.