
కార్డులు మూడు వేలు..కానుకలు నూరు లోపు
సాక్షి, రాజమండ్రి : ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పంపిణీని ఆదివారం ఆర్భాటంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఆదివారం నాటికి జిల్లాకు కేవలం మూడు సరుకులు-గోధుమపిండి, శనగలు, నూనె- మాత్రమే గోదాములకు చేరాయి. ప్రారంభం సందర్భంగా కొన్ని చోట్ల మాత్రమే ఆరు సరుకులు పంపిణీ చేయగా అనేక చోట్ల మూడింటితోనే సరిపెట్టారు. ఇక ఆ మూడు సరుకులూ ప్రతి చౌక డిపోలో ఉండే సుమారు మూడు వేల కార్డులకు వందలోపు కార్డులకు సరిపడా మాత్రమే సరుకులు వచ్చాయి. మిగిలిన బెల్లం, కందిపప్పు, నెయ్యితో పాటు పూర్తిస్థాయిలో సరుకులు ఎప్పుడొస్తాయో అధికారులూ చెప్పలేక పోతున్నారు.
పట్టుమని పది మందికి కూడా పంపిణీ చేయకుండానే సరుకులు నిండు కోవడంతో తెల్లకార్డుదారులను డీలర్లు సోమవారం రమ్మంటున్నారు. దీంతో చంద్రన్న మాట నమ్మి పండుగకు సరుకులు కొనుక్కోనక్కరలేదని సంబరపడ్డ పేదలు నిరాశ చెందుతున్నారు. కాగా ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన వారికి సరుకులు సంచుల్లో ఇవ్వగా త ర్వాత వారికి డీలర్లు ప్లాస్టిక్ కవర్లలో పోసి ఇస్తున్నారు. అదేంటంటే సంచుల్లేవంటున్నారు. జిల్లాలోని 19 ని యోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో 15.20 లక్షల రేషన్ కార్డులకు చంద్రన్న కానుకలు అందాల్సి ఉండగా ఆదివారానికి గోదాములకు లక్షన్నర ప్యాకెట్లు కూడా చేరలేదు. వాటిలో 50 వేలైనా పంపిణీ కాలేదు.
పంపిణీ తీరిలా..
ఏజెన్సీలో అడ్డతీగల ప్రాంతంలో 20 వేల కార్డులకు 15 ప్యాకెట్లు.. అవీ మూడు సరుకులతోనే పంపిణీ చేశారు. రాజమండ్రిలో మూడు వేల కార్డులుండే ఒక్కో దుకాణానికీ 50 నుంచి 70 కార్డులకే మూడు సరుకులు పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రానికి మిగిలిన స రుకులు చేరితే సోమవారం సాయంత్రానికల్లా రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తామని అధికారులంటున్నారు. జిల్లాలోని 2,100 దుకాణాల్లో 1,500 దుకాణా ల డీలర్లు అన్ని సరుకులూ వచ్చాకే పంపిణీ చేద్దామని ఉన్న మూడు సరుకులు కూడా పంపిణీ చేయలేదు. ఆదివారం మండపేట రావులపేట రేషన్ డిపోలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సరుకుల పంపిణీ ప్రారంభించి కేవలం 20 మందికి మాతమే పంపిణీ చేశారు.
వేచి ఉన్న మహిళలు తమకూ సరుకులు ఇమ్మంటే సోమవారం రమ్మని పంపేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి నియోజక వర్గంలోని నాలుగు గ్రామాల్లో పంపిణీ ప్రారంభించారు. కేవలం పంపిణీ కోసమేనన్నట్టు డిపోల వద్ద 100 సంచులు మాత్రమే సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో గోధుమపిండి, నూనె, శనగలు ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి డిపోకు వంద నుంచి 150 మందికి పంపిణీ చేశారు. అయినవిల్లి మండలంలో 41 డిపోలకు కేవలం 29 డిపోలకు అదీ రెండు సరుకులు మాత్రమే అందచేశారు.
ప్యాకింగ్ తలపోటు మాకొద్దు..
పండుగ మూడు రోజులుందనగా హడావిడిగా సరుకులు కార్డుదారులకు చేర్చాలన్న అధికారుల ప్రయత్నాలను డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. ముందు కానుకలను సంచుల్లో ప్యాక్ చేసి పంపమని చెప్పగా ఇప్పుడు సరుకు లూజుగా సరఫరా చేసి, తమనే ప్యాక్ చేసి పంపిణీ చేయమంటున్నారని వాపోతున్నారు. తమకున్న సిబ్బందితో ఆ పని సాధ్యం కాదంటున్నారు.