ఏలూరు (మెట్రో) :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వరాలు ప్రకటించకపోగా.. జనమంతా తాను చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందేనని పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు రైతులు భూములు ఇవ్వాల్సిందేనని పునరుద్ఘాటించారు. గురువారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చంద్రన్న స్వయం ఉపాధి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు రుణాల పంపిణీకి
శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణాన్ని భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాల ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆక్వా పార్క్ నుంచి వచ్చే వ్యర్థాలను, కలుషితాలను సముద్రంలోకి వదులుతారని ముఖ్యమంత్రి చెప్పగా, సముద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుందుర్రు ఆక్వా పార్క్ నుంచి వ్యర్థాలను నేరుగా అక్కడికి ఎలా తరలిస్తారన్న సందేహాలకు తెరలేపారు. పరిశ్రమలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని, పరిశ్రమలు కావాలంటే రైతులు భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి పనికీ భూములు అవసరమని, రైతులు భూ సేకరణను అడ్డుకోవద్దని కోరారు.
కొల్లేరు కాంటూర్‌పై స్పష్టత ఏదీ
కొల్లేరు కాంటూరు కుదింపు విషయంలోనూ చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కాంటూర్‌ను కుదించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కొల్లేరు నాయకులు కోరగా.. ఎప్పటిలా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఏలూరుకు కాస్త ఊరట
పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీని ఆదరించిన జిల్లా అని, ఈ జిల్లాకు అన్ని అంశాల్లో ప్రాధాన్య ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఏలూరు ఎమ్మెల్యే, మేయర్ కలసి ప్రణాళికలు రూపొందిస్తే ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్‌ఎస్‌ఆర్‌కు పదవి
రోగులకు సేవలు అందించేందుకు నిరంతరం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోనే ఉండే ఎమ్మెల్సీ రాము సూర్యారావు (ఆర్‌ఎస్‌ఆర్) మాస్టారు వంటి నాయకులు సమాజానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి సలహా కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇసుక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, పేద ప్రజలకు ఇసుక అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
కాపుల కోరిక నెరవేరింది : చినరాజప్ప
ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కాపుల చిరకాల కోరిక సీఎం చంద్రబాబు ద్వారా నెరవేరిందన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల రుణంతోపాటు బ్రాహ్మణులకు రూ.50 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. కాపు మహిళల అభివృద్దికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పారిశ్రామికవేత్తలను రప్పించి పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపుల సాధికారిత కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ షేక్ నూర్జహాన్ ప్రసంగించారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, పితాని సత్యనారాయణ, బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.
భరించాల్సిందే!
Published Fri, Feb 26 2016 12:19 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM
Advertisement
Advertisement