చీటింగ్ ముఠా అరెస్టు
Published Thu, Aug 29 2013 3:29 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
ఒంగోలు, న్యూస్‌లైన్ : సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మోసగాళ్లను అరెస్టు వారి నుంచి రూ.2లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ పల్లె జాషువా బుధవారం విలేకరులకు వెల్లడించారు. స్థానిక సంతపేటలో నివాసం ఉంటున్న చంద్రశేఖరరెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని మూడు నెలల క్రితం బంగారం పేరుతో కొందరు రూ.5 లక్షలకు మోసం చేశారు. ముందు బంగారం ఇస్తామని చెప్పి రూ.5లక్షలు తీసుకుని బ్యాగులో పెట్టుకున్నారు. బంగారంతో రావాల్సిన వ్యక్తి రాకపోవడంతో సదరు వ్యాపారికి నగదు మళ్లీ ఇచ్చేశారు.
ఇక్కడే తిరకాసు జరిగింది. నగదు ఉన్న బ్యాగులను మార్చి వేశారు. ఒకే రకం ఉన్న బ్యాగులను రెండింటిని సిద్ధం చేసుకుని వ్యాపారిని మోసం చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్ మొత్తం భీమవరం నుంచే జరిగిందని డీఎస్పీ తెలిపారు. భూమన్ అనే వ్యక్తి గతంలో పాలకొల్లు మండలం జున్నూరుకు చెందిన బండారు సత్తిబాబు అలియాస్ శంకర్‌ను ఇదే తరహాలో మోసం చేశాడు. అనంతర సత్తిబాబు అతని బృందంలో సభ్యునిగా మారిపోయాడు. వీరికి చిలకలూరిపేటకు చెందిన షేక్ ఖాదర్‌బాషా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
అతని ద్వారా అద్దంకికి చెందిన షేక్ హసన్ అలియాస్ కార్తీక్‌రెడ్డి అలియాస్ మున్నా (నెల్లూరు జిల్లా ఇసుకపల్లి), అద్దంకికి చెందిన బత్తుల అబ్రహం అలియాస్ కుమార్, దారా యలమంద అలియాస్ నారాయణలు పరిచయం అయ్యారు. అరెస్టయిన నలుగురు నిందితుల నుంచి రూ.1.89 లక్షలు, ఒక ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ సీఐలు హుస్సేన్, బీటీ నాయక్, టూటౌన్ సీఐ సూర్యనారాయణ, ఎస్సై నాయబ్స్రూల్, సీసీఎస్ సిబ్బంది బాల, మారుతి, ఆంజనేయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement