సాక్షి, హైదరాబాద్: వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో నగరవాసిని మోసం చేసిన ముఠా అందుకు ‘గ్యారెంటీ’ కోసం ఓ నకిలీ డీఎస్పీని సృష్టించింది. వీరి చేతిలో రూ.1.2 కోట్ల మోసపోయిన బాధితుడు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మెహిదీపట్నానికి చెందిన సునీల్‌కుమార్ 2018 డిసెంబర్‌లో జయప్రతాప్ అనే వ్యక్తిని కలిశాడు.
(చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!)
అప్పట్లో జయప్రతాప్ తన వద్ద రూ. 1.2 కోట్లు పెట్టుబడి పెడితే వ్యాపారం చేసి, వారం రోజులో రూ. 3 కోట్లు ఇస్తానంటూ చెప్పాడు. అతడి మాటలను సునీల్ పట్టించుకోలేదు. దీంతో దాదాపు ఏడాది తర్వాత మరోసారి జయప్రతాప్ హిమాయత్‌నగర్‌లోని సునీల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో మునిరామయ్య అనే వ్యక్తినీ వెంట తీసుకువెళ్లాడు. మునిరామయ్య తిరుపతిలో సీఐడీ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్నారని, పెట్టుబడికి ఆయన గ్యారంటీగా ఉంటాడని చెప్పి సునీల్‌ను ఒప్పించాడు.
దీంతో పాటు రూ.3 కోట్లకు రాసిన చెక్కులు, ఖమ్మంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పత్రాలు ఇవ్వడంతో జయప్రతాప్‌కు 2019 నవంబర్‌లో రూ.1.2 కోట్లు ఇచ్చాడు. ఎంతకూ తనకు రావాల్సిన డబ్బును జయప్రతాప్ ఇవ్వకపోవడం, అతడి ఆచూకీ లేకపోవడంతో మునిరామయ్యను సంప్రదించాలని సునీల్ భావించారు. ఏపీ సీఐడీ విభాగంలో ఆరా తీయగా... ఆ పేరుతో ఏ అధికారీ లేరని తేలింది. దీంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుడు ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!)
Comments
Please login to add a commentAdd a comment