సాక్షి, చిత్తూరు: ప్రభుత్వ ప్రకటనలకు, చేతలకూ పొంతన లేకుండా పోతోంది. కరువు నేపధ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా సాయం అందిస్తామని పదే పదే చెప్పిన ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చింది. 2013లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పి అన్నదాతల నెత్తిన పిడుగువేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీ వేదికగా స్వయంగా ప్రకటించడం తెలిసిందే.
కరువు రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు రైతాంగానికి హామీలు గుప్పించారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ గత ఏడాదికి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తామంటూ మాటిచ్చారు. కానీ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో లేదని వ్యవసాయశాఖ మంత్రి తేల్చిచెప్పడం చూస్తుంటే ప్రభుత్వ ద్వంద్వవైఖరిని తేటతెల్లం చేస్తుంది.
తీవ్రవర్షాభావం, కరువు నేపధ్యంలో జిల్లాలో 2013 ఏడాదికిగాను ప్రభుత్వం 33 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఆ ఏడాది ఖరీఫ్ లో జిల్లా వ్యాప్తంగా లక్షా 20 వేలమంది రైతులు 1.18 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట సాగుచేసి నష్టపోయారు. కరువు ప్రకటన నేపథ్యంలో *108 కోట్ల మేర రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించాలి. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించి సొంత జిల్లా కరువు రైతాం గాన్ని ఆదుకుంటానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అంతేకాకుండా నష్టపోయిన మామిడి రైతులను సైతం ఆదుకుంటామని హామీలు ఇచ్చారు. బాబు అధికారం చేపట్టి 9 నెలలు ముగిసినా ఇంతవరకూ పైసా చెల్లించలేదు. పైగా జిల్లాకు వచ్చిన ప్రతి సారీ అదిగో ఇస్తాం..ఇదిగో ఇస్తామంటూ మాటలతో సరిపెడుతున్నారు.
తీవ్ర వర్షాభావం నేపధ్యంలో ఈ ఏడాదీ కరువు తప్పలేదు. దీంతో 2014 ఖరీఫ్ సైతం అన్నదాతలకు కష్టాలు మిగిల్చింది. 1,74,000 మంది రైతులు 92 హెక్టార్లలో వేరుశెనగ పంట సాగుచేసి సుమారు *400 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. ప్రభుత్వం 42 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి హెక్టార్‌కు *10 వేలు చొప్పున *122.16 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ దాని ఊసేలేదు. రైతులకు పైసా చెల్లించే ప్రయత్నం చేయలేదు.
జిల్లాకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆదుకుంటారని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది కరువు సాయం త్వరగా అందుతుందని ఎదురు చూశారు. తీరా చూస్తే గత ఏడాది కరువు సాయంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదంటూ వ్యవసాయశాఖ మంత్రి చావుకబురు చల్లగా చెప్పడంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వం వంచనకు పాల్పడడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో చెరకు రైతులకు బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేదు.
కరువు రైతుకు శఠగోపం
Published Mon, Mar 16 2015 4:23 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement