
సాక్షి, కడప : జిల్లాలోని పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పార్థి గ్యాంగ్ పేరుతో దోపిడీ దొంగలు జిల్లాలోకి ప్రవేశించారనే ప్రచారం ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురి చేస్తోంది. పగలు చిరు వ్యాపారులు చేసుకునే వారిలా వీధుల్లో తిరిగి రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దోపిడీలకు తెగబడతారనే ప్రచారం ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వివిధ జిల్లాల పోలీసుల పేరుతో పార్థి గ్యాంగ్ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిళ్లు ఆరుబయట కాదుకదా.. ఇళ్లలో పడుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఏ క్షణంలో దొంగలు దాడి చేస్తారో అని పహారా కాస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చింతకొమ్మదిన్నె,
వల్లూరు, నందలూరు, చెన్నూరు తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించారనే అనుమానంతో వారి కోసం కర్రలు, కత్తులు చేతబట్టుకుని ఆయా గ్రామాల వారు గాలింపు చర్యలు చేపట్టారు. అదిగో పార్థీ గ్యాంగ్..ఇదిగో చడ్డీ గ్యాంగ్...మరోచోట ఇరానీ గ్యాంగ్ అంటూ ఎక్కడ చూసినా పుకార్లతో పల్లెల్లో భయోత్పాతం నెలకొంది. పోలీసులపైనే ఆధారపడకుండా ఒకింత ప్రజల్లో చైతన్యం రావడం మంచిదే అయినా రాత్రిపూట ఎవరు కనిపించినా దాడులకు ఉపక్రమిస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. కొందరు మతిస్థిమితం లేనివారు కూడా ప్రజల చేతిలో దెబ్బలు తినక తప్పడం లేదు.
పోలీసులు స్పందించాలి
పార్థీ గ్యాంగ్.. చెడ్డీ గ్యాంగ్‌ల పేరుతో ప్రజలు భయపడుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రి సమయంలో గస్తీ నిర్వహించడమే కాకుండా పగటి పూట కూడా వీధుల్లో సంచరించే చిరు వ్యాపారుల కదలికలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయా స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలు ఎలాంటి ముఠాలు జిల్లాలోకి రాలేదని, భయపడాల్సిన పని లేదని ప్రకటిస్తున్నా ప్రజలను మాత్రం భయాందోళన వెంటాడుతోంది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment