విశాఖ ఎల్జీ పాలిమర్ ఘటనతో జిల్లాలోని పారిశ్రామికవర్గాలు, అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. పారిశ్రామిక కారిడార్‌గా ఉన్న జిల్లాలో అమ్మోనియా గ్యాస్, ఎల్‌పీజీ ఆధారిత, కెమికల్ ఫ్యాక్టరీ చాలా ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో కూడా అడపాదడపా అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు జరుగుతున్నాయి. మరణాలు సంభవించిన ఘటనలూ ఉన్నాయి. గత అనుభవాలు, విశాఖ ప్రమాద ఘటనతో జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా చర్యలకు దారితీశాయి. నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీ చేస్తున్నారు.
సాక్షి, నెల్లూరు/నెల్లూరు(టౌన్): జిల్లాలో సుమారు 5,400 కుపైగా పరిశ్రమలున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో చాలావరకూ మూతపడ్డాయి. ఇటీవల సడలింపు చేసి నాన్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే పరిశ్రమల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 70 శాతం పరిశ్రమల్లో పనులు ప్రారంభించారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, నిత్యావసర వస్తువుల తయారీ తదితర కంపెనీలకు అనుమతులు జారీ చేశారు. పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతి కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుని స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్పారు. ప్రధానంగా మాంబట్టు, కావలి, గూడూరు, కొడవలూరు, వెంకటాచలం, ముత్తుకూరు తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలకు అనుమతులు జారీ చేశారు.
పొంచి ఉన్న ప్రమాదం
జిల్లాలో రసాయనాలు వెలువడే పరిశ్రమలు నడుస్తున్నాయి. వాటిల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఫార్మా, కెమికల్ ఫ్యాకర్టీలున్నాయి. వాటితోపాటు అమ్మోనియా గ్యాస్ ప్రాసెసింగ్ నిర్వహణతో నడిచే చిన్న తరహా పరిశ్రమలున్నాయి. గతంతో పలుచోట్ల కాలుష్యం వెదజల్లి ప్రజలు ఇబ్బందులు పడిన సంఘటనలున్నాయి. అలాగే ఎస్‌ఈజెడ్‌లలో ఏర్పాటైన పలు అమ్మోనియా గ్యాస్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల్లో కూడా గ్యాస్ లీకైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల బాయిలర్స్ ప్రమాదం జరిగి కొందరు చనిపోయారు. నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. జిల్లాలో సుమారు 50 పరిశ్రమలకు ఎన్‌ఓసీ లేదని తెలిసింది. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన ఓ ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారులు గుర్తించారు.
తనిఖీల కోసం..
ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను పాటిస్తున్నారా? లేదా? అని ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించేందుకు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్యర్యంలో టీములు ఏర్పాటు చేశారు. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు డివిజన్లకు ఒక్కో బృందాన్ని నియమించారు. అవి ప్రతిరోజూ పరిశ్రమలను తనిఖీ చేస్తాయి. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తారు. ఆటోనగర్‌లో స్వీయ ధ్రువీకరణపత్రం సమర్పించి అనుమతి పొంది పనులు ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర వైర్స్ ప్రాడెక్ట్స్, పీఎల్ ప్లాస్ట్‌లను గురువారం అధికారులు తనిఖీ చేశారు. అయితే అవి కంటైన్మెంట్ జోన్లలో ఉండడంతో మూయించేశారు. విశాఖలో జరిగిన ఘటన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో పరిశ్రమలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
గతంలో జరిగిన ప్రమాదాలు
♦ తడ మండలంలోని మాంబట్టు సెజ్ పరిధిలో ఉన్న ఇండస్ కాఫీ పరిశ్రమలో 2015లో బాయిలర్ శుభ్రం చేసే సమయంలో ముగ్గురు యువకులు మరణించారు. బాయిలర్‌లో దిగిన ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు దిగి ఊపిరాడక ప్రాణాలొదిలారు.
♦ ముత్తుకూరు మండలంలోని పడమటినాగలదొరువులో ఇటీవల శ్రీసాయి సుబ్రహ్మణ్యేశ్వర పామాయిల్ ప్యాకెట్ల తయారీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. రూ.3 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగింది.
♦ గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలోని బూదనం సమీపంలో ఉన్న పాల డెయిరీలో రెండున్నరేళ్ల క్రితం అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఆ సమయంలో కార్మికులు కొందరు స్పృ కోల్పోయారు. అలాగే పున్నపువారిపాళెం ప్రాంతంలో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో కూడా అమ్మోనియా గ్యాస్ లీకై కొందరు అస్వస్థతకు గురయ్యారు. రెండేళ్ల క్రితం కోట మండలం చిట్టేడు వద్ద ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో ఒక వ్యక్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతిచెందాడు. అయినా పరిశ్రమ యాజమాన్యం తగిన జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది మార్చి నెలలో మరో వ్యక్తి బలయ్యాడు.
♦ కొడవలూరు మండలంలో గతంలో ఓ రొయ్యల పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకవడంతో దివ్యాంగుడైన ఓ కార్మికుడు మృతిచెందాడు.
ఏమి చేయాలంటే..
♦ కరోనా వైరస్ నేపథ్యంలో పరిశ్రమలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.
♦ రెడ్‌జోన్ పరిధిలో ఉండే ఉద్యోగులు, కార్మికులను అనుమతించకూడదు. పరిమిత సంఖ్యలో సిబ్బంది చేత పని చేయించుకోవాలి.
♦ సిబ్బంది భౌతికదూరం తప్పకుండా పాటించాలి. ప్రతిఒక్కరికీ స్క్రీనింగ్ టెస్ట్ చేసి టెంపరేచర్ చెక్ చేయాలి.
♦ పరిశ్రమ లోపలి భాగంతోపాటు బయట శానిటైజర్‌ను స్ప్రే చేయాలి.
♦ ఏళ్ల తరబడి ఉన్న వైరింగ్, పైపులైన్లను ఒకసారి చెక్ చేసి లీకేజీలు ఉంటే వాటికి మరమ్మతులు చేయడం లేదా, కొత్త వాటిని బిగించడం చేయాలి.
♦ ఫైర్ సేఫ్టీ ధ్రువీకరణపత్రం, పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment