కేఈ శ్యాంబాబు దొరికేనా?
♦ముందుకు సాగని ‘చెరకులపాడు’ హత్య కేసు
♦లభించని డిప్యూటీ సీఎం కుమారుడి ఆచూకీ
♦హత్య జరిగి వందరోజులైనా..పురోగతిలేని దర్యాప్తు
♦కేఈ శ్యాంబాబును కేసు నుంచి తప్పించే యత్నాలు
♦పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు!
ఏదైనా హత్య జరిగితే హడావుడి చేసే పోలీసులు.. వైఎస్‌ఆర్‌సీపీ నేత చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో మాత్రం తాత్సారం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు కేఈ శ్యాంబాబును అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేత, డిప్యూటీ సీఎం కుమారుడు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నారాయణ రెడ్డి హత్య జరిగి వంద రోజులవుతున్నా.. ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుండడం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడి ఆచూకీని పోలీసులు కనుక్కోలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి , కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసు విచారణలో పోలీసుల వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో అధికారపార్టీకి చెందిన డిప్యూటీ సీఎం తనయుడు కేఈ శ్యాంబాబును అరెస్టు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 21వ తేదీన హత్య జరగగా.. ఇప్పటివరకు కేఈ శ్యాంబాబు కోణంలో విచారణ ముందుకు సాగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వంద రోజులు గడిచినప్పటికీ కనీసం ఆయన ఆచూకీ కనుక్కోలేకపోయారు. శ్యాంబాబు కోణంలో విచారణ కూడా జరపడం లేదని తెలుస్తోంది. అధికారపార్టీకి చెందిన నేత కుమారుడు కావడం, వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు..దర్యాప్తులో అడుగు ముందుకు వేయలేకపోతున్నారని సమాచారం. హత్య జరిగిన తర్వాత నాలుగైదు రోజుల్లోనే నిందితుల్లో అధికశాతం మందిని పట్టుకున్న పోలీసులు కేఈ శ్యాంబాబు విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. మొత్తం మీద పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హడావుడి చేసి..
పత్తికొండ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అండదండలతో సాగుతున్న అనేక అరాచకాలను చెరకులపాడు నారాయణ రెడ్డి బలంగా ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టులో కేసులు వేయడం... దానిపై హైకోర్టు ఏకంగా విచారణకు ఆదేశించడం వారికి మింగుడుపడలేదు. ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడడంతో నారాయణరెడ్డిపై వారు కసి పెంచుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నారాయణ రెడ్డిదే గెలుపు అనే భావన కూడా ప్రజల్లో బలపడిపంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ కోణంలోనే హత్య జరిగిందని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దీనిపై ఏకంగా గవర్నర్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో హత్య అనంతరం పోలీసులు హడావుడి చేసి కిందిస్థాయి నేతలను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే హత్యలో ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఈ శ్యాంబాబు విషయంలో మాత్రం అడుగు ముందుకు వేయడం లేదనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. పైగా ఆయన పాత్ర లేదనే రీతిలో కేసును ముగించాలనే ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులకు ఈ నియోజకవర్గంలో పనిచేయడమే కత్తిమీద సాముగా తయారైంది. అధికారపార్టీ నేతలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక మంది పోలీసులు ఇబ్బందులపాలైన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
ఆరోపణలు..సస్పెన్షన్లు..
డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గమైన పత్తికొండలో పనిచేస్తున్న పోలీసులపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు సస్పెండ్‌కు కూడా గురయ్యారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. వివిధ ఆరోపణలతో సీఐలు, ఎస్‌ఐలు వీఆర్‌కు పంపించారు. వెల్దుర్తి ఎస్‌ఐ మారుతీ శంకర్ సస్పెండై వీఆర్‌కు వెళ్లారు. వీఆర్‌కు వెళ్లిన ఇదే ఎస్‌ఐను జొన్నగిరి స్టేషన్‌కు పంపించారు. అక్కడ కూడా సివిల్ పంచాయితీలో తలదూర్చి వీఆర్‌కు వెళ్లారు. పత్తికొండ సీఐ తలారీ శ్రీనివాసులు కూడా వీఆర్‌కు వెళ్లారు.
మరో పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు కూడా వీఆర్‌కు పంపించారు. వెల్దుర్తి ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ కూడా ఆరోపణలతోనే వీఆర్‌కు వెళ్లారు. కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పత్తికొండలోనే పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన పోలీస్ అధికారులనే అధికారపార్టీ నేతలు నెత్తికెక్కించుకున్నారు. దీనిని గమనిస్తే వారు.. పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికైనా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసు ఉన్నతాధికారులు.. నారాయణ రెడ్డి హత్య కేసులో ముందడుగు వేయాలని ఆయన కుటుంబీకులు కోరుతున్నారు.