విలేకరులతో మాట్లాడుతున్న కంగాటి శ్రీదేవి, బీవై రామయ్య
సాక్షి, కర్నూలు: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసులోని నిందితుడు శ్యామ్‌బాబు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
నారాయణరెడ్డి, సాంబశివుడులను 2017 మే 21న అతికిరాతంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో కేఈ శ్యామ్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌తో సహా 15 మందిని నిందితులుగా చేర్చారని, అయితే.. డిప్యూటీ సీఎం తన పలుకుబడిని ఉపయోగించి కేఈశ్యామ్‌బాబు, బొజ్జమ్మ, నాగతులసీప్రసాద్‌పై కేసును తొలగించారని తెలిపారు. దీనిపై తాము డోన్ కోర్టుకు వెళ్లగా.. వారిని కేసులో ముద్దాయిలుగా చేర్చుతూ మార్చి ఒకటో తేదీలోపు అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు.
అయితే.. కేఈ శ్యామ్‌బాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్లు శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైందని, అది వాస్తవం కాదని తెలిపారు. హైకోర్టులో శ్యామ్‌బాబుకు ఎలాంటి స్టే రాలేదన్నారు. దీనిపై ఏ ఆధారాలతో వార్త ప్రచురించారో ఆంధ్రజ్యోతి యాజమాన్యం, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును సైతం ఆంధ్రజ్యోతి అపహాస్యం చేస్తోందని, దీనికి టీడీపీ నాయకులు వంత పాడుతున్నారని విమర్శించారు. తమ కుటుంబం, అనుచరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ నిందితులకు హైకోర్టులో స్టే వచ్చినా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, వారిని అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌కు హైకోర్టులో స్టే వచ్చినట్లు చెబుతున్నారని, అయితే దీనిపై ఇంతవరకు తమకు సమాచారం లేదని చెప్పారు. దీనిపై కూడా మళ్లీ పిటిషన్ వేసినట్లు తెలిపారు. చెరుకులపాడులో నారాయణరెడ్డి హంతకులు విచ్ఛలవిడిగా ఇసుకా దందాకు పాల్పడుతున్నారన్నారు. వారిని ఏమైనా అంటే దాడులు చేస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని తెలిపారు.
డోన్ కోర్టు తీర్పు ప్రకారం శ్యామ్‌బాబు, బొజ్జమ్మ, నాగతులసీప్రసాద్‌లను అరెస్టు చేయడానికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసును విచారించి నిందితులను అరెస్టు చేయాలని బీవై రామయ్య కోరారు. గతంలో పోలీసులు సక్రమంగా విచారణ చేయకపోవడం వల్లే నిందితులను అరెస్టు చేయలేదన్నారు. తిరిగి అదేవిధంగా విచారణ కొనసాగితే వారి పనితనాన్ని తప్పు పట్టాల్సి వస్తుందన్నారు. మార్చి ఒకటో తేదీలోపు నిందితులను అరెస్టు చేస్తారన్న విశ్వాసంతో ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment