సాక్షి,కడప/కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కలెక్టర్ బాబూరావునాయుడును బదిలీ చేసింది. ఆయనను గిరిజన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన స్థానంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్, తుడా వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న చేవూరి హరికిరణ్‌ను నియమించింది. 1982 ఏప్రిల్ 29నæ జన్మించిన హరికిరణ్ 2006లో ముంబయి ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2009లో యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించారు. 2010–11లో కృష్ణా జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు.
తర్వాత 2011–12లో భద్రాచలం, 2012–13లో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా, 2013–15 మధ్య విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా, 2015–17లో కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ 2017 మే నెలలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఆయన పదోన్నతిపై కలెక్టర్‌గా కడపకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరికిరణ్ కుటుంబం విశాఖపట్టణం గాజువాకలో స్థిరపడ్డారు. తండ్రి సి.విజయ్‌కుమార్ వైద్యుడిగా సేవలు అందించగా, తల్లి సి.పద్మజ ఎంఏ పీహెచ్‌డీ చేయగా, సతీమణి బి.సుగుణ కూడా సింగఫూర్‌లోని నేషనల్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బయాలజీలో పీహెచ్‌డీ చేశారు.
ఏపీలో మొదటి ర్యాంకు
2009లో యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్స్‌లో హరికిరణ్ ఆలిండియాలో 18వ ర్యాంకు వస్తే, ఏపీకి సంబంధించి టాపర్‌గా నిలిచారు. విజయనగరంలోని కోరుకుండ సైనిక్ స్కూలులో చదువుకోగా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ) ఆంధ్ర యూనివర్శిటీలో చేశారు. ముంబయిలోని ఐఐటీలో 2006లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్ సెలెక్ట్ అయ్యారు.
ప్రజల కోసం
చిత్తూరుజిల్లా తిరుపతిలో మున్సిపల్ కమిషనర్‌గాపనిచేస్తున్న హరి కిరణ్ కడప కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ప్రజలకు మేలు చేయాలన్న తలంపు ఉ న్న అధికారి. అవినీతి రహిత సమాజం కోసం పరితపించే వ్యక్తిగా పేరు గడించారు. కిందిస్థాయి అధి కారుల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పర్యవేక్షించడంలో అందెవేసిన చేయి. ప్రజల కోసం బాగా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం హరికిరణ్ సొంతం.
జాయింట్ కలెక్టర్‌గా నాగరాణి
కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌కు సెక్రటరీగా పనిచేస్తున్న సి.నాగరాణిని కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న శ్వేత తెవతీయ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవడంతో కొన్నాళ్లుగా జేసీ–2గా ఉన్న శివారెడ్డి ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రభుత్వం రెగ్యులర్ జేసీగా నాగరాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర సతీమణి నాగరాణి గతంలో కర్నూలు ఆర్డీఓగా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా సేవలు అందించారు. ఏది ఏమైనా రెండు నెలలుగా ఇన్‌ఛార్జి పాలన సాగుతుండగా, ప్రభుత ఎట్టకేలకు రెగ్యులర్ జేసీగా నియమించింది.
బాబూరావునాయుడు బదిలీ
గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బాబూరావునాయుడు సంవత్సరానికి పైగా విధులు నిర్వహించారు. తనదైన ముద్ర వేశారు. ట్రాన్స్‌జెండర్లను జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కృషి చేయడమే కాకుండా వారికి రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరికి పెన్షన్లు మంజూరు చేయలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. గండికోట ముంపు పరిహార సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్‌సెల్ నిర్వహించారు.
గల్ప్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా వాసులను వారి కుటుంబాలతో కలిపేందుకోసం ‘బంధం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజంపేటలో యానాది దర్బార్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాగే జిల్లాలో పందుల పెంపకం దారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి సల్పారు. ఈ క్రమంలో అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించారు.కడప నగరంలో ఐదవ విడత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు వివాదానికి దారి తీశాయి. ఇందుకు బాధ్యులైన తహసీల్దార్ ప్రేమంత్‌కుమార్‌పై చర్యలకు ఉపక్రమించారు.
అయితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తన పరపతిని ఉపయోగించడంతో తహసీల్దార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. పలు ఆరోపణలు రావడంతో ఐదుగురు తహసీల్దార్లను సస్పెండ్ చేశారు. మైలవరం డిప్యూటీ తహసీల్దార్ కె.వెంకటసాయినాథ్‌పై కూడా ఇవే ఆరోపణలు వచ్చినప్పటికీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఒత్తిడితో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పలు శాఖల ఉన్నతాధికారులను ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే కలెక్టర్‌గా బాబూరావునాయుడు గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment