
సీఎం సారొస్తారని..!
ఎమ్మెల్యే కళా వెంకట్రావు తనయుడి పెళ్లికి ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, అనధికారుల కోసం, సీఎం కాన్వాయ్ కోసమని చెప్పి 10వ తేదీ ఉదయమే పెద్ద సంఖ్యలో ప్రైవేట్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 11న మధ్యాహ్నమే సీఎం వెళ్లిపోయారు. కానీ వాహనాలు మాత్రం వాటి యజమానులకు చేరలేదు. కారణం.. మళ్లీ 14న సీఎం సారొస్తుండటమే. ఆ పర్యటన కోసం వాహనాలన్నింటినీ ఎచ్చెర్లలోని రిజర్వ్ పోలీసు కార్యాలయానికి తరలించి అట్టిపెట్టారు.ఇంటే.. సీఎం రెండో పర్యటన ముగిసిన తర్వాత 14వ తేదీ నాటికి గానీ వాహనాలు తిరిగి ఇవ్వరన్నమాట! 10 నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఐదు రోజులపాటు తమ వాహనాలను తీసుకుంటే వాటి కిరాయిపైనే ఆధారపడే తాము ఏం కావాలని వాహన యజమానులు గగ్గోలు పెడుతున్నారు.
ఎచ్చెర్ల : సీఎం సారొస్తున్నారంటే చాలు.. అధికార దుర్వినియోగానికి హద్దు లేకుండాపోతోంది. సాక్షాత్తు ఉన్నతాధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడుతుండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతోపాటు రుణాలపై వాహనాలు కొని స్వయంగా అద్దెకు నడుపుకొంటున్నవారు రోజుల తరబడి ఆదాయం కోల్పోతున్నారు. సాధారణంగా సీఎం స్థాయి ప్రముఖులు వచ్చినప్పుడు జనం తరలింపు, ఇతరత్రా అవసరాల కోసం అధికారులు ప్రైవేట్ వాహనాలను సమీకరించడం కొత్త కాదు. ఈసారి మాత్రం నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు సీఎం చంద్రబాబు జిల్లాకు రానుండటం వాహన యజమానులకు ఆదాయం కోల్పోయే పరిస్థితి కల్పించింది. ఇప్పటికే 11న వచ్చి వెళ్లిన సీఎం.. తిరిగి 14న జిల్లాకు రానున్నారు. దీని కోసం అధికారులు పెద్ద సంఖ్యలో వాహనాలను సమకూర్చారు.
సీ బుక్కులు స్వాధీనం
రవాణా శాఖ అధికారులు ఈ నెల 10వ తేదీ ఉదయాన్నే ప్రైవేట్ వాహన యజమానులపై పడ్డారు. 11నాటి సీఎం పర్యటన కోసం శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఆమదాలవలస, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో ట్యాక్సీ స్టాండ్లకు వెళ్లి అందుబాటులో ఉన్న సుమారు 65 వాహనాల సీ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో స్కార్పియో, ఇన్నోవా, గ్జైలో, క్వాలీస్, సఫారీ, బొలేరో వంటి పెద్ద వాహనాలున్నాయి. వాటన్నింటిని సీఎం పర్యటనకు పంపించాలని ఆదేశించారు. అలా వెళ్లిన వాహనాలను 11న మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసిన వెనక్కి పంపకుండా ఎచ్చెర్లలోని ఆర్మ్డ్‌రిజర్వు పోలీసు కార్యాలయానికి తరలించారు. అలా ఎందుకు చేశారంటే.. 14న మళ్లీ సీఎం పర్యటన ఉంది.. అప్పుడు వాహనాలు దొరుకుతోయో లేదోనన్న భయంతో వీటినే ఉంచేశారని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఐదు రోజుల ఖర్చుల మాటేమిటి?
సాధారణంగా సీఎం పర్యటన ముందురోజు, పర్యటన రోజు వాహనాలు వినియోగించుకొని ప్రభుత్వ రేట్ల ప్రకారం రోజుకు రూ.800 నుంచి 1000 వరకు చెల్లిస్తుంటారు. అదే ప్రైవేటుగా అద్దెకు తిరిగితే వేలల్లోనే ఆదాయం వస్తుంది. కాగా కాన్వాయ్ నిర్వహణ రోజే డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లు అందిస్తారు. మిగతా రోజుల్లో సొంత ఖర్చులో తినాలి. ఇంతా చేసి పర్యటన రద్దయితే ఆ ఖర్చులు కూడా ఇవ్వరు. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఐదు రోజులపాటు రవాణా శాఖ ఆధీనంలో తమ వాహనాలు ఉండిపోతే కిరాయి కోల్పోవడంతోపాటు, రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని వాహన యజమానులు, డ్రైవర్లు వాపోతున్నారు. ఇదేమిటని నిలదీస్తే.. తర్వాత నిబంధనల పేరిట తమను వేధిస్తారేమోనని భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజను కావడంతో వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో వాహనాలను నిర్బంధంగా తరలించి తమ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.