రాపూరు, న్యూస్‌లైన్ : ఏడాది చిన్నారి శివనారాయణప్రసాద్ బ్లడ్ క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతున్నాడు. వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన రామకృష్ణ, శ్రీవల్లి నిరుపేద దంపతులకు పెళ్లయిన నాలుగేళ్లకు ఆ చిన్నారి జన్మించాడు. పెంచలకోన క్షేత్రంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వెల్లబోసుకున్నారు. పెనుశిల నరసింహస్వామి వరప్రసాదమైన తమ బిడ్డకు బ్లడ్‌క్యాన్సర్ ఉన్నట్లు చెన్నై క్యాన్సర్ వైద్యశాలలో నిర్ధారించారన్నారు. బిడ్డ ఆపరేషన్‌కు సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. తాను క్యాటరింగ్‌లో రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని పసిబిడ్డ తండ్రి రామకృష్ణ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు ఇచ్చారన్నారు. మరో రూ.5 లక్షలు అవసరమని, దాతలు దయతలిస్తే తమ బిడ్డ ప్రాణాలు నిలబడతాయని వారు వేడుకున్నారు. దాతలు సాయం చేయాలనుకుంటే 9490315539,9603341909 లలో సంప్రదించాలని వారు విన్నవించారు. కాగా పెంచలకోన దేవస్థాన సిబ్బంది,అర్చకులు స్పందించి రూ.25 వేలు విరాళంగా అందజేశారు.
ఇంకా సాయం చేస్తాం : ఆలయ ఈఓ
క్యాన్సర్‌తో బాధపడుతున్న శివనారాయణ ప్రసాద్‌కు తమ శక్తి మేరకు సాయం చేస్తామని పెంచలకోన దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. రామకృష్ణ, శ్రీవల్లి నరసింహస్వామి భక్తులు కావడంతో తామంతా స్పందిస్తున్నామన్నారు. ఆలయ పాలక వర్గ అధ్యక్షునితో చర్చించి మరింత చేయూతనిస్తామన్నారు.
ఆపన్నహస్తం అందించరూ...
Published Sun, Oct 20 2013 4:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement