నిలిచిన బాల్య వివాహం
రాయవరం, న్యూస్‌లైన్ :అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంపై అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో ఓ బాల్య వివాహం నిలిచిపోయింది. రాయవరంలో ఆదివారం ఈ సంఘటన జరగ్గా, బాలిక తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
రాయవరం గ్రామానికి చెందిన యువకుడికి, కె.గంగవరం బట్లపాలిక గ్రామానికి చెందిన బాలికకు ఆదివారం రాయవరంలో వివాహం చేసేందుకు వారి పెద్దలు నిర్ణయించారు. మైనర్ అయిన బాలికకు వివాహం చేస్తున్నారని, దీనిని నిలుపుదల చేయాలని ఓ అజ్ఞాత వ్యక్తి కాకినాడలోని స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయానికి సమాచారం అందించాడు. దీంతో ఈ వివాహాన్ని నిలుపుదల చేయాలని ఐసీడీఎస్ పీడీ జె.నిర్మలాకుమారి.. రాయవరం ఐసీడీఎస్ సీడీపీఓ సుశీలాకుమారికి ఆదేశించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి వెంకట్, సీడీపీఓ సుశీలాకుమారి కలిసి రాయవరంలోని ఆ యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు.
ఆ యువకుడు మేజర్ అని నిర్ధారించుకున్నారు. కపిలేశ్వరపురం సీడీపీఓ జెస్సీని ఫోన్‌లో సంప్రదించగా.. బట్లపాలికలో ఉన్న వధువు బాలిక అని తెలిపారు. మైనర్ అయిన బాలికను వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమని సుశీలాకుమారి, వెంకట్ కౌన్సెలింగ్ చేశారు. దీంతో పెళ్లి నిలుపుదల చేసేందుకు యువకుడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే అప్పటికే వివాహ ఏర్పాట్లు చేసుకున్న వరుడి బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేసుకున్నారు. బాలికకు వివాహం చేసే యత్నాలను విరమించుకున్నట్లు ఇరుపక్షాల కుటుంబ సభ్యుల వద్ద అంగీకార పత్రాలను అధికారులు తీసుకున్నారు.
బాలికలకు వివాహం చేయరాదు
బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని వెంకట్, సుశీలా కుమారి తెలిపారు. 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహం చేసే చర్యలను తల్లిదండ్రులు విడనాడాలన్నారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలకు వివాహం చేసేందుకు ప్రయత్నించే వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని సూచించారు.