
వీరికేమైంది?
గుమ్మఘట్ట : మండలంలోని గోనబావి గ్రామంలో చిన్నారులు గొంతు వాపు వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్నారు. గొంతు కింద వాపు వచ్చి.. తినడానికి, తాగడానికి ఇబ్బందికరంగా మారి, నీర సించిపోయే లక్షణాలతో ఈ నెల మూడో తేదీన ఆరో తరగతి విద్యార్థి గీత (11), పదో తేదీన నాలుగో తరగతి విద్యార్థి కవిత (9) చనిపోయారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు. తాజాగా గురువారం లక్ష్మి, వడ్డే ఆంజనేయులు దంపతుల కుమార్తె అక్షయ (4) ప్రాణాలు విడిచింది. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి జబ్బులబారినపడిన వారికి చికిత్సలు చేస్తున్నారు.
అయితే మరో 20 మంది విద్యార్థుల్లో పై లక్షణాలు కనిపించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతురాలు అక్షయ కుటుంబంలో ని శ్యామల, అశోక్ కూడా వెళ్లిన వారిలో ఉన్నారు. చిన్నారులు హరికృష్ణ, ఉపేంద్ర, మహేంద్రల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యాధికారి హిమ బిందు తెలిపారు. గ్రామంలో ఒకేసారి ఇంత మంది విద్యార్థులు చికిత్స కోసం వెళ్లడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదేం మాయరోగమో అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల ఉసురు తీసి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ఈ వ్యాధిని వెంటనే అరికట్టి.. మరిన్ని ప్రాణాలు పోకుండా చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు.
డిప్తీరియా వ్యాధేమోనని అనుమానం
గ్రామస్తులు భావిస్తున్నట్టుగా గవద బిల్లలు (టాన్సిల్స్)తో అయితే చనిపోరని, ఈ వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదని సీనియర్ ప్రజా ఆరోగ్యాధికారి వెంకటస్వామి చౌదరి పేర్కొన్నారు. గొంతువాపు లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను పరిశీలించిన ఆయన వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్‌లో సమాచారమందించారు. ఆయన అదేశాల మేరకు సంబంధిత పిల్లలను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డిప్తీరియా వ్యాధి ఏమై నా సోకిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్‌పీహెచ్‌ఓ ,ఆరోగ్య బోధకుడు లక్ష్మినారాయణ పర్యటించి వివరాలు సేకరించారు.
ఇంటింట వైద్య పరీక్షలు..
గ్రామంలో వైద్యులు హిమబిందు, రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చికిత్సలు నిర్వహిస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, తాగునీరు కలుషితమవడం వల్ల ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధులు అదుపులోకి వచ్చేవరకూ వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.
దోమల నిర్మూలనకు గంబూషియా చేపలు
గోనబావి గ్రామంలో దోమల నిర్మూలనకు మురికి కాలువలు, నీటి కుంటల్లో గంబూషియా చేప పిల్లలను వదిలినట్లు ఎంపీడీఓ జీ మునయ్య చెప్పారు. గురువారం ఈఓఆర్డీ ప్రసాద్‌తో కలసి గ్రామాన్ని సందర్శించిన ఆయన వ్యాధుల పట్ల ప్రజలకు అ వగాహన కల్పించారు. నీటి శ్యాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శివకుమార్, వైస్ ఎంపీపీ వడ్డే హనుమక్క, గోనబావి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి
రాయదుర్గం టౌన్: పట్టణంలోని 23వ వార్డులో నివాసముంటున్న చాకలి వన్నూరుస్వామి కుమార్తె శ్రావణి (4) మెదడువాపు వ్యాధితో బుధవారం ఉదయం బళ్లారిలోని విమ్స్‌లో మృతి చెందింది. ఆలస్యంగా సమాచారం అందడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యుడు మన్సూర్, ఆరోగ్య బోధకుడు లక్ష్మినారాయణ, మలేరియా యూనిట్ ఆఫీసర్ లక్ష్మానాయక్, ఇన్‌చార్‌జ మునిసిపల్ కమిషనర్ హనుమన్న, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్రయాదవ్ గురువారం మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు.
18 మంది పిల్లలకు ‘అనంత’లో చికిత్స
అనంతపురం మెడికల్ : గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన 18 మంది పిల్లలకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈఎన్‌టి వైద్యుడు అనిల్ కుమార్, చిన్న పిల్లల విభాగం వైద్యురాలు మల్లేశ్వరి పర్యవేక్షణలో వారికి చికిత్స కొనసాగుతోంది. 10 నెలల చిన్నారి గవద బిళ్లలతో, 17 మంది పిల్లలు టాన్సిల్స్‌తో బాధపడుతున్నారని వారు చెప్పారు. వీరిలో సగం మందికి జ్వరం, జలుబు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నామని, టాన్సిల్స్ వల్ల మృతి చెందే అవకాశం లేదని చెప్పారు.