కేసీఆర్ పై మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం
ప.గో:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప మండిపడ్డారు. స్థానికత అంశంపై చోటుచేసుకున్న వివాదంపై చినరాజప్ప శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడు సంవత్సరాల అంశాన్ని స్థానికతగా పరిగణించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో స్థానికత నిర్ధారణకు 1956 కన్నా ముం దు నుంచీ తెలంగాణలో నివసించడాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని కేసీఆర్ సూచించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటికి కేసీఆర్ కు కూడా తెలంగాణలో ఉండే అవకాశం లేదన్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా రక్షణ చర్యలు చేపడతామన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాజప్ప తెలిపారు. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తామన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ను కూడా సరఫరా చేస్తామని రాజప్ప హామీ ఇచ్చారు.
ఏడేళ్ల విద్యార్హతల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి తాము సూచించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో కమిటీ ఉంచింది. కేంద్రం ఆమోదం మేరకు 19 పేజీల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు ఉంటాయని, అయితే రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు లేవని ఆ వెబ్ సైట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.