జార్ఖండ్ హోం మంత్రితో మాట్లాడిన రాజప్ప
హైదరాబాద్: జార్ఖండ్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగు వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రిని ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఎన్.చినరాజప్ప కోరారు. జార్ఖండ్ హోం మంత్రికి చినరాజప్ప శనివారం హైదరాబాద్ నుంచి పోన్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను చినరాజప్ప జార్ఖండ్ మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాద ఘటనలో మృతి చెందిన మూడు మృతదేహాలను స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చినరాజప్ప విజ్ఞప్తిపై జార్ఖండ్ హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందిస్తామని... మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని చినరాజప్పకు జార్ఖండ్ హోం మంత్రి వివరించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది.
శనివారం ఉదయం అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టాలని రాజప్ప .... జార్ఖండ్ హోం మంత్రికి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.