చిరంజీవికి రాజమండ్రిలో సమైక్యసెగ
రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేయకుండా, కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తుతున్న కేంద్ర మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమైక్య సెగ గట్టిగా తగిలింది. రాజమండ్రిలోని కంబాల చెరువు ప్రాంతంలో చిరంజీవి కాన్వాయ్ని న్యాయవాద జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసుకుంటూ వాహనంపైకి న్యాయవాదులు దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకుని, చిరంజీవి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దాంతో గోదావరి గట్టు మీద దివంగత నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవి వెళ్లారు. సినీ రంగానికి ఎస్వీ రంగారావు చేసిన సేవలు మరువలేనివని ఆ సందర్భంగా చిరంజీవి చెప్పారు. అంతకుముందు ఆయన ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకుళపు శివరామ సుబ్రహ్మణ్యాన్ని పరామర్శించారు. తర్వాత కడియం వెళ్లి, అక్కడ ఎకో టూరిజం పార్కును ప్రారంభించారు. అక్కడి నుంచి కోటిపల్లిలో టూరిజం మెగా సర్కిల్ ప్రారంభానికి వెళ్లారు. చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం పోరాడతానని చిరంజీవి చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీరు చేసిందేమిటని ఈ సందర్భంగా న్యాయవాదులు చిరంజీవిని నిలదీశారు. అక్కడుండి ఏమీ చేయకుండా ఇక్కడికొచ్చి ప్రజలకు ఏం చెబుతారంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండటంతో సీమాంధ్ర ప్రాంతం అట్టుడుకుతోంది. ఇప్పటికే ప్రభుత్వోద్యోగులు సమ్మెలో ఉండగా జాతీయ రహదారుల దిగ్బంధానికి సైతం వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.