సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇటీవల ఐపీ పెడుతున్న ప్రైవేటు చిట్ వ్యాపారుల మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మురికి వాడల్లో పేదలే లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు దండుకుని నమ్మకంగా దోపిడీ చేస్తున్న వారికి కొందరు రాజకీయ నేతలు అండనివ్వడం గమనార్హం. ప్రైవేటు చిట్‌వ్యాపారులు కొన్ని ప్రాంతాల్ని ఎంచుకుని ఆయాచోట్ల ఇళ్లను అద్దెకు తీసుకోవడం లేదా స్థలాలు కొనుగోలు చేసి నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఆ తర్వాత స్థానికులతో మమేకమవుతూ ‘చిట్’లు వేస్తున్నారు. గుంటూరు మారుతీనగర్‌లో ఓ మహిళ ఇదే విధంగా చిట్‌లు నడిపి రూ.5 కోట్లకు శఠగోపం పెట్టింది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ మరుసటి రోజునే ఆమె కోర్టులో ఐపీ దాఖలు చేయడం, పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో సేఫ్‌జోన్ ఏర్పడింది. బాధితుల గోడు పట్టించుకున్న వారు లేరు.జిల్లాలో చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిధి ఒకరు ఆమెకు అండగా ఉండటంపై బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.
అరండల్ పేట 13వ లైన్‌లో ఓ వడ్డీవ్యాపారి పేదలు చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం పైగా, చిట్ పాడిన వారివద్ద అప్పుగా కొంత మొత్తాన్ని మినహాయించుకోవడం వంటి ఫిర్యాదులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొండా వెంకటప్పయ్య కాలనీ, సంగడిగుంటతో పాటు ఏటీ అగ్రహారంలో కూడా ఇటీవల నలుగురైదుగురు చిట్‌ల వ్యాపారులు డబ్బుతో ఉడాయించిన సంఘటనలు వున్నాయి.
పోలీసుల ఆరా
మురికివాడల్లో డబ్బులను వడ్డీలకు తిప్పుతూ.. చిట్‌లు వేస్తున్న మోసగాళ్ల పై లాలాపేట, కొత్తపేట, పాతగుంటూరు, పట్టాభిపురం, నగరంపాలెం స్టేషన్‌ల పరిధిలో చాలామంది బాధితుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఎవరో ఒకరు బాధితులు చిట్ వ్యాపారులు, వడ్డీరాయుళ్ల మోసాలు, దౌర్జన్యాలపై ఎస్పీకి నేరుగా ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. ఈ మేరకు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి స్పందించి చిట్‌లు, వడ్డీరాయుళ్ల వ్యవహారాలపై ఫిర్యాదులను దర్యాప్తు చేసే బాధ్యతను క్రైం (సీసీఎస్) డీఎస్పీకి అప్పగించారు. దీంతో స్టేషన్‌లవారీగా ప్రైవేటు చిట్‌లు వేస్తున్న వారు, వడ్డీలకు తిప్పుతున్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నట్టేట ముంచుతున్న చిట్టీలు
Published Tue, Dec 31 2013 12:31 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement