greevance program
-
అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్!
వరంగల్: అర్జీలకు పరిష్కారం చూపాలని ప్రతీవారం ఉన్నతాధికారులు ఆయా విభాగాల అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అర్జీలు వెల్లువెత్తుతున్నా.. ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌పై ‘సాక్షి’ పరిశీలన – కరీమాబాద్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతీ వారం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని 13 మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వివిధ కారణాలతో స్థానికంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే.. పలుమార్లు గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకున్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకట్లేదు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూములకు సంబంఽధించిన అర్జీలు వస్తున్నాయి. తర్వాత పింఛన్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపు స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో సైట్ ఓపెన్ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అర్జీలు ఇలా.. వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 97 ఆర్జీలు వచ్చాయి. వాటిలో జీడబ్ల్యూఎంసీ 4, బీసీ డెవలప్మెంట్ 3, వ్యవసాయశాఖ 9, రెవెన్యూ 36, మైనార్టీ వెల్ఫేర్ 3, ఏసీపీ ఖిలా వరంగల్ 1, వెటర్నరీ 1, లీడ్ బ్యాంక్ 5, పంచాయతీ అధికారి 6, డీఆర్డీఓ 11, ఉపాధి శాఖ 1, ఎస్సీ డెవలప్మెంట్ 1, జిల్లా సంక్షేమ శాఖ 5, సివిల్ సప్లయ్ 1, ఎస్సీ కార్పొరేషన్ 2, యుజవన క్రీడలు 1, ‘కుడా’ 2, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ 1, ఎంజీఎం 1, ఎన్పీడీసీఎల్ 1, ఈఈ ఇరిగేషన్ 1, విద్యాశాఖ అధికారికి సంబంఽధించిన అర్జీ 1 వచ్చాయి. కాగా.. ప్రజావాణి కార్యక్రమానికి 35 శాఖలకు చెందిన అధికారులు హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులు రాలేని పరిస్థితిలో ఆయా శాఖలకు చెందిన అధికారులు వస్తుంటారు. ఈక్రమంలో సోమవారం పలువురు హాజరు కాలేదు. కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఫోటోలో ఉన్న బాలుడు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బూరుగు మణిదీప్. ఇతడికి మానసిక దివ్యాంగుల పెన్షన్ కోసం మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా.. ఇప్పటికీ మంజూరు కాలేదు. సదరం క్యాంపులో 75 శాతం చూపుతున్నా.. రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు వచ్చామని బాలుడి తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికై నా పెన్షన్ మంజూరు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. -
ప్రణాళికలు ఘనమైనా..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కలెక్టరుగా జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా సత్ఫలితాన్నివ్వడం లేదు. గ్రీవెన్స్‌కు బదులు ప్రజాదర్బార్.. కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌సెల్ కు బదులు విజయకుమార్ నూతన పంథాలో ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని భావించారు. అయితే ఆశించిన ఫలితాలు లేవు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లలో ప్రజాదర్బారు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఒకటి, మూడు సోమవారాలు ఒంగోలులో, రెండో సోమవారం కందుకూరులో, నాలుగో సోమవారం మార్కాపురంలో నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా ప్రతి బుధవారం మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాదర్బారులో భాగంగా జిల్లా స్థాయి అధికారులందరినీ తీసుకెళ్లి, ఆయా కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఉంటున్నాయి. కలెక్టరు స్వయంగా చెప్పినా, అధికారులు అంతంత మాత్రంగానే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 12 నియోజకవర్గాలకు ఆయన కోఆర్డినేటర్లను నియమించారు. వీరి ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, అక్షర ఉద్యమం లాంటి అంశాలపై ప్రతి గురువారం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా అక్షరోద్యమం... జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ‘ప్రకాశం అక్షర విజయం’ పేరుతో గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో పది లక్షల మంది నిరక్షరాస్యులున్నారని కలెక్టరు కార్యాలయం గుర్తించింది. అయితే చివరకు ఆరున్నర లక్షల మందిగా నిర్ణయించారు. వీరిని అక్షరాస్యులను చేయడానికి 34 వేల అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యాబోధకులుగా అంగన్వాడీ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించారు. అయితే వీరికి విద్యాబోధన చేసినందుకుగాను ఎటువంటి పారితోషికం ఇవ్వక పోవడంతో సిబ్బంది అక్షరాస్యత కేంద్రాలకు మొక్కుబడిగా హాజరవుతున్నారు. నిరక్షరాస్యులకు చదువు అంతంత మాత్రంగానే చెప్పడంతో, చదువుకోవడానికి వీరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది కాలంలో ఇటువంటి పలు కార్యక్రమాలను చేపట్టిన విజయకుమార్ రాజీవ్ విద్యా మిషన్ నిధులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నారనే అపవాదును మూట గట్టుకున్నారు. దీంతో పాటు కలెక్టరు కార్యాలయంలో ఉన్న క్యాంటీన్‌ను తొలగించారు. క్యాంటీన్లో దళారులు చేరుతున్నారని, అందుకే దాన్ని తొలగించినట్లు ఆయన చెప్పుకున్నారు. అయితే క్యాంటీన్ నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో, కలెక్టరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతి వాయిదాకు ఆయన హాజరుకాక తప్పడం లేదు. సమీక్షల్లో పారదర్శకత ఏదీ.. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కలెక్టరు జరిపే సమీక్ష సమావేశాలను పారదర్శకంగా నిర్వహిస్తుండగా, ప్రకాశం జిల్లా కలెక్టరు మాత్రం నాలుగు గోడల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల నిర్వహణలో ఇంత గోప్యం ఎందుకో అనే సందేహం పత్రికా ప్రతినిధులకు కలుగుతోంది. జిల్లా కలెక్టరు రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో మరింత సమర్థవంతంగా, మరిన్ని కార్యక్రమాలను చేపడతారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. -
నట్టేట ముంచుతున్న చిట్టీలు
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇటీవల ఐపీ పెడుతున్న ప్రైవేటు చిట్ వ్యాపారుల మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మురికి వాడల్లో పేదలే లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు దండుకుని నమ్మకంగా దోపిడీ చేస్తున్న వారికి కొందరు రాజకీయ నేతలు అండనివ్వడం గమనార్హం. ప్రైవేటు చిట్వ్యాపారులు కొన్ని ప్రాంతాల్ని ఎంచుకుని ఆయాచోట్ల ఇళ్లను అద్దెకు తీసుకోవడం లేదా స్థలాలు కొనుగోలు చేసి నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానికులతో మమేకమవుతూ ‘చిట్’లు వేస్తున్నారు. గుంటూరు మారుతీనగర్‌లో ఓ మహిళ ఇదే విధంగా చిట్లు నడిపి రూ.5 కోట్లకు శఠగోపం పెట్టింది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ మరుసటి రోజునే ఆమె కోర్టులో ఐపీ దాఖలు చేయడం, పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో సేఫ్‌జోన్ ఏర్పడింది. బాధితుల గోడు పట్టించుకున్న వారు లేరు.జిల్లాలో చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిధి ఒకరు ఆమెకు అండగా ఉండటంపై బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. అరండల్ పేట 13వ లైన్లో ఓ వడ్డీవ్యాపారి పేదలు చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం పైగా, చిట్ పాడిన వారివద్ద అప్పుగా కొంత మొత్తాన్ని మినహాయించుకోవడం వంటి ఫిర్యాదులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొండా వెంకటప్పయ్య కాలనీ, సంగడిగుంటతో పాటు ఏటీ అగ్రహారంలో కూడా ఇటీవల నలుగురైదుగురు చిట్ల వ్యాపారులు డబ్బుతో ఉడాయించిన సంఘటనలు వున్నాయి. పోలీసుల ఆరా మురికివాడల్లో డబ్బులను వడ్డీలకు తిప్పుతూ.. చిట్లు వేస్తున్న మోసగాళ్ల పై లాలాపేట, కొత్తపేట, పాతగుంటూరు, పట్టాభిపురం, నగరంపాలెం స్టేషన్ల పరిధిలో చాలామంది బాధితుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఎవరో ఒకరు బాధితులు చిట్ వ్యాపారులు, వడ్డీరాయుళ్ల మోసాలు, దౌర్జన్యాలపై ఎస్పీకి నేరుగా ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. ఈ మేరకు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి స్పందించి చిట్లు, వడ్డీరాయుళ్ల వ్యవహారాలపై ఫిర్యాదులను దర్యాప్తు చేసే బాధ్యతను క్రైం (సీసీఎస్) డీఎస్పీకి అప్పగించారు. దీంతో స్టేషన్లవారీగా ప్రైవేటు చిట్లు వేస్తున్న వారు, వడ్డీలకు తిప్పుతున్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.