సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కలెక్టరుగా జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా సత్ఫలితాన్నివ్వడం లేదు.
గ్రీవెన్స్‌కు బదులు ప్రజాదర్బార్..
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌సెల్ కు బదులు విజయకుమార్ నూతన పంథాలో ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని భావించారు. అయితే ఆశించిన ఫలితాలు లేవు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లలో ప్రజాదర్బారు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఒకటి, మూడు సోమవారాలు ఒంగోలులో, రెండో సోమవారం కందుకూరులో, నాలుగో సోమవారం మార్కాపురంలో నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా ప్రతి బుధవారం మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాదర్బారులో భాగంగా జిల్లా స్థాయి అధికారులందరినీ తీసుకెళ్లి, ఆయా కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఉంటున్నాయి. కలెక్టరు స్వయంగా చెప్పినా, అధికారులు అంతంత మాత్రంగానే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 12 నియోజకవర్గాలకు ఆయన కోఆర్డినేటర్లను నియమించారు. వీరి ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, అక్షర ఉద్యమం లాంటి అంశాలపై ప్రతి గురువారం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
లక్ష్యానికి దూరంగా అక్షరోద్యమం...
జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ‘ప్రకాశం అక్షర విజయం’ పేరుతో గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో పది లక్షల మంది నిరక్షరాస్యులున్నారని కలెక్టరు కార్యాలయం గుర్తించింది. అయితే చివరకు ఆరున్నర లక్షల మందిగా నిర్ణయించారు. వీరిని అక్షరాస్యులను చేయడానికి 34 వేల అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యాబోధకులుగా అంగన్‌వాడీ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించారు. అయితే వీరికి విద్యాబోధన చేసినందుకుగాను ఎటువంటి పారితోషికం ఇవ్వక పోవడంతో సిబ్బంది అక్షరాస్యత కేంద్రాలకు మొక్కుబడిగా హాజరవుతున్నారు. నిరక్షరాస్యులకు చదువు అంతంత మాత్రంగానే చెప్పడంతో, చదువుకోవడానికి వీరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
గత ఏడాది కాలంలో ఇటువంటి పలు కార్యక్రమాలను చేపట్టిన విజయకుమార్ రాజీవ్ విద్యా మిషన్ నిధులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నారనే అపవాదును మూట గట్టుకున్నారు. దీంతో పాటు కలెక్టరు కార్యాలయంలో ఉన్న క్యాంటీన్‌ను తొలగించారు. క్యాంటీన్‌లో దళారులు చేరుతున్నారని, అందుకే దాన్ని తొలగించినట్లు ఆయన చెప్పుకున్నారు. అయితే క్యాంటీన్ నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో, కలెక్టరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతి వాయిదాకు ఆయన హాజరుకాక తప్పడం లేదు.
సమీక్షల్లో పారదర్శకత ఏదీ..
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కలెక్టరు జరిపే సమీక్ష సమావేశాలను పారదర్శకంగా నిర్వహిస్తుండగా, ప్రకాశం జిల్లా కలెక్టరు మాత్రం నాలుగు గోడల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల నిర్వహణలో ఇంత గోప్యం ఎందుకో అనే సందేహం పత్రికా ప్రతినిధులకు కలుగుతోంది. జిల్లా కలెక్టరు రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో మరింత సమర్థవంతంగా, మరిన్ని కార్యక్రమాలను చేపడతారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
ప్రణాళికలు ఘనమైనా..
Published Tue, Jan 21 2014 6:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement