సాక్షి, హైదరాబాద్: ప్రజాదర్బార్ (ప్రజావాణి)లో ప్రధానంగా చాలామంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూ సమస్యలు పరిష్కరించాలని, ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని భరోసానిచ్చారు. దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతోపాటు అడ్రస్, ఫోన్ నంబర్‌ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.
జెన్‌కో పరీక్ష వాయిదాపై సీఎంతో మాట్లాడతాః మంత్రి శ్రీధర్‌బాబు
ఈ నెల 17న నిర్వహించనున్న జెన్‌కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కారి్మకులు విజ్ఞాపన పత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి పాల్గొన్నారు.
ఇప్పటివరకు 4,471 వినతులు
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజా భవన్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందాయి.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన వినతి పత్రాలే ఎక్కువగా ఉన్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment