సీఎం ఇలాకాలో.. డీఎస్పీ.. ఓ అవినీతి కథ | Chittoor District Police DSP Corruption Story | Sakshi
Sakshi News home page

సీఎం ఇలాకాలో.. డీఎస్పీ.. ఓ అవినీతి కథ

Published Sat, Oct 6 2018 4:36 AM | Last Updated on Sat, Oct 6 2018 4:36 AM

Chittoor District Police DSP Corruption Story - Sakshi

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆయన ఓ సీఐ. కానీ..ఓ నిఘా అధికారికి అత్యంత సన్నిహితుడు. ఆయన కోసం ప్రత్యేకంగా సూపర్‌ న్యూమరీ పోస్టు సృష్టించి మరీ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు.  సీఎం ఇలాకా చిత్తూరు జిల్లాలో ఆ డీఎస్పీ ఆడిందే ఆట..పాడిందే పాట. ఎర్రచందనం స్మగ్లింగ్‌ దగ్గర నుంచీ సెటిల్‌మెంట్ల వరకు ఆయన చేయని దందా లేదు. ఇలా అక్రమమార్గాల్లో పోగేసిన సొమ్ములో హైదరాబాద్‌లో చేర్చాల్సిన వారికి చేర్చి.. తన వాటాగా వచ్చిన సొమ్ముతో సమీకరించిన ఆస్తుల విలువ రూ.300 కోట్లకుపైగా ఉంటుందని పోలీసు అధికారవర్గాలే చెబుతున్నాయి.

పోలీసువనంలో గంజాయి మొక్కలా మారిన ఈ డీఎస్పీపై ఆ శాఖ వర్గాలే విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. 1991 బ్యాచ్‌కు చెందిన ఓ  ఎస్‌ఐ తొలుత రేణిగుంట సర్కిల్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత  అంచలంచలుగా ఎదిగారు.  కొన్నాళ్ల క్రితం సీఐగా పదోన్నతి పొందిన ఈ ఎస్‌ఐకు  సూపర్‌ న్యూమరరీ పోస్టును సృష్టించి మరీ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు నిఘా అధికారి. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలోని ఓ నియోజకవర్గానికి ఇన్‌చార్జి డీఎస్పీగా పోస్టింగ్‌ తెప్పించుకున్నారు.

పశ్చిమ మండలాల్లో బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేసే బాధ్యతను కూడా ఆ అధికారి తనకు అప్పగించారని ఆ డీఎస్పీ బాహటంగానే వ్యాఖ్యానిస్తుంటారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నా... ఈ డీఎస్పీనే సెటిల్‌ చేస్తుంటారు. జిల్లాకు చెందిన ఏ స్థాయి నాయకుడైనా ఈ డీఎస్పీ వద్దకు వెళ్లాల్సిందే. చిత్తూరు, తిరుపతిలో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి తమ సమస్యనో, సెటిల్‌మెంట్ల గురించో విన్నవిస్తే.. ఆయన పరిష్కరిస్తారు.

డాన్‌లకే డాన్‌ ఆ డీఎస్పీ..: అక్రమార్జనే ప్రధానంగా తన అవినీతి సామ్రాజ్యాన్ని డీఎస్పీ విస్తరించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఈ డీఎస్పీ స్మగ్లర్లను మించిపోయారనే ప్రచారం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో పనిచేసిన ఓ పోలీసు అధికారి ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాకు  శ్రీకారం చుట్టారు. ఓ మాజీ నక్సల్‌ ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా చేయించేవారు. అతని ద్వారా మరికొంతమందిని ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించుకునేవారు. సీఐకి తెలియకుండా ఎవ్వరూ ఎర్రచందనం అక్రమ రవాణా చేయడానికి వీలు లేని విధంగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టయిన ప్రముఖ మోడల్‌ సంగీత చటర్జీ నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన  ఆరోపణలున్నాయి. ఇటీవల రేణిగుంట పోలీస్టేషన్‌లో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో పిలుచుకొచ్చి అతన్ని తీవ్రంగా హింసించటంతో దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపించారు. అయితే స్మగ్లర్‌ మృతిపై ఎటువంటి విచారణ లేదు, ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈ డీఎస్పీనే కారణమనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ స్మగ్లర్ల వద్ద ఈ డీఎస్పీ రూ.కోటి నుంచి రూ.3 కోట్లు వసూలు చేసుకుని, అతనిపై సాధారణ కేసులు నమోదు చేస్తాడు. నాలుగైదు రోజుల్లో బైయిల్‌పై బయటకు వచ్చేలా చేసి.. యథావిధిగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి సహకారం అందించి భారీగా మామూళ్లు వసూలు చేసుకుంటుంటాడు.   


అక్రమ వ్యాపారాల్లో ఆరితేరిన డీఎస్పీ..
ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా పార్టీ నాయకులపై కేసు రిజిస్టర్‌ కావాలన్నా... ఎటువంటి  ‘పంచాయితీ’ చేయాలన్నా ఆ డీఎస్పీ నిర్ణయించాలి. ముఖ్యంగా ఇతర పార్టీ నేతలపై క్రిమినల్‌ కేసులన్నీ ఇతని కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. జిల్లాలోని మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటున్నాడు. దీంతో పాటు ఇసుకను బెంగళూరు, చెన్నైకు తరలి వెళ్తున్న అక్రమ రవాణాలో ఇతని అనుచరులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

అనుచరుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు..  ఇతరులు తరలిస్తున్న అక్రమ రవాణాలోనూ మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు విమర్శలున్నాయి. అంతటితో విడిచిపెట్టని డీఎస్పీ బియ్యం అక్రమరవాణా, క్వారీలు పేలుడు పదార్థాలు, గ్రానైట్‌ అక్రమ రవాణా ముఖ్య ఆదాయ వనరులుగా మార్చుకున్నాడు. గ్రానైట్‌ అక్రమ రవాణా ద్వారా ప్రతి నెలా రూ.50 లక్షల చొప్పున వసూలు చేసుకుంటున్నాడు. అదే విధంగా పశువులను కబేళాలకు తరలించే వారి నుంచి ప్రతి నెలా రూ.10 లక్షలు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

వందల కోట్లకు చేరిన అక్రమాస్తులు..
డీఎస్పీ అక్రమ సంపాదన నెలకు సుమారు రూ.కోట్లలో ఉంటుందని డిపార్ట్‌మెంట్‌ వారే చర్చించుకుంటున్నారు. వివిధ అక్రమ రవాణా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తిన ఆ డీఎస్పీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అమరావతి, తిరుపతి, చిత్తూరులో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న బంగళా విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. గాజులమండ్యం వద్ద సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో కెమికల్‌ ఫ్యాక్టరీ ఉంది. సత్యవేడు వద్ద మరో ఫ్యాక్టరీలో ఈ డీఎస్పీ భాగస్వామి అయినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే పరిశ్రమ యజమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంటాడు. అందులో భాగంగా గాజులమండ్యం వద్ద ఆరునెలల క్రితం ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఓ కార్మికుడు చనిపోయాడు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. డీఎస్పీ ఆ ఫ్యాక్టరీపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడాడు. ఎర్రచందనం అక్రమ రవాణా, సెటిల్‌మెంట్ల ద్వారా అక్రమంగా సంపాదించిన ధనంతో తిరుపతిలో విలాసవంతమైన పెంట్‌ హౌస్, ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో కొన్ని కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి.

కడప, చెన్నై, బెంగళూరులలో పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నాడు. పోలీస్‌శాఖలో చాలా మంది డీఎస్పీలు పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా.. వారిని కాదని సదరు అవినీతి డీఎస్పీని జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ఇన్‌చార్జి డీఎస్పీగా నియమితుడైన.. ఇతనిపై చర్యలు తీసుకోవడానికి ఏ అధికారి సాహసించక లేకపోతున్నారంటే ఇతనికి ఏ స్థాయిలో అండదండలున్నాయో  అర్థమౌతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement